జగదంబాదేవి భక్తుడు ప్రవీణ్‌ బాబా

17 Mar, 2020 10:33 IST|Sakshi

సాక్షి, కెరమెరి(ఆసిఫాబాద్‌): ఒక రోజు కడుపులో మెతుకులు పడకుంటే అల్లాడుతుంటాం.  ఆవురావురంటాం.. అలాంటిది ఒకటి కాదు, కాదు రెండు కాదు.. అక్షరాల ఆరు మాసాల నుంచి భోజనం లేకుండా కేవలం పాలతో కాలం వెల్లదీస్తున్నాడు ఆ భక్తుడు.  దేవుని(జగదంబా దేవి) భక్తిలో లీనమై ప్రజలకోర్కెలను, వారి కష్టాలను తీర్చుతున్నాడు ఓ ఆధ్యాత్మికుడు. కనిపించేందుకు చిన్న వయస్సే కానీ ఆయనలో దేవుడు ఆవిహించి సత్కర్యాలు చేయిస్తుందని భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతోనే రోజు ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రాంతాలకు చెందిన భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి దేవుడి సేవలో నిమగ్నమవుతున్నారు. ప్రతి రోజు మూడు సార్లు హోమం, మహాయజ్ఞం కొనసాగుతోంది. 

రాళ్లు రప్పలపై భక్తుల ప్రయాణం...
కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలోని లక్మాపూర్‌ గ్రామానికి ఆనుకుని ఉన్న అభయారణ్యంలో ఆ బాబా తడకలతో తయారు చేసిన ఓ కుటీరాన్ని భక్తుల సాయంతో నిర్మించుకున్నారు. లక్మాపూర్‌ గ్రామం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే ఆ కుటీరానికి వెళ్లాలంటే ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. రాళ్లు రప్పల దారిలో వెళ్లాల్సిందే. ప్రస్తుతం సేవాలాల్‌ దీక్షలో ఉన్న కారణంగా సేవాలాల్‌ భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. మూడుసార్లు కొనసాగే మహాయజ్ఞం, హోమం, ఇత్యాది పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అక్కడున్న సేవకులు భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహాశివ రాత్రి నుంచి మహాయజ్ఞం ప్రారంభమైంది. వచ్చే నెలలో జరిగే శ్రీరామ నవమి వరకు పూజలు కొనసాగుతాయి. 

అసలేం జరిగిందటే!
కెరమెరి మండలంలోని లక్మాపూర్‌ గ్రామానికి చెందిన రాథోడ్‌ లాలు, కమ్లాబాయి దంపతులకు ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కొడుకులు వారిలో చిన్నివాడైన రాథోడ్‌ ప్రవీణ్‌కు జగదంబాదేవి కలలో వచ్చింది. మీ గ్రామానికి దక్షణాన అడవిలో మర్రి చెట్టు ఉందని, అక్కడికి వెళ్లి ధ్యానించని కోరిన కోర్కెలు తీరుతాయని చెప్పింది. దీంతో అక్టోబర్‌ 22–2017లో కలలో వచ్చిన చెట్టు ప్రాంతాన్ని వెతుక్కుంటూ వెళ్లి రోజులుగా ధ్యానం చేపట్టాడు. ఇది తెలుసుకున్న కొందరు యువకులు ఆయనకు ప్రతి రోజు పాలు, నీళ్లను అందించారు. అనంతరం గత 19 నవంబర్‌ నుంచి పూర్తిగా ఆహారం తినకుండా దైవ లీలాగానంలోనే ఉన్నాడు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ధ్యానం చేపట్టిన ప్రాంతానికి సమీపంలో రవీందర్, రోహిదాస్, అరవింద్‌ సహకారంతో తడకలతో కుటీరాన్ని వేర్పాటు చేసుకున్నారు. కొన్ని సౌకర్యాలను అనార్‌పల్లి సర్పంచ్‌ రాథోడ్‌ శేషరావు కల్పిస్తున్నారు. భక్తులకు ప్రవీణ్‌ ప్రవచనాలు చెబుతున్నాడు. 

మరిన్ని వార్తలు