ఉద్యోగాల కోసం యువత ఉద్యమించాలి

22 Jul, 2014 01:34 IST|Sakshi
ఉద్యోగాల కోసం యువత ఉద్యమించాలి

మంచిర్యాల అర్బన్ : నిరుద్యోగ యువకులు ఉద్యోగ, ఉపాధి కోసం ఉద్యమించాలని ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) రాష్ట్ర అధ్యక్షుడు హన్మేశ్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక మార్క్స్ భవనంలో పీవైఎల్ మహాసభల నిర్వహణ పై సమీక్షాసమావేశం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై పీవైఎల్ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్నారని, భవిష్యత్‌లో యువతకు ఉపాధి మార్గాన్ని చూపించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని సూచించారు.
 
న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ అణచివేత, రాజ్యాధికారం దుర్వినియోగంపై యువకులు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులు,కర్షకులు, నిరుద్యోగులు హక్కుల సాధనకు పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. పీవైఎల్ మహాసభలకు ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఆర్థిక చేయూత నివ్వాలని కోరారు. ప్రగతిశీల సమాజాన్ని నిర్మించే బాధ్యత నేటి తరం యువకులపై ఉందని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు గురిజాల రవీందర్‌రావు అన్నారు.

సమాజం మార్పు కోసం యువజన ఉద్యమాలు రావాలని అభిప్రాయపడ్డారు. అవినీతి, అక్రమాలను నిరోధించి, దూరమవుతున్న మానవ సంబంధాలు మెరుగు పర్చుకోవడానికి, భవిష్యత్‌ను బంగారుమయం చేసుకోవడానికి యువకులు నడుంబిగించాలని పిలుపునిచ్చారు. పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి పుల్లయ్య, నాయకులు మల్లేశ్, రమేశ్, రాజేశ్ పాల్గొన్నారు.
 
మహాసభ సన్నాహక కమిటీ అధ్యక్షునిగా గురిజాల..
మంచిర్యాలలో ఆగస్టు 30, 31వ తేదీలలో నిర్వహించనున్న పీవైఎల్ 6వ రాష్ట్ర మహాసభల సన్నాహక కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా గురిజాల రవీందర్‌రావు, ఉపాధ్యక్షులుగా పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మేశ్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, నంది రామయ్య, రాజన్న, మల్లేశ్, రవీందర్, బ్రహ్మం, ప్రధాన కార్యదర్శిగా పుల్లయ్య, సహాయ కార్యద ర్శులుగా జైపాల్, జ్యోతి, మంగ, తిరుపతి, రమేశ్, మాన్‌సింగ్, తిరుపతి, కోశాధికారిగా లాల్‌కుమార్‌లతో మొత్తం 50 మందితో సన్నాహక కమిటీని ఎన్నుకున్నారు.

మరిన్ని వార్తలు