బైక్‌ డ్రెయినేజీలో.. శవం రైలు పట్టాల పక్కన

3 Jun, 2018 09:56 IST|Sakshi
రైల్వేట్రాక్‌ పక్కన యువకుడి మృతదేహం

నిజామాబాద్‌ క్రైం(నిజామాబాద్‌అర్బన్‌) : జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్ట రైల్వే ట్రాక్‌కు సమీపంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. యువకుడి బైక్‌ డ్రెయినేజీలో, యువకుడి రక్తం రైలు పట్టాల పక్కన కంకరపై, మృతదేహం రైలు ట్రాక్‌కు సమీపంలో పడి ఉండటంపై అనేక అనుమానాలకు తావిచ్చింది. దీంతో ఆ యువకుడు రైలు ఢీకొని చనిపోయాడని సివిల్‌ పోలీసులు, డ్రెయినేజీలో పడ్డాకే యువకుడు చనిపోయాడని, కేసు మాది కాదంటే మాది కాదని సివిల్, రైల్వే పోలీసుల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. రైల్వే ఎస్‌ఐ ప్రణయ్‌కుమార్‌ యువకుడు రైలు ఢీకొని చనిపోలేదని మృతదేహాన్ని చూసి వెళ్లిపోయారు.

నాల్గొటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నాల్గోటౌన్‌ ఎస్‌ఐ–2 చాందయ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో నగరంలోని ముబారక్‌నగర్‌ తారక్‌నగర్‌కు చెందిన గురువప్పా వంశీధర్‌(23) శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. శనివారం తెల్లవారుజామున మరో స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్లాడు. బైక్‌ ఎల్మమ్మగుట్ట సోని ఫంక్షన్‌ హాల్‌ వద్దకు రాగానే రోడ్డు పక్కనున్న పెద్ద డ్రెయినేజీలో పడిపోయింది. దీంతో బైక్‌ నడుపుతున్న వంశీధర్‌ ముఖానికి తీవ్రగాయాలయ్యాయి. వంశీధర్‌తో ఉన్న స్నేహితుడు వెళ్లిపోయాడు. అనంతరం గంట తర్వాత స్థానికులు అక్కడ చూడగా వంశీధర్‌ రైల్వే ట్రాక్‌కు సమీపంలో మృతిచెంది ఉండటంతో అవాక్కయ్యారు.

ఈ విషయంపై స్థానికులు నాల్గోటౌన్‌ పోలీసులకు, రైల్వే పోలీసులకు సమాచారాన్ని అందించారు. యువకుడు ముబారక్‌నగర్‌ తారక్‌నగర్‌కు చెందిన వాడుగా గుర్తించారు. దాంతో పోలీసులు తారక్‌నగర్‌కు వెళ్లి వంశీధర్‌ ఫొటోను చూపిస్తే అక్కడివారు గుర్తించి వంశీధర్‌ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు వంశీధర్‌ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. మృతుడి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నాల్గోటౌన్‌ ఎస్‌ఐ తెలిపారు. 

మరిన్ని వార్తలు