ప్రాణాలు బలిగొంటున్న జోష్‌

25 Feb, 2020 10:47 IST|Sakshi

ప్రమాదాల బారినపడుతున్న యువకులు

రోడ్ల సామర్థ్యాన్ని మించి వస్తున్న వాహనాలు

కరువైన అవగాహన, పటిష్ట చట్టాలు, నిబంధనలు

గడిచిన మూడురోజుల్లో ఏడుగురి మృత్యువాత  

సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో గడిచిన మూడు రోజుల్లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు చనిపోయారు. వీరిలో ఆరుగురు యువకులే. మద్యం మత్తు, తొందర ఇలా కారణమేదైతేనేం.. మితిమీరిన వేగమే ప్రమాదాలకు కారణమైంది. కేవలం ఇక్కడే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలే ఎక్కువగా యువతను బలి తీసుకుంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో తేలింది. వీటి బారిన వారిలో 30 శాతం మంది 15– 35 ఏళ్ల మధ్య వయస్కులే ఉంటున్నారనీ స్పష్టం చేసింది. ఏటా జరుతున్న ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న వారిలో యువత, ప్రమాదాల బారిన పడుతున్న వాహనాల్లో ద్విచక్ర వాహనాలు (యువత ఎక్కువగా వినియోగించేవి) ఎక్కువగా ఉంటున్నాయి. కొరవడిన అజమాయిషీ, పట్టని ప్రభుత్వ యంత్రాగాలు, కరువైన పటిష్ట చట్టాల  ఫలితంగా ఎలాంటి బ్రేక్‌ లేకుండా సాగుతున్న జోష్‌తోనే ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. 

టీనేజర్లు.. టూవీలర్లు..
ఏటా నగరంలో నమోదు అవుతున్న ప్రమాదాలను విశ్లేషిస్తే ద్విచక్ర వాహనాల వల్లే ఎక్కువగా జరుగుతున్నాయని తేలింది. యువత ఎక్కువగా వినియోగించేది ఈ వాహనాలే. ఆ తర్వాత స్థానం తేలికపాటి వాహనాలైన కార్లు వంటి వాటిది. ఈ కారణంగానే ప్రమాదాల బారినపడుతున్న, కారణంగా మారుతున్న వాటిలో ఇవే ఎక్కువగా ఉంటున్నాయి. ద్విచక్ర వాహనాల వల్ల జరుగుతున్న ప్రమాదాల్లో వాహన చోదకులతో పాటు పాదచారులూ ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా అనేక విద్యాసంస్థలు నగర శివార్లలో ఉండటంతో సొంత వాహనాలపై వాటికి వెళ్లి వచ్చే క్రమంలో ఎందరో యువకులు మృత్యువాత పడుతున్నారు. దీనికి తోడు అడపాదడపా చోటు చేసుకుంటున్న రేసింగ్స్‌ కూడా అనేక మంది ప్రాణాల్ని హరిస్తున్నాయి. 

ఆ రెంటికీ సంబంధం లేదు...
నగరంలోని రోడ్లపై వాహనాల కనిష్ట వేగం గంటకు 25 కి.మీ చేరట్లేదు. ఇటీవల కాలంలో దిగుమతి అవుతున్న, తయారవుతున్న వాహనాలు గంటకు 200 కి.మీ వేగంతో దూసుకుపోయేవిగా ఉంటున్నాయి. ఈ వేగం అంటే యువతకు క్రేజ్‌ కావడంతో కోరి ప్రమాదాలబారిన పడుతున్నారు. సోమవారం జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టుÐ వద్ద ప్రమాదానికి గురై కన్నుమూసిన చరణ్‌ యాదవ్‌ వినియోగించిన కేటీఎం బైక్‌ సామర్థ్యాన్నే తీసుకున్నా ఇది గరిష్టంగా గంటకు 160 కిమీ వేగంతో దూసుకుపోతుంది. నగరంలోని రోడ్ల సామర్థ్యానికి మించిన వాహనాలు కుప్పలుతెప్పలుగా వస్తుండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు చెబుతున్నారు. అలా రాకుండా వాటిని అడ్డుకోవడానికి అవసరమైన చట్టాలు, నిబంధనలు మాత్రం లేవని స్పష్టం చేస్తున్నారు. 

తల్లిదండ్రుల పాత్రా ఎంతో..
పిల్లల కదలికలు, బాగోగులు పట్టించుకునే తీరిక యాంత్రిక జీవితం నేపథ్యంలో తల్లిదండ్రులకు ఉండట్లేదన్నది ట్రాఫిక్‌ పోలీసుల మాట. దీంతో వీరు మరింత రెచ్చిపోతున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లలకు మైనార్టీ తీరకుండా, లైసెన్స్‌ లేకుండా వాహనాలు కొని ఇస్తూ ‘ప్రేమను’ చాటుకుంటున్న తల్లిదండ్రులు పరోక్షంగా వారి విచ్చలవిడి తనానికి కారణమవుతున్నారని వారు చెప్తున్నారు. ఒకప్పుడు నగరంలోని కొన్ని ప్రాంతాలకు పరిమితమైన బైక్, కార్‌ రేసింగ్స్‌ ప్రస్తుతం ఔటర్‌ రింగ్‌ రోడ్, దాని సమీపంలో ఉన్న మార్గాలకు చేరాయి. వీటిని గణించే, అడ్డుకునే పరికరాలు, యంత్రాంగం అదుబాటులో లేదు. ఉన్న వాటినీ సక్రమంగా వినియోగించడంలో ప్రభుత్వ శాఖలు విఫలం అవుతున్నాయి. ఇవన్నీ యువతను శాతంగా మారాయి. 

కీలక చర్యలతో చెక్‌కు అవకాశం..
స్పీడ్‌ లేజర్‌ గన్, ఇంటర్‌సెప్ట్‌ వాహనాలను అవసరమైన స్థాయిలో సమీకరించుకుని అవసరమైన చోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. నిత్యం ప్రమాదాలు జరుగుతున్న ‘బ్లాక్‌ స్పాట్స్‌’తో పాటు ప్రమాదాలకు ఆస్కారం ఉన్న చోట కొన్ని కీలక చర్యలు తీసుకుని అవసరమైన ఏర్పాట్లు చేయడం ద్వారా మంచి ఫలి తాలు సాధించవచ్చని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఒక్కసారి

పరిశీలిస్తే...
కాషనరీ సైన్స్‌:
ఫలానా ప్రాంతం ప్రమాదకరమైంది, ప్రమాద హేతువు అని వివరించేందుకు సదరు స్పాట్‌కు కొద్దిదూరంలో కాషనరీ సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆయా స్పాట్లకు రెండు వైపులా కనీసం 200 మీటర్ల దూరంలో తొలి బోర్డు (కాషన్‌–1), 100 మీటర్ల దగ్గర మరోటి (కాషన్‌–2) ఏర్పాటు చేయాలి. సదరు మార్గం నేషనల్‌ హైవే అయితే 900 ఎంఎం కొలతలో, యాక్సిడెంట్‌ ప్రోన్‌ ఏరియా అని స్పష్టంగా తెలిసేలా ఇవి ఉండాలి. ఇలా నాలుగు బోర్డులతో వాహన చోదకులను అప్రమత్తం చేయవచ్చు. 

స్పీడ్‌ బ్రేకర్, రంబ్లర్‌ స్ట్రిప్స్‌: నెక్లెస్‌రోడ్‌ వంటి చోట్ల వేగానికి ఆస్కారం ఉంది. 24 గంటలూ పోలీసులు కాపుకాయలేరు. దీంతో ఆ రూట్‌లో కీలక ప్రాంతాల్లో వేగ నియంత్రణ కోసం స్పీడ్‌ బ్రేకర్లను ఏర్పాటు చేయాలి. ప్రమాదాలు చోటు చేసుకుంటున్న వాటిలో జాతీయ రహదారులే ఉంటున్నాయి. వీటిపై నిబంధనల ప్రకారం స్పీడ్‌ బ్రేకర్లు వేసే అవకాశం ఉండదు. ఇలాంటి ప్రాంతాల్లో విని యోగించడానికి రంబ్లర్‌ స్ట్రిప్స్‌ ఉంటాయి. రెండు అంగుళాల ఎత్తు, అదే వెడల్పుతో ఉండే ఈ స్ట్రిప్స్‌ను మలుపునకు 100 మీటర్ల దూరంలో ఇరువైపులా రోడ్డుపై 10 నుంచి 15 చొప్పున ఏర్పాటు చేయాలి. ఇవి వాహనాల వేగ నియంత్రణకు ఉపకరిస్తాయి.

హజార్డ్‌ మార్కర్స్‌: ఈ డెత్‌ స్పాట్స్‌ దగ్గర ఉన్న డివైడర్‌ను సక్రమంగా నిర్వహించాలి. ఆ ప్రాంతాలకు ఇరువైపులా కనీసం 400 మీటర్ల మేర అయినా అవసరమైనంత ఎత్తులో దీన్ని నిర్మించాలి. దీనికి ఇరువైపులా హజార్డ్‌ మార్కర్స్‌ (ప్రమాద సూచికలు) ఏర్పాటు చేయాలి. చీకట్లోనూ వీటి ఉనికి వాహనచోదకులకు తెలిసేలా రిఫ్లెక్టివ్‌ మార్కర్స్‌ లేదా  సోలార్‌ మార్కర్స్‌ పెట్టాలి. 

కలర్స్, క్యాట్‌ ఐస్‌: ప్రమాద హేతువులుగా ఉన్న ప్రాంతాల్లో డివైడర్‌తో పాటు రోడ్‌ మార్జిన్స్‌లోనూ పెయిటింగ్‌ వేయడం అవసరం. సాధారణ పెయింట్స్‌ కంటే రిఫ్లెక్టివ్‌ పెయింట్స్‌ వల్ల ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి వేళ కూడా ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. మార్జిన్స్‌తో పాటు ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో రాత్రి పూట మెరిసే క్యాట్‌ ఐస్‌ ఏర్పాటు చేయాలి. ఇవి రాత్రి పూట వాహనచోదకుల దృష్టిని ఆకర్షిస్తాయి. 

జిగ్‌జాగ్‌ మార్కింగ్‌: ప్రమాదాల నివారణకు సంబంధించి ఆఖరుది అత్యంత కీలకమైంది జిగ్‌జాగ్‌ మార్కింగ్‌. ప్రమాదాలకు కారణమవుతున్న, ఆస్కారం ఉన్న ప్రాంతం కేంద్రంగా అటు–ఇటు దాదాపు 100 మీటర్ల మేర ఈ మార్కింగ్స్‌ వేయాల్సి ఉంది. ఫలితంగా వీటిపై నుంచి ప్రయాణిస్తున్న వాహనచోదకుడు మానసికంగా వెళ్తున్న దానికంటే ఎక్కువ వేగంతో ఉన్నట్లు భ్రాంతి చెందిన ఆటోమేటిక్‌గా స్లో అవుతాడు..

ఫాగ్‌లైట్స్‌: శీతాకాలంలో అర్ధరాత్రి దాటిన తర్వాత, తెల్లవారుజామున మంచుఎక్కువగా కురుస్తుంది. దీని కారణంగానే వాహన చోదకుడికి రోడ్డు కనిపించక, ఎదుటి వాహనం కానరాక ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్క వాహనానికీ ఫాగ్‌లైట్‌ ఏర్పాటు కచ్చితం చేయాలి. దీనివల్ల ఈ వాహనం ఉనికి ఎదుటి వారికి తెలుస్తుంది. వాహనచోదకుడికీ రహదారి కొంతమేర స్పష్టంగా       కనిపిస్తుంది. 

మరిన్ని వార్తలు