మాయమాటలు చెప్పి వ్యభిచార రొంపిలోకి..

22 Feb, 2015 03:38 IST|Sakshi

యువతులను తరలిస్తున్న దంపతులఅరెస్ట్
     నిందితులపై కేసు
     యువతులను జడ్జి ఎదుట
     హాజరుపరిచి ఇళ్లకు పంపించిన పోలీసులు

 
 సూర్యాపేట : ‘‘ఓ పెద్ద మనిషి కుటుంబంలో వివాహవేడుక ఉంది... అక్కడ మీరు నృత్యం చేసి ఆహ్వానితులను సంతృప్తిపరిస్తే మంచి పారితోషికం లభిస్తుంది’’ అంటూ పేద యువతులను ప్రలోభపెట్టి వ్యభిచారరొంపిలోకి దింపుతున్న దంపతుల గుట్టురట్టయ్యింది.. రాష్ట్ర రాజధాని సమీప జిల్లాలకు చెందిన ఆరుగురు యువతులను ఇదే తరహాలో విశాఖ పట్టణానికి తరలిస్తూ వాహనాల తనిఖీలో పోలీసులకు చిక్కారు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడకు చెందిన బండి శ్రీనివాస్, పిట్ట దివ్యారెడ్డి దంపతులు. హైదరాబాద్, వరంగల్, నల్లగొండలకు చెందిన ఆరుగురు యువతులను విశాఖపట్నంలో ఓ వివాహ వేడుకలో నృత్యం చేయాలని నమ్మబలికి తీసుకెళ్తున్నారు. ఏపీ9బిహెచ్2124 నంబర్ గల ఫోర్డ్ ఎన్‌డీవర్ వాహనంలో ఆ ఆరుగురుని ఎక్కించుకొని శుక్రవారం రాత్రి విశాఖపట్నానికి బయలుదేరారు.
 
 సూర్యాపేట పట్టణ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు  హైదరాబాద్ - విజయవాడ రహదారిపై గల ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఎన్‌డీవర్ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అం దులో ఉన్న దంపతులు, యువతులను ప్రశ్నించగా తాము ఓ వివాహ వేడుకకు విశాఖపట్నానికి వెళ్తున్నామని, ఇందులో ఉన్న వారంతా నృత్యం చేసేవారని తెలిపారు. వాహనంలో ఉన్నవారు భయాందోళనకు గురయినట్టు గమనించిన పోలీసులు గట్టిగా దబాయించారు.  దంపతులిద్దరూ కొంత కాలంగా యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్టు విచారణలో ఒప్పుకున్నారు. ఈ ఆరుగురు యువతులను కూడా వ్యభి చార కూపానికి తరలిస్తున్నట్టు విచారణలో తేలిందని సీఐ మొగలయ్య తెలిపారు. దంపతులిద్దరి పై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసినట్టు చెప్పారు. శనివారం తెల్లవారుజామున ఆరుగురు యువతులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి వారి వారి ఇళ్లకు పంపించినట్టు పేర్కొన్నారు.
 
 వారు దంపతులేనా..?
 బండి శ్రీనివాస్, పిట్ట దివ్యారెడ్డి దంపతుల కాదా అనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వీరు కొంత కాలంగా పెళ్లిళ్ల వద్ద నృత్యం చేయాలని నమ్మబలుకుతూ యువతులను తీసుకెళ్లి వ్యభిచారం చేయిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్టు సమాచారం. ఆర్థిక అవసరాల కోసం విద్యార్థినులు, గిరిజన తండాలకు చెందిన యువతులు వీరి వలలో చిక్కుకొని వ్యభిచార కూపంలోకి దిగుతున్నట్టు తెలిసింది.
 

మరిన్ని వార్తలు