పబ్లిక్‌లో ఎస్సైకి ముద్దుపెట్టిన యువకుడు..

29 Jul, 2019 19:30 IST|Sakshi

హైదరాబాద్‌ : పోలీసులు వస్తున్నారంటే మాములుగా జనాలు భయపడిపోతారు. కానీ ఓ యువకుడు మాత్రం ఏకంగా విధుల్లో ఉన్న ఎస్సైకి ముద్దుపెట్టాడు. ఈ ఘటన హైదరాబాద్‌ వెస్ట్‌ జోన్‌ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోనాల వేడుకల్లో భాగంగా పలువురు యువకులు రోడ్డుపై చిందులేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. అదే సమయంలో అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న ఎస్సై మహేందర్‌ అటుగా వెళ్తున్నారు. అయితే ఒక్కసారిగా ఆ గ్యాంగ్‌లోని ఓ యువకుడు ఎస్‌ఐ దగ్గరకు వెళ్లి ఆయనకు ముద్దుపెట్టాడు. దీంతో ఉలిక్కిపడ్డ ఎస్‌ఐ ఆ యువకుడిని పక్కకు నెట్టాడు. ఆ తర్వాత అతనిపై కోపం ప్రదర్శించకుండా.. సంయమనం పాటించాడు. కోపాన్ని దిగమింగుకుంటూ ఎస్సై అక్కడి నుంచి వెళ్లిపోయారు. యువకుడు మద్యం మత్తులో ఉండి ఈ విధంగా ప్రవర్తించినట్టుగా తెలుస్తోంది. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. యువకుడు మద్యం మత్తులో తనతో అమర్యాదగా ప్రవర్తించాడని అర్థం చేసుకుని.. అతన్ని ఏమి అనకుండా అక్కడి నుంచి వెళ్లిపోయిన ఎస్సైని పలువురు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వార్తలు