ట్యాంకు ఎక్కి యువకుడి హల్‌చల్‌

8 Jan, 2019 11:06 IST|Sakshi
సంగెం మండల కేంద్రంలో వాటర్‌ ట్యాంకు ఎక్కిన కుమారస్వామి 

తన వల్లే బంధువులు ఇంటికి రావడం లేదని మనస్తాపం

నచ్చజెప్పి దింపిన యువకులు

సాక్షి, సంగెం: తన వల్ల పెద్దమనుషులు 5వ రోజు కర్మకాండలకు రారని ఆందోళనకు గురైన ఓ యువకుడు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హల్‌చల్‌ చేసిన సంఘటన  మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం...  మండల కేంద్రానికి చెందిన గుండేటి కుమారస్వామి(30) సమీప బంధువు గుండేటి ఎల్లమ్మ మృతి చెందింది. ఈ నెల 6వ తేదీన ఎల్లమ్మ మృతి చెంది 3వ రోజు కావడంతో కుమారస్వామి వంటలు చేశాడు. అక్కడ భోజనాలు జరుగుతున్న క్రమంలో మద్యం మత్తులో ఉండి పెద్ద మనుషులను దుర్భాషలాడాడు. దీంతో మనస్తాపం చెందిన కుల పెద్ద మనుషులు నేడు నిర్వహించబోయే 5వ రోజు కర్మలకు హాజరుకామని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు కుమారస్వామిని నీవల్లే కుల పెద్దలు రావటం లేదని మందలించారు. దీంతో ఆందోళన చెందిన కుమారస్వామి గ్రామపంచాయతీ వద్ద ఉన్న వాటర్‌ ట్యాంకు ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హల్‌చల్‌ చేశాడు. పంచాయతీ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ వద్ద ఉన్న గుండేటి కొమ్మాలు, అనిల్, మెట్టుపల్లి రమేశ్, కక్కెర్ల సంతోష్‌గౌడ్‌లు చాటుగా వాటర్‌ ట్యాంకు ఎక్కి కుమారస్వామికి నచ్చజెప్పి కిందకు దింపారు. విషయం తెలుసుకుని పోలీసులు వచ్చి యువకుడిని పోలీసుస్టేషన్‌ తరలించారు. 

>
మరిన్ని వార్తలు