డబుల్‌ బెడ్‌రూం కోసం సెల్‌టవర్‌ ఎక్కి..

30 Nov, 2019 10:48 IST|Sakshi
సెల్‌ టవర్‌ ఎక్కిన దృశ్యం (ఇన్‌సెట్‌) నరేష్‌

అధికారులు హామీ ఇవ్వడంతో  దిగిన వైనం

సాక్షి, కామేపల్లి\ ఖమ్మం​: అర్హత ఉన్న తనకు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మంజూరు చేయలేదని, రెవెన్యూ అధికారులు అనర్హులకు మంజూరు చేశారని మనస్తాపానికి గురై సెల్‌ టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేసిన సంఘటన   కామేపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు స్థానికులు తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి.. కామేపల్లిలో ప్రభుత్వం నిర్మించిన 20 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు సర్పంచ్‌ అజ్మీర రాందాస్‌ అధ్యక్షతన  శుక్రవారం గ్రామ సభను ఏర్పాటు చేసి లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసి ఇంటి నంబర్లను కేటాయించారు.   అజ్మీర నరేష్‌ అనే యువకుడు తనకు డబుల్‌ బెడ్‌రూం ఇవ్వాలని కోరుతూ పక్కనే ఉన్న సెల్‌ టవర్‌ ఎక్కి దూకుతానని హల్‌చల్‌ చేశాడు. ఎస్సై తిరుపతిరెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకొని టవర్‌ దిగి రావాలని పలుమార్లు కోరారు. తనకు ఇల్లు ఇవ్వాలని, సర్వేను తప్పుదోవ పట్టించిన రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు.

నరేష్‌ సెల్‌ టవర్‌పై ఉండటంతో పలువురు ఫోన్‌ చేస్తుండగా సెల్‌ను కూడా కిందపడేశాడు. తన డిమాండ్‌ తీర్చాలని లేనిచో దూకుతానన్నాడు. జెడ్పీటీసీ సభ్యుడు బానోత్‌ వెంకటప్రవీణ్‌కుమార్‌నాయక్‌ సంఘటనా స్థలానికి చేరుకుని కలెక్టర్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ బి.శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని రెవెన్యూ అధికారుల ద్వారా తెలుసుకున్నారు. జెడ్పీటీసీ సభ్యులు, సీఐ, ఎస్సై సమస్యను పరిష్కారం చేస్తామని, కలెక్టర్‌ హామీ ఇచ్చారని సెల్‌ టవర్‌ దిగి రావాలని కోరారు. దీంతో నరేష్‌ సెల్‌ టవర్‌ దిగి వచ్చాడు. కాగా పంచాయతీ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ డ్రా పద్ధతి ద్వారా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తామని, 41 మందిలో ఎవరైనా అనర్హులు ఉంటే ఫిర్యాదు బాక్స్‌లో దరఖాస్తు వేయాలని, అర్హులనే గుర్తించి ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.


 

మరిన్ని వార్తలు