మాయమాటలు చెప్పి వృద్ధుడి ఉంగరాలతో పరారీ

26 Jul, 2018 09:22 IST|Sakshi
హన్మయ్యగౌడ్‌

తాండూరు రంగారెడ్డి : వృద్ధుడి చేతి ఉంగరాలను ఓ వ్యక్తి చాకచక్యంగా ఎత్తుకెళ్లాడు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బొంరాస్‌పేట్‌ మండలం రాన్‌పూర్‌ గ్రామానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు హన్మయ్యగౌడ్‌ బుధవారం తాండూరు పట్టణానికి వచ్చాడు.

పట్టణంలో ఉంటున్న కొడుకు విద్యాసాగర్‌ను కలిసి బ్యాంకులో పని ఉందని నడుచుకుంటూ శాంత్‌ మహల్‌ టాకీస్‌ మార్గంలో వెళ్తుండగా చైతన్య జూనియర్‌ కళాశాల సమీపంలో ఓ వ్యక్తి వచ్చి చేతికి బంగారపు ఉంగరాలు పెట్టుకుంటే పొలీసులు కోప్పడుతున్నారని, బ్యాగులో పెట్టుకోమంటూ మాటలు కలిపాడు. 

ఆయన ఉంగరాలు తీస్తుండగా గిల్టు నగల్లా ఉన్నాయని చెప్పి హన్మయ్య గౌడ్‌ నుంచి చూసిస్తానని తీసుకున్నాడు. బ్యాగులో వేయకుండా ఉంగరాలను తీసుకుని పరారయ్యాడు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు క్షణాల వ్యవధిలో వ్యక్తి కనుమరుగయ్యాడు.

సంఘటనతో తేరుకున్న హన్మయ్యగౌడ్‌ స్థానికులకు జరిగిన విషయం చెప్పి మొరపెట్టుకున్నాడు. పోలీస్‌ స్టేషన్‌లో సీసీ కెమెరాలు ఉంటాయని అందులో దొంగ దొరికి పోతాడని సలహా ఇవ్వడంతో స్టేషన్‌కు వెళ్లి ఎస్సైకి జరిగిన విషయం చెప్పాడు.

దీంతో ఎస్సై సమిఉజ్‌జమ వెంటనే పోలీసులను అప్రమత్తం చేసి సీసీ కెమెరాలలో దొంగిలించిన వ్యక్తిని గుర్తిం చారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు