రవాణాశాఖకు ఆదాయం ఫుల్‌

12 Oct, 2017 13:59 IST|Sakshi

జిల్లాల పునర్విభజన అనంతరం 9శాతం వృద్ధిరేటు  

గతేడాదితో పోలిస్తే ఆరుమాసాల్లోనే రూ.7.27 కోట్ల రాబడి

ఓవర్‌లోడ్‌ వాహనాలపై చర్యలు

వేగవంతం డీటీసీ చంద్రశేఖర్‌గౌడ్‌

నల్లగొండ : ఆదాయ వృద్ధిలో రవాణా శాఖ మెరుగైన ఫలితాలు సాధిస్తోందని ప్రాంతీయ రవాణా శాఖ అధికారి మామిళ్ల చంద్రశేఖర్‌గౌడ్‌ తెలిపారు. జిల్లాల పున ర్విభజన తర్వాత రవాణా శాఖలో తీసుకొచ్చిన వినూత్న మార్పులు ఆదాయ పెరిగేందుకు మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు. బుధవారం నల్లగొండలో డీటీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఉమ్మడి జిల్లాలో రవాణా శాఖ సాధించిన వృద్ధి రేటు వివరాలను వెల్లడించారు. ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఉన్న రవాణ శాఖ కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత మూడు జిల్లాలకు విస్తరించడంతో ప్రజలకు మరింత అందుబాటులో సేవలు అందించడం ద్వారానే ఆదాయ వృద్ధి సాధ్యమైందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఆరు మసాల్లోనే ఆదాయంలో 9శాతం వృద్ధి సాధించామని వివరించారు.

జీవితకాలపు పన్నులు, త్రైమాసిక పన్నులు, జరిమానాల రూపంలో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబ ర్‌ వరకు రూ.90.25 కోట్ల లక్ష్యానికిగాను రూ.87.23 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు డీటీసీ చెప్పారు. గతేడాది ఇదే రోజుల్లో ఉమ్మడి జిల్లా రూ.80 కోట్లు ఆదాయం వస్తే...ఈ ఏడాది దానికి అదనంగా రూ.7.23 కోట్లు పెరిగిందన్నారు. దీంతో పాటు కోదాడ, వాడపల్లి, నాగార్జునసాగర్‌ వద్ద ఉన్న రవాణా శాఖ చెక్‌ పోస్టుల నుంచి రూ.12.77 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. దీంట్లో కోదాడ చెక్‌ పోస్ట్‌ నుంచి రూ.5.92 కోట్లు, వాడపల్లి రూ.5.85 కోట్లు, నాగార్జునసాగర్‌ చెక్‌పోస్టు నుంచి రూ.కోటి ఆదాయం సమకూరిందని తెలిపారు.

ఓవర్‌లోడ్‌ వాహనాలపై ప్రత్యేక దృష్టి...
ప్రధాన రహదారులపై రాకపోకలు సాగిస్తున్న ఓవర్‌లోడ్‌ వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రధానంగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సిమెంట్‌ పరిశ్రమలు, రైస్‌ మిల్లుల నుంచి సామర్థ్యానికి మించిన బరువుతో వాహనాలు వస్తున్నాయని తద్వారా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వారం రోజుల్లో పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహిస్తామని డీటీసీ తెలిపారు.

మరిన్ని వార్తలు