ఉద్యోగాలు జో ‘నిల్‌’

6 Dec, 2019 02:46 IST|Sakshi

నూతన జోనల్‌ విధానంతో సర్కారీ ఉద్యోగాల నియామక ప్రక్రియకు బ్రేక్‌

ఇప్పటికీ కొలిక్కిరాని జిల్లా, జోనల్, మల్టీజోనల్‌ ఉద్యోగుల విభజన

దీంతో ప్రభుత్వం ఆమోదించిన పోస్టుల భర్తీకి తొలగని ఆటంకాలు... టీఎస్‌పీఎస్సీ, గురుకుల, మెడికల్‌ బోర్డుల పరిధిలో భర్తీకి సిద్ధంగా 8,547 పోస్టులు

ఉద్యోగుల విభజన పూర్తయ్యే వరకు వీటికి నోటిఫికేషన్లు కష్టమే

ప్రభుత్వ శాఖల్లో కొత్త నియామకాలు ఇప్పట్లో కష్టమే. గతేడాది ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా అమల్లోకి వచ్చిన జోనల్‌ విధానంతో ఈ పరిస్థితి తలెత్తింది. అంతకుముందున్న విధానంతో ఉద్యోగాలను భర్తీ చేసిన నియామక సంస్థలు కొత్త జోనల్‌ విధానం అమల్లోకి రావడంతో ఉద్యోగాల ఖాళీల భర్తీ నోటిఫికేషన్ల విడుదలకు బ్రేక్‌ వేశాయి. ప్రభుత్వం ఆమోదించిన పోస్టులను సైతం భర్తీ చేయకుండా వాయిదా వేశాయి. దాదాపు ఏడాదిన్నర నుంచి వివిధ నియామక సంస్థలు ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల చేయలేదు. కొత్త విధానం ప్రకారం ఉద్యోగుల విభజన, పోస్టుల సర్దుబాట్లు, ఖాళీలపై స్పష్టత వచ్చే వరకు నూతన నియామకాలు చేపట్టే అవకాశాలు లేవనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సర్కారీ కొలువుపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం మరికొంతకాలం వేచిచూడాల్సిందే. – సాక్షి, హైదరాబాద్‌

కొత్త విధానమేమిటంటే.. 
రాష్ట్రంలో నూతన జోనల్‌ విధానాన్ని ఆమోదిస్తూ గత ఆగస్టులో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధానం ప్రకారం రాష్ట్రాన్ని రెండు మల్టీజోన్లు, ఏడు జోన్లు, 31 జిల్లాలుగా విభజించారు. ఉత్తర్వులు వెలువడిన తర్వాత కొత్తగా మరో రెండు జిల్లాలు ఏర్పాటు కావడంతో జిల్లాల సంఖ్య 33కు పెరిగింది. దీంతో మల్టీజోన్లు, జోన్ల పరిధిలో ఏయే జిల్లాలు వస్తాయనే అంశంపై స్పష్టత లేదు. రాష్ట్రంలో ఇదివరకు రెండు జోన్లు, 10 జిల్లాల మేరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు.

కొత్త జోనల్‌ విధానం అమల్లోకి రావడంతో స్థానికత, కేడర్‌ ఆధారంగా మల్టీజోన్లు, జోన్లు, జిల్లా స్థాయిలో ఉద్యోగులను విభజించాలి. దీనికి ప్రతి ఉద్యోగికి ఆప్షన్‌ ఇవ్వాలి. ఉద్యోగుల సుముఖత, శాఖల సౌలభ్యం ప్రకారం విభజన ప్రక్రియ పూర్తయితేనే కేటగిరీల వారీగా పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య, ఖాళీలపై స్పష్టత వస్తుంది. ఈ రెండు ప్రధాన కారణాలతో ఉద్యోగ నియామకాలకు బ్రేక్‌ పడింది.

ఆ నోటిఫికేషన్ల సంగతి.. 
గతేడాది రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడే నాటికే ప్రభుత్వం కొన్ని రకాల పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈమేరకు ఆయా శాఖల వారీగా ప్రతిపాదనలు సంబంధిత నియామక సంస్థలకు పంపగా.. నోటిఫికేషన్ల రూపకల్పన దాదాపు పూర్తయింది. చివరి నిమిషంలో రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడటం.. కొత్త విధానం తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించడంతో ఆ నోటిఫికేషన్లు నిలిచిపోయాయి.

టీఎస్‌పీఎస్సీ, గురుకుల, మెడికల్‌ బోర్డుల పరిధిలో 8,547 పోస్టులు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి. టీఎస్‌పీఎస్సీ పరిధిలో గ్రూప్‌–1 కేటగిరీలో 138, గ్రూప్‌–2 కేటగిరీలో 60, గ్రూప్‌–3 కేటగిరీలో 339, అదేవిధంగా 117 అసిస్టెంట్‌ ఇంజనీర్, 58 డ్రాఫ్ట్‌మన్, 68 దేవాదాయ, 31 అటవీ అధికారి, 260 రెవెన్యూ అధికారి, 287 కార్మిక ఉపాధి కల్పన, 208 రోడ్డు రవాణా సంస్థ విభాగాలతో పాటు మరిన్ని శాఖల్లో సింగిల్‌ డిజిట్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటికి సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేసే క్రమంలో కొత్త జోనల్‌ విధానం అమల్లోకి వచ్చింది.

►తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు పరిధిలో సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్, లైబ్రేరియన్, క్రాఫ్ట్, ఆర్ట్, జూనియర్‌ అసిస్టెంట్, టైపిస్ట్, స్టాఫ్‌ నర్సు కేటగిరీల్లో దాదాపు 2,440 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ బోర్డు నుంచి ఏడాదిన్నరగా నోటిఫికేషన్లు విడుదల కాలేదు. 
►తెలంగాణ రాష్ట్ర వైద్య నియామకాల బోర్డు పరిధిలో కూడా డాక్టర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, నర్స్, హెల్త్‌ అసిస్టెంట్‌ తదితర కేటగిరీల్లో 4,150 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ ఇప్పటివరకు నోటిఫికేషన్లు వెలువడలేదు.

మరిన్ని వార్తలు