మీ ప్రేమ అసామాన్యం

11 Dec, 2014 02:42 IST|Sakshi
మీ ప్రేమ అసామాన్యం

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘ప్రజల నుంచి పుట్టి, ప్రజల కోసమే జీవించి, ప్రజాసేవ చేస్తూనే మరణించిన నాయకుడు వైఎస్. రాష్ట్ర ప్రజల కోసం పెద్ద మనసు చేసుకుని ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి మంచి పనులు చేశారు. వెనక్కివెళ్లి ఆలోచిస్తే ఆయనలా ఆలోచించే నాయకుడు చరిత్రలో మరొకరు లేరు’ అని వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అన్నారు.
 
 పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డితో కలిసి వరుసగా బుధవారం మూడోరోజు జిల్లాలోని కొల్లాపూర్, వనపర్తి, దేవరకద్ర, గద్వాల, మక్తల్ నియోజకవర్గాల మీదుగా పరామర్శయాత్ర కొనసాగించారు.
 
 ఈ సందర్భంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక గుండె చెదిరి మరణించిన ఆరుగురి కుటుంబాలను షర్మిల పరామర్శించారు. వనపర్తిలో స్వాగతం పలికిన జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ‘రుణమాఫీ, ఉచిత విద్యుత్, పంటల బీమా, సబ్సిడీ ఇలా అనేక విధాలుగా సాయంచేసి వైఎస్ రైతులను నెత్తిన పెట్టుకుని గౌరవించారు. పేద ప్రజలకు భారం పడకుండా ఏ ఒక్క చార్జీ పెంచకుండా వైఎస్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ‘108’ సేవలు ఇలా పథకమేదైనా లక్షల మందికి ఉపయోగపడే పనులు చేశారు’ అని వైఎస్ పాలనను షర్మిల గుర్తుచేశారు. ‘వైఎస్ మనసు ఎంతో పెద్దది. రాష్ట్రంలో గుడిసెలు లేకుండా ప్రతిఒక్కరికీ పక్కా ఇల్లు ఉండాలని కోరుకున్నారు.
 
 మనిషిని మనిషిలా చూసి, తెలుగు ప్రజలను సొంత బిడ్డల్లా చూసుకున్నారని’ ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు. ‘మా కుటుంబంపై మీప్రేమ సామాన్యమైనది కాదు. మీ ప్రాణం కంటే ఎక్కువగా మా నాన్న గారిని ప్రేమించిన ందుకు రాజన్న కుటుంబం శిరస్సు వంచి నమస్కరిస్తోంది’ అని షర్మిల వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య భారతదేశంలో వైఎస్ లాంటి నాయకుడు చనిపోతే వందల గుండెలు ఆగిపోవడం అసామాన్యమని షర్మిల అన్నారు. అవసరమైన ప్రతిఒక్కరికీ అండగా నిలిచిన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అంటూ వివిధ పథకాల అమల్లో ఆయన కృషిని ఆమె ప్రస్తావించారు. చేయిచేయి కలిపి రాజన్నరాజ్యం సాధించుకుందామని పిలుపునిచ్చారు.
 
 జిల్లాకు అత్యంత ప్రాధాన్యత:
 ఎడ్మ కిష్టారెడ్డి
 ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో జిల్లాకు వైఎస్ రాజశేఖరరెడ్డి అత్యంత ప్రాధాన్యమిచ్చారని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి అన్నారు. వనపర్తికి చెందిన చిన్నారెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో పాటు పట్టణంలో రాజీవ్ నగరబాట పర్యటనకు అనేక హామీలు ఇచ్చారన్నారు.
 
 నగరబాటలో ఇచ్చిన హామీల వల్లే వనపర్తిలో వసతులు, సౌకర్యాలు సమకూరాయన్నారు. వనపర్తికి హార్టికల్చర్ ఇనిస్టిట్యూట్ కూడా వైఎస్ హయాంలోనే మంజూ రైన విషయాన్ని కిష్టారెడ్డి గుర్తుచేశారు. మూడోరోజు పరామర్శ యాత్రలో రాష్ట్ర నేతలు కొండా రాఘవరెడ్డితో పాటు జిల్లా నేతలు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, భీష్వ రవీందర్, రాంభూపాల్‌రెడ్డి, మాదిరెడ్డి భగవంత్‌రెడ్డి, జశ్వంత్‌రెడ్డి, బంగి లక్ష్మణ్, జెట్టి రాజశేఖర్, రహమాన్, కావలి మధుమిత తదితరులు వైఎస్ షర్మిల వెంట ఉన్నారు.
 

మరిన్ని వార్తలు