నాలుగో సింహం అవుతా..!

4 Dec, 2019 01:58 IST|Sakshi

పోలీస్‌ ఉద్యోగంపై విద్యార్థుల ఆసక్తి 

మోడల్‌ స్కూల్‌ విద్యార్థుల సర్వేలో వెల్లడి

అబ్బాయిల్లో 27%, అమ్మాయిల్లో 12% మందికి మక్కువ..

సాక్షి, హైదరాబాద్‌: పెద్దయ్యాక ఏమవుతారు..? విద్యార్థులను ఈ ప్రశ్న అడిగితే ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెబుతారు. అయితే చాలా మంది విద్యార్థులు మాత్రం పోలీస్‌ అవుతామని చెబుతున్నారు. ఇందుకోసం చిన్నప్పటి నుంచే కృషి చేస్తామని కూడా అంటున్నారు. రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులపై ఇటీవల జరిపిన సర్వేలో పలు అంశాలు వెల్లడయ్యాయి. వీరిలో దాదాపు 27 శాతం మంది బాలురు, 12 శాతం మంది బాలికలు పోలీస్‌ శాఖపై తమ ఆసక్తిని వెలిబుచ్చారు.

20 శాతం మంది బాలికలు అగ్రికల్చరర్, ఫుడ్‌ సంబంధిత రంగాల్లో భవిష్యత్తు కోరుకుంటున్నారు. విద్యార్ధి దశ నుంచే భవిష్యత్తుపై అవగాహన ఏర్పరచడంతో పాటు భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా పాఠశాల విద్య స్థాయి నుంచే కృషి చేసేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఐఐటీ మద్రాస్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ (సైకోమెట్రిక్‌ టెస్టు) రూపొందించారు. దాన్ని మై చాయిస్‌ మై ఫ్యూచర్‌ పేరుతో రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్లలో అమల్లోకి తెచ్చి విద్యార్థుల అభిరుచులు, ఆసక్తులను తెలుసుకుంది.

సర్వేలో వెల్లడైన అంశాలను క్రోఢీకరించి రూపొందించిన నివేదికను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. విద్యార్థుల వ్యక్తిత్వంపై నాలుగు కేటగిరీలు, కెరీర్‌ సంబంధ అంశాల్లో 8 కేటగిరీల్లో మొత్తం 72 ప్రశ్నలతో ఈ సర్వే సాగింది. 27 జిల్లాల్లో 194 మోడల్‌ స్కూళ్లలోని 18 వేల మంది విద్యార్థులు, 200 మంది టీచర్లతో ఈ సర్వే నిర్వహించారు.

సర్వేలో వెల్లడైన ప్రధాన అంశాలు ఇవే.. 
విద్యార్థుల్లో ఎక్కువ మంది 7 రంగాలపైనే ఎక్కువ దృష్టిసారిస్తున్నట్లు సర్వేలో తేలింది. పోలీస్, అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్, ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, మెడిసిన్‌ అండ్‌ హెల్త్‌కేర్, స్పోర్ట్స్, డిఫెన్స్, గవర్నమెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ రంగాలపైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. సర్వేలో పాల్గొన్న విద్యార్థుల్లో బాలికలు ఎక్కువ మంది అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్, హ్యూమన్‌ సర్వీసెస్, ఎంటర్‌టైన్‌మెంట్, హాస్పిటాలిటీ, టూరిజం, ఎడ్యుకేషన్, ట్రైనింగ్‌ రంగాలపై ఆసక్తి కనబరిచారు. బాలురలో పోలీసు, హ్యూమన్‌ సర్వీస్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, హాస్పిటాలిటీ, టూరిజం రంగాలపై ఆసక్తి ప్రదర్శించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా