మద్యం మత్తులో యువతి హల్‌చల్‌

27 Jun, 2018 01:41 IST|Sakshi

అర్ధరాత్రి నడిరోడ్డుపై నగ్నంగా నిలబెట్టాడని మాజీ ప్రియుడిపై ఫిర్యాదు  

5 గంటల పాటు బంజారాహిల్స్‌ రోడ్లపై హైడ్రామా

హైదరాబాద్‌: పీకలదాకా మద్యం సేవించి ఓ యువతి సోమవారం అర్ధరాత్రి బంజారాహిల్స్‌లో నడిరోడ్డుపై నిలబడి హల్‌చల్‌ చేసింది. తన మాజీ ప్రియుడు, అతని ప్రియురాలు ఇద్దరూ తనకు మద్యం తాగించి నడిరోడ్డుమీద నగ్నంగా నిలబెట్టారంటూ ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే... మాదాపూర్‌కు చెందిన యువతి (21) ఏడాదిక్రితం బంజారాహిల్స్‌కు చెందిన ఫిరోజ్‌ను ప్రేమించింది. ఆరు నెలల పాటు చెట్టపట్టాలేసుకుని తిరిగాక మనస్పర్ధలు రావడంతో ఆమె దుబాయ్‌ వెళ్లిపోయింది.

వారం క్రితం హైదరాబాద్‌ వచ్చింది. సోమవారం రాత్రి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లో ఉన్న అమెన్షియా పబ్‌కు వెళ్లి మద్యం సేవిస్తుండగా.. అక్కడ ఫిరోజ్, అతని ప్రియురాలు కీర్తి కనిపించారు. కీర్తి.. ఆ యువతి టేబుల్‌ వద్దకు వచ్చి మద్యం సేవించి గొడవపడింది. అనంతరం ఫిరోజ్‌ ఆ యువతిని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లోని కీర్తి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలసి మద్యం తాగించారని, ఫిరోజ్‌ తనతో సన్నిహితంగా ఉండటం చూసిన కీర్తి తన చేతులకు బ్లేడ్‌తో గాట్లు పెట్టిందని ఫిర్యాదులో సదరు యువతి పేర్కొంది.

అంతేకాకుండా తన గొంతు నులిమేందుకు యత్నించిందని, జుట్టు పట్టుకొని కొట్టి బయటకు ఈడ్చేసిందని తెలిపింది. తర్వాత ఇద్దరూ కలసి తనను జీవీకే వన్‌ చౌరస్తాకు తీసుకొచ్చి బంగారు గొలుసు, మొబైల్‌ ఫోన్లు, ఖరీదైన వాచ్, రూ.12 వేల నగదు లాక్కొని వివస్త్రను చేసి గంటపాటు నడిరోడ్డుపై నిలబెట్టారని వివరించింది. నడిరోడ్డుపై నగ్నంగా ఉన్న తనను బంజారాహిల్స్‌ పోలీసులు బట్టలు కప్పి స్టేషన్‌కు తీసుకొచ్చారంది.

అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఫిరోజ్, కీర్తి ఈ తతంగాన్నంతా చేశారని ఫిర్యాదు చేసింది. అయితే తాగిన మైకంలో పబ్‌లో ఉన్నప్పుడు ఆ యువతే బ్లేడ్‌తో చేతులు కోసుకుందని ఫిరోజ్‌ పోలీసులకు తెలిపాడు. అక్కడి నుంచి తానిక్‌ వైన్‌షాప్‌కు వెళ్లి మళ్లీ మద్యం సేవించిందన్నాడు. జీవీకే వన్‌ చౌరస్తాలో సిగరెట్‌ కొనడానికి రాగా, ఆమె తన దుస్తులు విప్పేసుకుందని చెప్పాడు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా