లైట్‌ జాబా.. అయితే ఓకే

20 Jul, 2019 14:28 IST|Sakshi

సాక్షి,మంచిర్యాల : ‘భూగర్భ గనుల్లో పనిచేసేందుకు యువత ఆసక్తి చూపడంలేదు. ఉన్నత చదువులు చదువుకున్న వారు అన్ని పనులను ఇష్టపడటంలేదు.. అందరూ తేలికపాటి పనుల కోసం ఎదురు చూస్తున్నారు.’అని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ ఇటీవల నిర్వహించిన జేసీసీ సమావేశంలో కార్మిక సంఘాలతో పేర్కొన్నారు. మరికొద్ది రోజులు ఇదేవిధంగా ముందుకు సాగితే సంస్థ అభివృద్ధికి, మానవ వనరులకు విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడే ప్రమాదముందని అధికారులు చెబుతున్నారు.సంస్థలో ఉత్పత్తి వైపు 80 శాతం మంది పనిచేయాల్సి ఉండగా మిగతా 20 శాతం మంది కార్యాలయాలు, డిపార్ట్‌మెంట్‌ ల లో పనిచేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం నూతనంగా ఉద్యోగాల్లోకి వచ్చే యువత కార్యాలయాల వైపే దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. 

విధులకు గైర్హాజర్‌.. 
అనారోగ్య కారణాల రీత్యా కార్మికులను మెడికల్‌ ఇన్వాలిడేషన్‌(అన్‌ఫిట్‌) చేసి యాజమాన్యం వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తోంది. ఇలా నియమితులైన యువ కార్మికులు భూగర్భగనుల్లోకి వెళ్లి పనిచేసేందుకు ఆసక్తి చూపడంలేదు. ఇటీవల చేరిన సుమారు 4వేల మందిలో చాలా మంది ఇలాంటి ఉద్యోగాలవైపే మక్కువ చూపుతున్నారు. దీంతో కీలకమైన పని స్థలాల్లో పనిచేసే కార్మికులు కొరవడుతున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. చాలా మంది యువ ఉద్యోగులు విధులకు గైర్హాజరవుతూ ఉద్యోగాలకు ముప్పుతెచ్చునే పరిస్థితిల్లో ఉన్నట్లు సమాచారం. ఒక్క వకీల్‌పల్లిగనిలో 35మంది యువ కార్మికులు గైర్హాజర్‌ కౌన్సెలింగ్‌కు హాజరైనట్లు అధికారులు పేర్కొంటున్నారు.  

మరిన్ని విభాగాలు ఔట్‌ సోర్సింగ్‌కు..? 
సింగరేణి వ్యాప్తంగా ఉన్న భూగర్భ గనుల్లో పని చేసే మరిన్ని విభాగాలను ఔట్‌ సోర్సింగ్‌చేసే దిశ గా యాజమాన్యం ముందుకు సాగుతోంది. భూగ ర్భ గనుల్లో మేషన్‌ పనిచేసేందుకు కార్మికులు ఆసక్తి కనబర్చకపోవడంతో కాంట్రాక్ట్‌ కార్మికుల ద్వారా భూగర్భ గనిలోకి దించేందుకు యాజ మాన్యం ప్రయత్నించింది. దీన్ని గుర్తింపు యూనియన్‌ నాయకులు తిప్పి కొట్టడంతో ప్రస్తుతానికి నిలిచిపోయింది.

రాబోయే రోజుల్లో ఈపని ప్రైవేట్‌పరం తప్పకపోవచ్చనే ప్రచారం సాగుతోంది. భూగర్భగనుల్లో కష్టంగా ఉన్న టింబర్‌మెన్, కోల్‌కట్టర్, సపోర్ట్‌మెన్‌ పనులు కూడా ప్రైవేట్‌ పరం చేసేందుకు యాజమాన్యం యోచిస్తున్నట్లు సమాచారం. నూతనంగా ఉద్యోగాల్లోకి చేరే కార్మికులు ఈ పని చేసేందుకు ముందుకు రాకపోవడం కూడా కారణంగా చెబుతున్నారు.  

పెరిగిపోతున్న రాజకీయ జోక్యం 
గతంలో సింగరేణిలో నూతనంగా ఉద్యోగాల్లోకి చేరే యువ కార్మికులకు తప్పనిసరిగా భూగర్భగనిలో పనిచేయాలనే నిబంధన ఉండేది. ఇన్ని టబ్బులు, మస్టర్లు పూర్తి చేయాలనే రూల్స్‌ విధించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎమ్మెల్యే మొదలుకొని రాష్ట్ర మంత్రి వరకు పైరవీ లెటర్లతో అందరూ తేలిక ఉద్యోగం కోసం పోటీ పడుతున్నారు. ఈక్రమంలో సంస్థ పరిస్థితి రాబోయే రోజుల్లో ఇబ్బంది కరంగా తయారుకావచ్చనే ప్రచారం సాగుతోంది.  

టెక్నీషియన్ల వైపు యాజమాన్యం చూపు.. 
భూగర్భ గనుల్లో పూర్తి స్థాయి యాంత్రీకరణ దిశగా  సాగుతున్న నేపథ్యంలో మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ ద్వారా అందరినీ తీసుకునే దానికన్నా సాంకేతిక పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులను బయటి వారిని తీసుకుంటే సంస్థ పురోభివృద్ధికి దోహదం చేస్తారనే ఆలోచనలో సీఎండీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ పట్ల ఆయ న ఎక్కువగా ఆసక్తి చూపడం లేదని అంటున్నా రు. ఉత్పత్తి వైపు పనిచేసే ఉద్యోగులు కావాలనే లక్ష్యంతో యాజమాన్యం ఉన్నట్లు సమాచారం.   

మరిన్ని వార్తలు