శభాష్‌ రవళిక..

8 Apr, 2020 10:43 IST|Sakshi
మాస్క్‌లను కుడుతున్న రవళిక

సొంతంగా తయారుచేసిఉచితంగా మాస్క్‌ల పంపిణీ

పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న యువతి

సోన్‌(నిర్మల్‌): మండలంలోని పాక్‌పట్ల గ్రామానికి చెందిన ఓ యువతి సొంతంగా మాస్క్‌లను కుట్టి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసి పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. మండలంలోని పాక్‌పట్లకు చెందిన మెరుగు నర్సయ్య– పుష్పలతకు ఇద్దరు కూతుళ్లు. మొదటి సంతానమైన రవళిక ప్రస్తుతం డిగ్రీ రెండో సంవత్సరం చదువుకుంటూనే, జనతా బ్యాగులు కుడుతూ కుటుంబానికి ఆసరగా నిలుస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మండల ఐకేపీ ఏపీయం సులోచన ప్రోత్సాహంతో తనవంతుగా సమాజ సేవకు ఉపక్రమించింది. తన వద్ద ఉన్న బట్టలతో మాస్క్‌లను సొంతంగా మిషన్‌పై కుట్టి గ్రామస్తులకు, ఇతర గ్రామాల ప్రజలకు ఉచితంగా అందజేస్తూ, కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తోంది. తన వంతు భాద్యతగా ఓ యువతి ముందుకు వచ్చి సేవ చేయడంపై పలువురు రవళికను అభినందిస్తున్నారు.

వయసు చిన్నది.. మనస్సు గొప్పది
నిర్మల్‌టౌన్‌: కరోనా మహమ్మారి నిర్మూలనకు ప్రభుత్వానికి తన వంతుగా విరాళం అందించి తన పెద్ద మనసు చాటుకున్నాడు చిన్నారి హర్ష. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌కు తన తల్లిదండ్రులతో కలిసి వెళ్లి తలకొక్కుల హర్ష తాను దాచుకున్న రూ. 2వేలను కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారుఖీకి మంగళవారం అందజేశారు. చిన్నారి సాయానికి ముచ్చటపడిన కలెక్టర్‌ చిన్నారి అందించిన డబ్బుల్లో రూ. 500తీసుకుని మిగిలినవి తిరిగి ఇచ్చేశారు. జిల్లాకేంద్రానికి చెందిన హర్ష జిల్లాకేంద్రంలోని ఓ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాడు. హర్ష తండ్రి తలకొక్కుల నరహరి సైతం ఫుడ్‌బ్యాంక్‌ నిర్వహిస్తూ పేదలకు అన్నదానం చేస్తున్నారు. అలాగే బ్లడ్‌డోనర్‌ గ్రూప్‌ నిర్వహిస్తూ రక్తదాతగా నిలుస్తున్నారు. ఈ మేరకు పలువురు చిన్నారి హర్షను అభినందించారు.

తల్లిదండ్రులతో కలిసి విరాళం అందిస్తున్న హర్ష

>
మరిన్ని వార్తలు