‘మీ సేవ’లో ఇసుక!

7 Feb, 2015 01:19 IST|Sakshi
‘మీ సేవ’లో ఇసుక!
  • చవకగా అందించేలా నూతన ఇసుక పాలసీ: హరీశ్‌రావు
  • ఆన్‌లైన్ ద్వారా ఇంటికే ఇసుక విధానాన్ని అమలు చేస్తాం
  • టన్నుకు రూ. 400లే.. రవాణా చార్జీలు అదనం
  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు మేలు చేసేలా, చవకగా ఇసుకను అందుబాటులోకి తెచ్చేలా నూతన ఇసుక పాలసీని తీసుకొస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇసుక మాఫియాకు కళ్లెం వేస్తామని... పారదర్శకత కోసం ఆన్‌లైన్ విధానం ద్వారా నేరుగా ఇంటికే ఇసుక డెలివరీ జరిగేలా చూస్తామని ఆయన వెల్లడించారు. మార్కెట్ ధరకన్నా 50 నుంచి 60 శాతం తక్కువ ధరకే ఇసుకను అందించడం, ఓవర్‌లోడ్ రవాణాను నివారించడం, ఇసుక ట్రాక్టర్లు, లారీల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణ తదితర లక్ష్యాలతో ఈ పాలసీని మరో రెండు నెలల్లో అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

    శుక్రవారం హరీశ్‌రావు సచివాలయంలో ఇసుక పాలసీ అంశంపై అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం ప్రజా అవసరాల దృష్ట్యా పట్టా భూముల్లో మరో రెండు నెలల పాటు ఇసుక తవ్వకాలకు అనుమతించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే సీజ్ చేసిన రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను వేలం వేయనుందని తెలిపారు. టన్ను ఇసుకను కేవలం రూ. 400లకే అందిస్తామని, దీనికి అదనంగా రవాణా చార్జీలు ఉంటాయని తెలిపారు.

    హైదరాబాద్‌లో ప్రస్తుతం టన్ను ఇసుక ధర రూ. 1,400 వరకు ఉందని.. అదే కొత్త విధానంతో రూ. 900 నుంచి రూ. 1,100 లోపే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. ప్రజలు సైతం నేరుగా వచ్చి ఇసుక కొనుగోలు చేసేలా స్టాక్‌యార్డ్‌లు, మీసేవ కేంద్రాల్లో ఆన్‌లైన్ అమ్మకాలను చేపడతామని పేర్కొన్నారు.

    ఈ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా ఇసుక విక్రయాలు జరుగుతాయన్నారు. ఇసుక తరలించే వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయడం, రాష్ట్ర విజిలెన్స్‌తో పాటు కలెక్టర్ నేతృత్వంలో జిల్లా విజిలెన్స్‌ల ఏర్పాటు, కాల్‌సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కింద చేపట్టాల్సిన భూసేకరణపైనా మంత్రి నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. త్వరితగతిన భూసేకరణ జరిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు