జిమ్‌ చేస్తూ యువకుడి మృతి 

30 Apr, 2019 01:01 IST|Sakshi

హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌ నగర్‌లో ఘటన

జిమ్‌ సెంటర్‌పై కేసు నమోదు 

హైదరాబాద్‌: సరైన శిక్షణ లేకుండా జిమ్‌ చేస్తూ కొందరు యువకులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సోమవారం ఎస్‌ఆర్‌నగర్‌లోని గోల్డెన్‌ జిమ్‌లో ఆదిత్య (30) అనే యువకుడు జిమ్‌ చేసిన అనంతరం అస్వస్థతకులోనై మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పంజాబ్‌కు చెందిన ఆదిత్య బీకేగూడలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ డిజిటల్‌ మార్కెటింగ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పక్కనే ఉన్న గోల్డెన్‌ జిమ్‌లో ప్రతిరోజు ఉదయం కసరత్తులు చేసేవాడు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో జిమ్‌కు వచ్చిన ఆదిత్య గంటపాటు ఎప్పటిలాగే జిమ్‌ చేశాడు. ఆ తర్వాత కడుపులో నలతగా ఉందని, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని నిర్వాహకులతో చెప్పి కుప్పకూలిపోయాడు. అయితే ఆదిత్యను నిర్వాహకులు ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయలేదు. ఆదిత్య స్నేహితుడు హుసేన్‌కు వారు ఫోన్‌ చేయగా హుసేన్‌ ఆదిత్యను ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంటికి వెళ్లాక పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స నిమిత్తం సనత్‌నగర్‌లోని నీలిమా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆదిత్య అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గోల్డెన్‌ జిమ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. జిమ్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

మాత్రలు వేసుకున్నానని చెప్పాడు 
‘ఆదిత్యకు ఉదయం ఫోన్‌ చేస్తే తీయలేదు. దీంతో అతడిని తీసుకువచ్చేందుకు జిమ్‌కు వెళ్లాను, అప్పటికే ఆదిత్య పరిస్థితి విషమంగా ఉంది. ఇంటికి తెచ్చాక పరిస్థితి విషమంగా మారడంతో ‘జిమ్‌లో ఏమైనా తిన్నావా’అని అడిగాను. జీఎంజీ మాత్ర వేసుకున్నానని ఆదిత్య చెప్పడంతో జిమ్‌ ట్రైనర్‌ అఖిల్‌కు ఫోన్‌ చేసి పరిస్థితిని వివరించాను. ఆయన సలహా మేరకు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాను’అని స్నేహితుడు హుసేన్‌ తెలిపాడు. అయితే జిమ్‌ చేసేముందు మాత్రలు వేసుకున్నాడా లేక అస్వస్థతకు గురైన అనంతరం మాత్ర వేశారా అన్నది తెలియాల్సి ఉంది.  

మరిన్ని వార్తలు