‘సీసీఐ’ ముసుగు వ్యాపారులదే లొసుగు

31 Dec, 2018 02:07 IST|Sakshi

44 లక్షల క్వింటాళ్ల పత్తి ప్రైవేటు వ్యాపారులు కొంటే, సీసీఐ కొన్నది 7 లక్షల క్వింటాళ్లే 

వ్యాపారులు, సీసీఐ కుమ్మక్కు అయ్యారంటున్న రైతులు  

చైనా వైపు ప్రభుత్వ చూపు... ఆ దేశంతో ఇంకా ఖరారు కాని దిగుమతి ఒప్పందం 

సాక్షి, హైదరాబాద్‌: పత్తి కొనుగోళ్లలో వ్యాపారుల హవా నడుస్తోంది. మద్దతు ధర కంటే తక్కువకే కొంటున్నా రైతులు వ్యాపారులకే తెగనమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో భారత పత్తి సంస్థ (సీసీఐ) కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. అనేకచోట్ల సీసీఐ కేంద్రాలు సరిగా పనిచేయకపోవడం, కొన్నిచోట్ల వ్యాపారులు, సీసీఐ ప్రతినిధులు కుమ్మక్కు అవుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయంపై అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.  

చైనా వైపు సర్కారు చూపు... 
ఇక పత్తి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతాయా లేదా అన్న చర్చ జరుగుతోంది. దేశంలో పండించే పత్తిలో దాదాపు 20 శాతం వరకు చైనానే ఏటా దిగుమతి చేసుకుంటోంది. ఇక్కడ కొన్న పత్తితో బట్టలు తయారుచేసి అమెరికాకు చైనా ఎగుమతి చేస్తోంది.ఈ ఏడాది అమెరికా–చైనాల మధ్య వ్యాపార యుద్ధం జరుగుతుండటంతో ఏమేరకు చైనా బట్టలను అమెరికా కొంటుందో అంతుబట్టడంలేదు. దీనివల్ల ఇప్పటివరకు మన పత్తిని కొనుగోలు చేసే విషయంపై చైనా ఇప్పటివరకు ఎలాంటి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదని మార్కెటింగ్‌ వర్గాలు తెలిపాయి. భారత్‌ నుంచి చైనా ఏటా దాదాపు 70 లక్షల టన్నుల పత్తిని కొనుగోలు చేస్తుంది. అంటే మన రాష్ట్రంలో పండించే పత్తిలో దాదాపు రెట్టింపు దేశం నుంచి కొనుగోలు చేస్తోందన్నమాట. చైనా కొనుగోలుకు అనుమతి ఇచ్చే దానిపైనే పత్తి ధర ఆధారపడి ఉందని అంటున్నారు. వారం పది రోజుల్లో స్పష్టత వస్తుందని, ఆ తర్వాతే వ్యాపారులు ధర పెంచాలా వద్దా నిర్ణయిస్తారని చెబుతున్నారు. 

కంది వ్యాపారుల దందా... 
ఇక పత్తి అమ్మకాల  పరిస్థితి ఇలా ఉంటే కంది ధర మార్కెట్లో భారీగా పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 5,675 రూపాయలు ఉండగా, ప్రస్తుతం మార్కెట్లో కేవలం నాలుగు వేల రూపాయల నుంచి రూ. 4,500 మాత్రమే పలుకుతోంది. దాదాపు 130 వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మార్క్‌ఫెడ్‌ భావించగా, ఇప్పటివరకు కేవలం 12 కేంద్రాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. దీంతో ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్న కందిని కొనుగోలు చేసే పరిస్థితి లేదు. దీంతో అనేకచోట్ల రైతులు నష్టానికి అమ్ముకుం టున్నారు. ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతుల నుంచి విన్నపాలు వస్తున్నా పట్టించుకోవడంలేదు.మరోవైపు రూ.712 కోట్ల విలువైన 41.93 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్నను మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసింది. ఇంకా పలుచోట్ల మొక్కజొన్న అందుబాటులో ఉన్నా కొనుగోలు కేంద్రాలను కొనసాగించడానికి మార్క్‌ఫెడ్‌ ఆసక్తి చూపించడంలేదని తెలిసింది.దీంతో అక్కడక్కడా రైతులు అసంతృప్తితో ఉన్నారు. కొనుగోళ్లపై వివరణ కోరేందుకు మార్క్‌ఫెడ్‌ ఎండీ భాస్కరాచారిని ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.  

ప్రైవేటులోనే అధికంగా కొనుగోలు... 
ఈ ఏడాది పత్తికి మద్దతు ధర భారీగా పెరిగింది. పత్తి క్వింటాలుకు రూ. 5,450 పలుకుతోంది. దీంతో వ్యాపారుల్లోనూ ఆశ పెరిగింది. తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు సీసీఐ వద్దే అమ్ముకునేందుకు పన్నాగం పన్నారు. వారి కుట్ర ఫలించింది. రైతుల వద్ద క్వింటాలుకు రూ. 4,500 నుంచి రూ. 5 వేల వరకు కొని, సీసీఐ వద్ద రూ. 5,450కు విక్రయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అంతేగాక భవిష్యత్తులో ధర మరింత పెరిగే అవకాశముందన్న భావనతోనూ వారు కొంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రైవేటు వ్యాపారులు రాష్ట్రంలో రైతుల నుంచి 44.04 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. కానీ సీసీఐ మాత్రం కేవలం 7.09 లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసింది. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది రైతులు పత్తి పండిస్తే ఇప్పటివరకు సీసీఐ కొన్నది 28,947 మంది రైతుల నుంచేనని అర్థమవుతోంది. ఈ ఏడాది 3.5 కోట్ల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేశారు. పత్తిని గులాబీ పురుగు పట్టి పీడించడం, ఇటీవల కురిసిన వర్షాలు తదితర కారణాల వల్ల అనుకున్నస్థాయిలో దిగుబడి ఉండకపోవచ్చని అంటున్నారు.  

మరిన్ని వార్తలు