విజయవంతంగా ప్రాజెక్టుల నిర్మాణం 

14 Jul, 2018 12:37 IST|Sakshi
ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో విజయవంతంగా ముందుకు సాగుతున్నామని భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ను మంత్రి సందర్శించారు. ప్రాజెక్ట్‌లోని నీటిమట్టంతోపాటు ప్రాజెక్ట్‌ తాజా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు కూడా తాజా నివేదికను మంత్రికి అందించారు. మంత్రి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రాజెక్ట్‌లను పూర్తిచేసి సాగు, తాగునీటి సౌకర్యాలు మెరుగుపరిచామని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ భూసేకరణకోసం రూ.600 కోట్లు కేటాయించి పునరావాస పరిహారాన్ని నిర్వాసితులకు అందించామని తెలిపారు. ప్రాజెక్ట్‌ నిర్మాణంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలం కాగా సీఎం కేసీఆర్‌ ఒక లక్ష్యంతో ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపడుతూ అభివృద్ధిలో దూసుకుపోతున్నామన్నారు.

తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని పేర్కొనడం కాంగ్రెస్‌ అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో గ్రామాలు ముంపునకు గురికాకుండా రూపకల్పన చేసి నిర్మించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజీని 16 టీఎంసీల నీటి సామర్థ్యంతో 85 గేట్లతో నిర్మిస్తుండగా, అన్నారం వద్ద బ్యారేజీని 11 టీఎంసీల నీటిసామర్థంతో 66 గేట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. సుందిళ్ల వద్ద నిర్మిస్తున్న బ్యారేజీ కూడా 9 టీఎంసీల నీటితో మొత్తం 74 గేట్లతో నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో 100 కిలోమీటర్ల భూగర్భజలాలు పెరుగుతాయని తెలిపారు. మంత్రి వెంట ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ సీఈ వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ విజయ్‌కుమార్, ఈఈ సత్యరాజ్‌చంద్ర, డీఈ రాజమల్లు, ఏఈఈ శివసాగర్‌ ఉన్నారు.
 

మరిన్ని వార్తలు