అయ్యా.. ఆదుకోండి

28 Oct, 2017 19:08 IST|Sakshi

రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయున యువకుడు

నడుము, కాలు విరిగి చికిత్స పొందుతున్న భార్య

ఇప్పటికే వైద్యానికి రూ.5 లక్షల ఖర్చు 

ప్రభుత్వం ఆదేకోవాలని వేడుకోలు 

కరీంనగర్ జిల్లా : ఓ రోడ్డు ప్రమాదం ఆ దంపతులిద్దరినీ వికలాంగులను చేసింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన భర్త కాలు కోల్పోగా, భార్య నడుము, కాలు విరిగాయి. ఇద్దరూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. చికిత్స కోసం ఇప్పటికే అప్పుచేసి రూ.5 లక్షలు ఖర్చు చేశారు. పూర్తిగా కోలుకునేందుకు కనీసం మరో రూ.3 లక్షల వరకు అవుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. కూలీ చేసుకుని బతికే తమ ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు. 

బుగ్గారం మండలం మద్దునూర్‌కు చెందిన బండారి స్వరూప–సత్తెన్న దపంతులకు ఇద్దరు కూమారులు ఉన్నారు. తమకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కూలీ ప నులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. క్రమంలో  పెద్ద కొడుకు హరీశ్‌(27) రెండేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం గల్ఫ్‌వెళ్లాడు. అక్కడ సరైన ఉపాధిలేక స్వగ్రామానికి వచ్చాడు. గ్రామంలో వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. ఈనెల 25న ధర్మపురిలోని బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో హరీశ్‌ తన భార్య రిషిత, కూతరు ప్రజ్యోతితో కలిసి «బైక్‌పై ధర్మపురికి బయల్దేరాడు.

 గ్రామ శివారులోని  పెట్రోలు పంపు సమీపంలో బస్సును ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఎదురుగా వచ్చిన వరంగల్‌కు చెందిన కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. కూతురుకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు హరీశ్‌ కాలు పూర్తిగా విరిగిందని, రిషిత నడుము ఎముకలు, కాలు ఫ్యాక్చర్‌ అయ్యాయని నిర్ధారించారు. హరీశ్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు పంపించారు. రిషితకు కరీంనగర్‌లో చికిత్స చేస్తున్నారు. 

కాలు తొలగింపు.. 
కారు డీకొట్టిన సంఘటనలో హరీశ్‌ కాలు పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో హైదరాబాద్‌లో వైద్యులు గురువారం దానిని తొలగించారు. మరోవైపు కరీంనగర్‌లో చికిత్స పొందుతున్న అతడి భార్య రిషిత కోలుకుంటోంది. ప్రస్తుతం ఇద్దరికీ ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు స్పష్టం చేశారు. అయితే పూర్తిగా కోలుకోవడానికి మరో రూ.3 లక్షల అవసరమని తెలిపారు. ఇప్పటికే తెలిసిన వారివద్ద అప్పులు చేసి మూడు రోజుల్లో చికిత్సకు రూ.5 లక్షలు ఖర్చు చేశామని, తమ ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం, దాతలు సాయం అందించాలని హరీశ్‌ దంపతులు, అతడి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు