సెల్‌టవర్‌ ఎక్కి యువకుడి హల్‌చల్‌

21 Feb, 2019 10:40 IST|Sakshi

రాజేంద్రనగర్‌: ఓటరు లిస్టు నుంచి తన పేరును తొలగించారంటూ ఓ యువకుడు రాజేంద్రనగర్‌ బుద్వేల్‌లోని సెల్‌ టవర్‌ ఎక్కి హంగామా చేశాడు. బంధువులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో గంట తర్వాత కిందకు దిగి వచ్చాడు. పొంతన లేకుండా మాట్లాడుతుండడంతో పోలీసులు హెచ్చరించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిలుకూరు ప్రాంతానికి చెందిన శ్రావణ్‌కుమార్‌(28) గతంలో కిస్మత్‌పూర్‌ ఉండేవాడు. మంగళవారం రాత్రి కిస్మత్‌పూర్‌ ప్రాంతానికి వచ్చి మద్యం సేవించాడు. అనంతరం స్థానికంగా ఉన్న బంధువుల ఇళ్ల వద్దకు వెళ్లి పొంతన లేని మాటలు మాట్లాడుతూ ఇబ్బంది పెట్టాడు.

రాత్రి 11 గంటల వరకు బస్తీలో తిరుగుతుండడంతో యువకులు అతడిని ఇంటికి వెళ్లాలని రోడ్డుపైకి తీసుకువచ్చి వదిలి వేశారు. బుధవారం ఉదయం 9గంటల ప్రాంతంలో బుద్వేల్‌ ప్రాంతానికి చేరుకున్నాడు. ఈ ప్రాంతంలో ఉన్న సెల్‌టవర్‌ ఎక్కి అరుస్తూ కేకలు వేస్తూ దూకుతానని బెదిరించాడు. స్థానికులు గమనించి రాజేంద్రనగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కిస్మత్‌పూర్‌లోని వారి బంధువులు, గ్రామస్తులను పిలిపించి సముదాయించి కిందకు దించారు. కిందకు దిగిన అనంతరం శ్రావణ్‌కుమార్‌ తన ఓటును తీసివేశారని నాయకులు తనకు ఏమి చేయడం లేదని, మంత్రులు, ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదంటూ ఉద్యమంలో తీవ్రంగా నష్టపోయానని పొంతన లేని సమాధానాలు ఇస్తూ అందరిని దూషించాడు. దీంతో పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లి సముదాయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు