టీ20 మ్యాచ్‌లు ఉన్నాయంటే చాలు...

9 Nov, 2017 09:13 IST|Sakshi

క్రికెట్‌పై జోరుగా పందాలు 

వ్యసనంగా మారుతున్న వైనం 

ఎక్కడపడితే అక్కడే అడ్డాలు 

అప్పులపాలవుతున్న యువత 

నిఘా పెంచాల్సిందే..

క్రికెట్‌ అంటే ఒకప్పుడు ప్యాషన్‌.. ఇప్పుడు వ్యసనం.! ప్రధానంగా టీ20 మ్యాచ్‌లు ఉన్నాయంటే చాలు బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. దీనిలో ముఖ్యంగా యువతనే ఉంటోంది. ఎక్కడపడితే అక్కడే అడ్డాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. బంతిబంతికి పందెం కాస్తూ రూ.వేలల్లో పోగొట్టుకుంటున్నారు. తద్వారా ఆర్థికంగా చితికిపోతున్నారు. పోలీసులు కూడా వీటిపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో విచ్చలవిడిగా బెట్టింగ్‌ సాగుతోంది. 

కామారెడ్డి క్రైం: ప్రస్తుతం క్రికెట్‌ అంటే ఏస్థాయిలో ఉందో చెప్పనక్కర్లేదు. ప్రధానంగా యువతలోనే క్రికెట్‌ మోజు వెర్రివెతలు వేస్తోంది. ఆటను ఆటలా చూడలేకపోతున్నారు. యువత బెట్టింగ్‌ మోజులో పడి పెడదారులు తొక్కుతున్నారు. టీ20 క్రికెట్‌ మొదలైందంటే చాలు బెట్టింగ్‌ మాయలో పడి వేలల్లో నష్టపోతున్నారు. చిన్న వయసులో ఎంతోమందికి ఇదొక వ్యసనంగా మారుతోంది. ఈ చర్య ఆందోళనకు గురిచేస్తోంది. ఇదివరకు క్రికెట్‌ మాచ్‌ ఉందంటే టీవీల ముందు బైఠాయించి ఇంటికే పరిమితమయ్యేవారు. బెట్టింగ్‌ల కారణంగా ఇటీవలి కాలంలో అందరూ ప్రత్యేక అడ్డాలు వెతుక్కుంటున్నారు. ఎక్కడపడితే అక్కడే పందాలు కాస్తున్నారు. దీంతో కొందరు యువకులు అప్పులబారిన పడుతున్న సందర్భాలున్నాయి. క్రికెట్‌పై యువతలో ఉన్న మోజును కొందరు నిర్వాహకులు తప్పుడు మార్గంలో సొమ్ము చేసుకుంటున్నారు. కామారెడ్డిలో ఇటీవల క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయినా కామారెడ్డిలో పదుల సంఖ్యలో బెట్టింగ్‌ బృందాలున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాలతో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి, ఆర్మూర్, బోధన్‌ వంటి పట్టణాలు, మండలాల్లోని యువతకు బెట్టింగ్‌ నిర్వాహకులు గాలం వేస్తున్నారు. అలాంటివారిపై పోలీసు శాఖ నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

 నిఘా పెంచాల్సిందే.. 
క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారంపై పోలీసులు మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. బెట్టింగ్‌తో కలిగే నష్టాలపై సరైన అవగాహన లేక యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఆర్థికంగా సమస్య లు తలెత్తితే ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలోకి వెళ్తున్నా రు. బెట్టింగ్‌ కారణంగా భవిష్యత్తును పాడు చేసుకో కుండా ఉండాలంటే వారికి విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.

బంతి బంతికి బెట్టింగ్‌..
బెట్టింగ్‌ వ్యవహారం రకరకాలుగా సాగుతోంది. టీవీలో వచ్చే మ్యాచ్‌లో ఈరోజు ఎవరు గెలుసారో అనేది మాత్రమే కాకుండా, బంతిబంతికి ఏం జరుగుతుందో అనే విషయంపై బెట్టింగ్‌ చేస్తున్నారు. బెట్టింగ్‌ ముఠాలే కాకుండా చాలాచోట్ల యువకులు తామే స్వయంగా గ్రూప్‌గా ఏర్పడి పందాలు కాస్తున్నారు. ఇది వరకు బెట్టింగ్‌ నిర్వహించడం అంటే ప్రత్యేకంగా అడ్డాలు ఉండేవి. ఇటీవలి కాలంలో ఎక్కడి పడితే అక్కడే బృందాలుగా కూర్చుని ఫోన్‌ల ద్వారా నిర్వాహకులతో మాట్లాడుతూ ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. ఈనెల 7న జరిగిన భారత్‌–న్యూజిల్యాండ్‌ టీ20 మ్యాచ్‌పై కూడా జోరుగా బెట్టింగ్‌ సాగినట్లు సమాచారం.

నష్టపోతున్న యువత...  
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌ రోడ్‌లో ఓ ఇంట్లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు. గతంలో బెట్టింగ్‌లో పాల్గొని నష్టపోయిన ఓ యువకుడు అప్పులు బారిన పడి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఇలాంటి సంఘటనలు ఆయా గ్రామాల్లో మరెన్నో చోటు చేసుకుంటున్నాయి. బెట్టింగ్‌ కోసం ఇండ్లు, హోటళ్లు, రెస్టారెంట్‌ వంటి ప్రదేశాల్లో అడ్డాలుగా చేసుకుంటున్నారు. పోలీసుల నిఘా పెరగడంతో ఎప్పటికప్పుడు అడ్డాలు మారుస్తూ బెట్టింగ్‌ కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై పలుసార్లు పోలీసులు దాడులు చేయగా జిల్లా కేంద్రంలోని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో టీ20 క్రికెట్‌ మ్యాచ్‌లు వచ్చే సమయాల్లో క్రికెట్‌ ఛానళ్లను పెట్టడం లేదు.

మరిన్ని వార్తలు