లింగనిర్ధారణ గురించి తెలిస్తే నేరుగా నాకే ఫోన్‌ చేయండి

26 Jul, 2018 08:56 IST|Sakshi
బేటి బచావో–బేటి పడావో అమలులో భాగంగా శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్‌ యోగితారాణా

జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా

సాక్షి, సిటీబ్యూరో :  లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే కేంద్రాల సమాచారం అందించే వారికి హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. తనకు నేరుగా ఎస్‌ఎంఎస్, ఫోన్‌  ద్వారా సమాచారాన్ని తెలియజేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు ప్రోత్సాహాకాలు అందిస్తామని  వెల్లడించారు. వివరాలు తెలిసిన వారు 9491033000 నెంబరుకు సమాచారమివ్వవచ్చన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమం అమలులో భాగంగా  ఎస్పీహెచ్‌ఓలు, మెడికల్‌ ఆఫీసర్లు, ఎఎన్‌ఎంలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో  పీసీపీఎన్‌డీటీ, కేసీఆర్‌ కిట్, ఇమ్యూనైజేషన్, డీవార్మింగ్,  పోషకాహారలోపం తదితర అంశాల గురించి వివరించారు. గర్భస్థ శిశు లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహించడం, బహిరంగ పర్చడం చట్ట విరుద్ధమే కాక,  ఆనైతికమైనదని కలెక్టర్‌  పేర్కొన్నారు.లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహంచే స్కానింగ్‌  సెంటర్లతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా  సహకరించినా, పాల్గొన్న ప్రతి ఒక్కరు శిక్షార్హలేనని  స్పష్టం చేశారు.

కుటుంబంలో ఆడ, మగ అనే తేడాలు ఉండరాదని, లింగ వివక్ష వలన జరిగే  నష్టాల గురించి కుటుంబ పెద్దలకు  అవగాహన కల్పించాలని చెప్పారు. భ్రూణ హత్యల వలన సామాజిక సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పారు.  తల్లీ బిడ్డలకు  మూడు నెలలు ఉపయోగపడే 16 రకాల వస్తువులను కేసీఆర్‌ కిట్‌ ద్వారా ప్రభుత్వం ఇస్తుందన్నారు.

మరిన్ని వార్తలు