కలవరమాయే మదిలో..

19 Oct, 2019 04:25 IST|Sakshi

గ్రేటర్‌లో 13.7 % మందికి పలు మానసిక సమస్యలు

వాటిని రుగ్మతగా పరిగణించని మహానగర వాసులు

మానసిక రోగుల్లో 28% మందికి తరచూ ఆత్మహత్య ఆలోచనలు

వీటిపై 59 శాతం మందికి అవగాహన లేమి..

కాస్మోస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ తాజా అధ్యయనంలో వెల్లడి

ఒత్తిళ్ల పొత్తిళ్లలో నిత్యం సతమతమవుతున్న నగరవాసుల మనసులు కల్లోల సాగరంలో కొట్టుమిట్టాడుతున్నాయి. జీవన సమరంలో ఎదురవుతున్న సమస్యలపట్ల ఆశాభావదృక్పథం తగ్గి..ఆత్మహత్యల దిశగా ప్రయాణిస్తున్నారు. మానసిక రుగ్మతల్లో యువత చిక్కుకొని విలవిలలాడుతోంది.చెదిరిన మనసుకు చికిత్సలు లేక జీవితం గతి తప్పుతోంది. మనిషికి మతి తప్పుతున్న ఈ దుస్థితి ప్రమాద ఘంటికలు మోగిస్తోందని ‘‘కాస్మోస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ బిహేవియరల్‌ సైన్స్‌’ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మేలుకోమంటున్నారు.

సాక్షి,హైదరాబాద్‌: బహుముఖ వృత్తులు, నిత్యం సోషల్‌ మీడియా.. ఇతర యాప్‌లతో కుస్తీపట్టడంతోపాటు ఉద్యోగ వ్యాపారాలు, చదువులు..వివిధ రకాల వ్యాపకాలతో నిత్యం క్షణం తీరికలేకుండా గడిపే గ్రేటర్‌ వాసుల్లో ఇటీవలికాలంలో మానసిక రుగ్మతలు సైతం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.మూడేళ్లుగా నగరంలో వీటితో సతమతమౌతున్నవారి సంఖ్య 8 నుంచి 13.7 శాతానికి పెరిగినట్లు ‘కాస్మోస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌హెల్త్‌ అండ్‌ బిహేవియరల్‌ సైన్స్‌’నిపుణులు నగరంలో నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. చాలామంది తమ దైనందిన జీవితంలో వృత్తి,ఉద్యోగ, వ్యాపారాల్లో మునిగితేలుతూ..తమ మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. తాము నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న డిప్రెషన్, విపరీత ఆలోచనలు, ఇతర మానసిక సమస్యలను సుమారు 59% మంది ఒక జబ్బుగా పరిగణించడంలేదని ఈ అధ్యయనం వెల్లడించింది. ఇక దీర్ఘకాలికంగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నవారికి సరైన కౌన్సెలింగ్‌ లభించకపోవడంతో  మానసిక రోగుల్లో 28% మందికి తరచూ ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు చుట్టుముడుతున్నట్లు ఈ అధ్యయనం హెచ్చరించింది. ఈ స్థితిలో ఉన్నవారిని వారి తల్లిదండ్రులు, కుటుంబీకులు, స్నేహితులు విధిగా సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకెళ్లి మెరుగైన కౌన్సెలింగ్‌ ఇప్పించాలని ఈ అధ్యయనం సూచించింది.

ఇలా చేస్తే మానసిక ఒత్తిడిమాయం..

  • రోజులో కొద్దిసేపు యోగా, ధ్యానం, నడక, జిమ్,వంటి శారీరక వ్యాయామానికి ప్రాధాన్యతనివ్వాలి. 
  •  సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి.
  • సామాజిక మాధ్యమాల్లో రోజుకు అరగంటకు మించి గడపరాదు.
  • ఇష్టంలేని చదువులు, మార్కులు, ర్యాంకులు, కెరీర్‌ ఎంచుకునే అంశాల్లో పిల్లలపై తల్లిదండ్రులు,యాజమాన్యాలు ఒత్తిడిచేయరాదు.
  • యువతరంతో తల్లిదండ్రులు, టీచర్స్‌ స్నేహితుల్లా మెలిగి వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తోడ్పాటునివ్వాలి 
  • దురలవాట్లు, మద్యం, మాదకద్రవ్యాలు వంటి వాటికి దూరంగా ఉండడం. చెడు స్నేహాలను వదిలేయడం. వ్యతిరేక భావనలకు దూరంగా ఉండాలి. ఎప్పుడూఆశాభావంతో ఆలోచించాలి.
  • ఎంచుకున్న రంగం, కెరీర్‌లో అత్యుత్తమ విజయాలు సాధించిన వారి విజయగాథలను తెలుసుకోవడం, వాటి నుంచి స్ఫూర్తి పొందాలి.  
  • మానసిక విశ్రాంతికి ప్రాధాన్యతనివ్వాలి.
  • ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గార్డెనింగ్‌ వంటి వాటితో గడపాలి. ఇష్టమైన పుస్తకాలు చదవాలి.

18–45 ఏళ్ల మధ్యనున్నవారికే అధికం..
గ్రేటర్‌లో ప్రధానంగా 18–45 ఏళ్ల మధ్యనున్నవారే అధికంగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. ఈ వయో గ్రూపులో ఉన్నవారు అత్యధికంగా బహుముఖ లక్ష్యాలు చేపట్టడం, గంటలతరబడి సోషల్‌మీడియా, ఇతర యాప్‌లతో కాలక్షేపం చేయడంతోపాటు ఆర్థిక సమస్యలు, ఉద్యోగంలో అధిక పనిఒత్తిడి, కొన్నిసార్లు ఉద్యోగం కోల్పోవడం, కుటుంబ సమస్యలు, దాంపత్య సంబంధాలు ,కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నమవ్వడం, పోటీపరీక్షల్లో వైఫల్యం, వ్యాపారాల్లో నష్టపోవడం వంటి కారణాలు రుగ్మతలకు దారితీస్తున్నట్లు తేలింది.బాధితులు సైతం తమ సమస్యలను కుటుంబసభ్యులు, స్నేహితులకు చెప్పుకునేందుకు బిడియపడుతున్నట్లు వెల్లడైంది. ఒకవేళ చెప్పుకున్నా నేరుగా సైక్రియాట్రిస్ట్‌ను సంప్రదించేకన్నా ఆన్‌లైన్‌ మాధ్యమంలో కౌన్సెలింగ్‌కే ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక 80 శాతం మంది ఆరోగ్యబీమా చేయిస్తున్నా..అందులో మానసిక సమస్యలు కవర్‌ అయ్యే పాలసీలు తీసుకోవడం లేదని గుర్తించారు.​​​​​​​

యువతలో మానసిక సమస్యలకు కారణాలివే

  • సామాజిక మాధ్యమాల్లో గంటలతరబడి గడపడం
  • మంచి మార్కులు సాధించాలని తల్లిదండ్రులు,కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడిచేయడం. 
  • తెలిసీ తెలియని వయస్సులో డ్రగ్స్, తాగుడు,
  • పోర్న్‌ సైట్స్‌ చూసేందుకు అలవాటుపడడ
  •  ప్రేమ కన్నా త్వరగా ఆకర్షణకు లోనుకావడం.
  • వన్‌సైడ్‌ లవ్‌..  కెరీర్‌ పరంగా ఒడిదుడుకులు
  • చదువును నిర్లక్ష్యం చేయడం
  • తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఇంట్లో వారినుంచి సరైన మార్గదర్శనం లభించకపోవడం

మరిన్ని వార్తలు