పోటెత్తిన యువత

26 Sep, 2018 07:48 IST|Sakshi

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక ఓటరు నమోదు సవరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రధానంగా ఓటు హక్కులేని యువత దాదాపు 85 శాతం వరకు నమోదు చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఓటు నమోదుపై జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ప్రత్యేక శ్రద్ధతో పదిరోజులుగా చేసిన విస్తృత ప్రచార కార్యక్రమాలతో యువతరం పోటెత్తింది. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఓటు నమోదు కార్యక్రమాలు, జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటా సర్వేలతోపాటు ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాల ఏర్పాటుతో ప్రజలు, యువత ఆఖరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా కొత్తగా ఓటరు నమోదుకు పది రోజుల్లో 65 వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

కరీంనగర్‌సిటీ: వచ్చిన దరఖాస్తులను మంగళవారం అర్ధరాత్రి వరకు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించే పనిలో నిమగ్నమయ్యారు. పది రోజులుగా రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు ఎన్నికల కసరత్తులో భాగంగా ఓటరు నమోదు, సవరణలపైనే దృష్టి సారించారు. ఎన్నికల సంఘం ఈనెల 10న ప్రకటించిన ముసాయిదా జాబితా అనంతరం సెప్టెంబర్‌ 25 వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. జిల్లాలో 45 వేలకు పైగా యువత  ఓటు హక్కు పొందాల్సి ఉండగా ఆ స్థాయిలో ఓటరుగా నమోదైనట్లు తెలుస్తోంది. తొలగింపులు, మార్పులు, చేర్పులు, గల్లంతైన ఓటర్ల నేపథ్యంలో సంఖ్యలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ముందస్తు  ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం ఓటు నమోదు చేసుకోవడానికి ఉన్న చివరి అవకాశం ఇది. ఇందుకోసం ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంది. 65 వేల మందిలో కేవలం మ్యాన్‌వల్‌గానే దరఖాస్తులు రాగా ఆన్‌లైన్‌లోనూ మరిన్ని దరఖాస్తులు వచ్చాయి. పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది. చాలా మంది పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వయంగా పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి తమ ఓటును నమోదు చేసుకోవడానికి తాపత్రయ పడ్డారు.

అన్ని తహసీల్దార్‌ కార్యాలయాలు కొన్ని రోజులుగా ఓటరు నమోదు, సవరణలకు వచ్చిన వారితో కిక్కిరిసిపోయాయి. 2018 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటు హక్కు పొందేందుకు అర్హులుగా ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో ప్రధానంగా కరీంనగర్‌ పట్టణం ఓటర్ల జాబితాలో చాలా వరకు ఓట్లు గల్లంతైనట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవముందని గ్రహించిన యంత్రాంగం మరోసారి ఇంటింటి సర్వే చేపట్టింది. కరీంనగర్‌ పట్టణం ఓట్ల గల్లంతు, తొలగింపు, ఓటర్ల నమోదు శాతంలో చాలా వెనుకబడి ఉంది. ఈ క్రమంలో కరీంనగర్‌ పట్టణంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల సహకారం తీసుకున్నారు. కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫోన్ల ద్వారా ఓటరు జాబితాలో పేరుందో లేదో తెలియజేశారు. అందుకు వివిధ శాఖల నుంచి సిబ్బంది ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేశారు.

కరీంనగరంలోని పది ప్రాంతాల్లో ప్రత్యేక ఓటరు అవగాహన కేంద్రాలను ఏర్పాటు చేసి 50 డివిజన్లలో రెండు డివిజన్లకు ఒక జిల్లా అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించి ఆయా శాఖల పరిధిలోని సిబ్బందితో ఇంటింటి సర్వే చేపడుతూ అర్హులైన ఓటర్లను నమోదుతో పాటు సవరణలు చేపట్టారు. 250 మంది బీఎల్‌వోలు, 100 మున్సిపల్‌ సిబ్బంది విధులు నిర్వహించారు. జిల్లాలో సోమవారం నాటికి ఓటరు నమోదుకు గాను 57,040 దరఖాస్తులు వచ్చాయి. తొలగింపు, ఆక్షేపణలకు సంబంధించి (ఫారం–7) 10,125, వివరాలను సరిదిద్దేందుకు (ఫారం–8) 4,314, ఒక పోలింగ్‌ నుంచి మరోపోలింగ్‌ కేంద్రానికి మార్పునకు (ఫారం–8ఏ) 3,640 దరఖాస్తులు వచ్చాయి. గల్లంతైన పేర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులకు ఓటు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే డబుల్‌ ఓటర్ల తొలగింపునకు తెలంగాణలో ఎన్నికల సంఘం మొట్టమొదటిసారిగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించింది. అందులో భాగంగా రెండు, మూడు ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్నవారు ఒకే ప్రాంతంలో ఓటు హక్కు కలిగి ఉండేలా నోటీసులు అందించి చర్యలు తీసుకున్నారు.

ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓట్లున్న వారికి గుర్తించేందుకు ఎన్నికల సంఘం ప్రస్తుతం నూతన టెక్నాలజీని వినియోగించి ఈఆర్‌వోనెట్‌ వీటై జీరో పేరిట సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా జాబితాలో రెండు చోట్ల ఓటు హక్కును కలిగిన వారిని గుర్తించారు. ప్రస్తుతం జిల్లాలో 12 వేల మంది వరకు ఉన్నట్లు గుర్తించారు. వీరికి ఏదో ప్రాంతంలో జాబితా నుంచి తొలగించనున్నారు. ఇంకా మరణించిన వారికి సంబంధించి క్షేత్రస్థాయిలో తహసీల్దార్ల నుంచి మరణ ధ్రువీకరణ పత్రాలు తీసుకుని తొలగిస్తున్నారు. ఈనెల 25 వరకే ఓటరు నమోదుకు ఉన్న గడువును పొడిగించాలన్న వివిధ పార్టీలు, వర్గాల నుంచి వచ్చిన విన్నపాన్ని ఎన్నికల సంఘం స్వీకరించలేదు. అయితే.. ఇంకా ఓటు నమోదు చేసుకునే యువత 10 శాతం మిగిలిపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక ఓటరు నమోదు, సవరణల ప్రక్రియలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అక్టోబర్‌ 8న ఓటర్ల తుది జాబితా వెలువరించనున్నారు.

మరిన్ని వార్తలు