యువ ఓటర్లపైనే గురి

10 Nov, 2018 13:48 IST|Sakshi

యువతను ఆకర్షించేలా ప్రణాళికలు

ఓట్లను రాబట్టుకునేందుకు

ప్రధాన పార్టీల ఎత్తులు

ప్రత్యేక యువజన విభాగాల ఏర్పాటు

యువసేన కమిటీలతో ప్రచారం

కీలకంగా మారనున్న యూత్‌

సాక్షి, జనగామ:శాసనసభ ఎన్నికల్లో జనగామ జిల్లాలో యువ ఓటర్ల తీర్పు కీలకంగా మారనుంది. అభ్యర్థుల  గెలుపు ఓటములపై యువ ఓటర్లు ప్రభావితం చూపనున్నారని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. యువ ఓటర్ల ను తమవైపు తిప్పుకోవడం కోసం ప్రధాన పార్టీలు ఇప్పటికే ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. యువతకు దగ్గరయ్యేందుకు.వివిధ మార్గాలను అన్వేషిస్తున్నాయి. యువతను కలుసుకుని ఓట్లరూపంలో వారి మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. జిల్లాలోని జనగామ, స్టేషన్‌ ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో యువ ఓటర్లు వేల సంఖ్యలో ఉండడంతో వారి ఓట్లను రాబట్టుకునేందుకు పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.
 
విద్యార్థి సంఘాల రూపంలో ప్రధాన పార్టీలు..
ఎన్నికల బరిలో తలపడుతున్న ప్రధాన పార్టీలు యువ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం ఆయా పార్టీలకు ఉన్న విద్యార్థి విభాగాలను సమాయత్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘాలతో పాటు యువజన విభాగాలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. కొత్త ఓటర్లు, యువ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం కోసం విద్యార్థి విభాగాలు, యువజన విభాగాల నాయకులు ప్రత్యేక బృందాలుగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. కొత్త, యువ ఓటర్ల సెల్‌నంబర్లు సేకరిస్తున్నారు.

యువసేనల జోరు..
యువ ఓటర్లను దగ్గర చేసుకోవడం కోసం ఇప్పటికే మూడు నియోజకవర్గాల్లో యువసేన సంఘాలు జోరందుకున్నాయి. ఎన్నికల బరిలో దిగనున్న అభ్యర్థులకు మద్దతుగా యువకులు యువసేన సంఘాలను ప్రారంభించారు. పాలకుర్తిలో దయన్న యువసేన, జనగామలో ముత్తిరెడ్డి యువసేన, స్టేషన్‌ఘన్‌పూర్‌లో రాజన్న యువసేన, కేసీఆర్‌ యువసేన, కేటీఆర్‌ యువసేన, హరీషన్న యువసేన, పొన్నాల యువసేన, జంగా యువసేన, వంశన్న యువసేన, ముక్కెర యువసేన, రమణన్న యువసేన వంటి సంఘాలు ఆయా పార్టీలకు, అభ్యర్థులకు మద్దతుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

నిరుద్యోగ భృతితో యువతకు గాలం...
విద్యార్థి సంఘాలు, యువజన విభజన విభాగాలు, యువసేన సంఘాలు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుండగా మరోవైపు ప్రధాన పార్టీలు నిరుద్యోగ భృతి పథకంతో ఓట్లకు గాలం వేసేందుకు యత్నిస్తున్నాయి. అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇస్తున్నాయి. ఉద్యోగాల నోటిఫికేషన్లు, ఉపాధి అవకాశాలపై దృష్టిపెడతామని యువ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఏదేమైనా మూడు నియోజకవర్గాల్లో యువ ఓటర్ల తీర్పు కీలకం కాబోనున్నది. 
 

మరిన్ని వార్తలు