చూస్తుండగానే.. నడిరోడ్డుపై యువకుడి మృతి

8 Jul, 2020 14:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈసీఐఎల్ చౌరస్తాలో బుధవారం మధ్యాహ్నం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. చూస్తుండగానే ఓ యువకుడు రోడ్డుపై కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన అతన్ని ఆస్పత్రికి తరలించేయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది. యువకుడు అప్పటికే మృతి చెందినట్టు 108 సిబ్బంది నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువకుడి వెంటే ఉన్న అతని తల్లి, చెల్లి, భార్య గుండెలవిసేలా రోదించారు. మృతుడు జవహర్ నగర్ కు చెందిన పృథ్వీరాజ్‌గా తెలిసింది. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతన్ని స్థానికంగా ఉండే జీనియా ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

జీనియా ఆస్పత్రి సిబ్బంది వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మరో ఆస్పత్రికి తీసుకెళ్లండని ఉచిత సలహా ఇచ్చారు. దీంతో గత్యంతరం లేక యువకుడిని తీసుకుని కుటుంబ సభ్యులు బయటికొచ్చారు. వేరే ఆస్పత్రికి తీసుకెళ్దామని ఆటో కోసం చూస్తున్నారు. అంతలోనే ఘోరం జరిగిపోయింది. యువకుడు అనూహ్యంగా కిందపడి మృత్యువాత పడ్డాడు. పృథ్వీరాజ్‌ను ఆస్పత్రికి తరలించేందుకు సాయం కోసం ఎంత అర్థించినా ఎవరూ ముందుకురాలేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కరోనా భయాలతో సాటిమనిషిని పట్టించుకోవడం మానేశారని వాపోయారు.
(చదవండి: కరోనా బిల్లులతో కన్నీటిపర్యంతమైన డాక్టర్‌)

మరిన్ని వార్తలు