యువహో..

19 Sep, 2018 13:17 IST|Sakshi

సాక్షి, మెదక్‌: జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరుగుతోంది. ముసాయిదా జాబితా లెక్కల ప్రకారం జిల్లాలో 10వేల మంది ఓటర్లు పెరిగారు.అక్టోబర్‌ 8వ తేదీన తుది ఓటరు జాబితా ప్రకటించే నాటికి ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో 18 ఏళ్లు నిండిన యువత ఓటు నమోదు చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఓటరు జాబితా సవరణ కూడా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం 4,390 దరఖాస్తులు చేసుకున్నారు. ఈనెల 25వ తేదీ ఓటరు నమోదుకు చివరి అవకాశం.  నమోదు చేసుకునే వారి సంఖ్య మరింత పెరుగుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.  అధికార యంత్రంగం ఇది వరకే ఓటరు నమోదు కోసం అన్ని గ్రామాల్లో ప్రచారం ప్రారంభించింది. జనవరి1, 2018 నాటికి 18 ఏళ్ల వయస్సు నిండిన యువతీ, యువకులు తమ పేర్లు ఓటరు జాబితాలో నమోదు చేయించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం కళాశాలల్లో ‘చునావ్‌ పాఠశాల’ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు.

విద్యార్థులే కమిటీలుగా ఏర్పడి ఓటు నమోదు ఆవశ్యకత గురించి కళాశాలల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే రాజకీయ పార్టీలు 18 ఏళ్లు నిండిన వారిని ఓటరు జాబితాలో చేర్పించేందుకు ప్రత్యేక చొరువ చూపుతున్నారు. మెదక్, నర్సాపూర్‌ నియోజకవర్గంలోని అన్ని రాజకీయపార్టీల కార్యకర్తలు గ్రామాల్లో పర్యటిస్తూ అర్హులైన వా వివరాలను సేకరిస్తూ ఓటరు జాబితాలో పేరు చేర్చేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ప్రకటించిన ఓటరు జాబితాలో జిల్లాలో మొత్తం 3,60,828 మంది ఓటర్లు ఉన్నారు.

ఇటీవల ప్రకటించిన ఓటరు ముసాయిదా జాబితాలో ఆ సంఖ్య 3,71,373కు చేరుకుంది. ఓటరు జాబితా సవరణల కారణంగా మెదక్, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో మొత్తం 10,545 మంది ఓటర్లుగా పెరిగారు. ప్రస్తుతం ఇంకా ఓటర్ల సవరణ కొనసాగుతోంది. ఈనెల 25 వరకు సవరణలు చేయనున్నారు.  ముసాయిదా జాబితా ప్రకటనకు ముందు మెదక్‌ నియోజకవర్గంలో 1,78,364 మంది ఓటర్లు ఉన్నారు. ముసాయిదా జాబితాలో  1,82,464కు పెరిగింది. నర్సాపూర్‌ నియోజవర్గంలో గత ఓటరు జాబితాలో 1,82,464 ఉండగా ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 1,88, 909 కు పెరిగింది.  తుది ఓటరు జాబితా ప్రకటించే నాటికి మరో 5 నుంచి 8వేల వరకు ఓటర్లు పెరగొచ్చని అధికారుల అంచనా.
 
ఓటరుగా నమోదుకు ఆసక్తి 
ఓటరుగా తమ పేరు నమోదుచేసుకునేందకు జిల్లాలో అర్హులు ఆసక్తి చూపుతున్నారు. అధికారుల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కొత్త ఓటరుగా నమోదు కోసం ఫామ్‌ 6 ద్వారా 4,390 మంది దరఖాస్తు చేసుకున్నారు. మెదక్‌ నియోజకవర్గం నుంచి 3,044, నర్సాపూర్‌ నియోజకవర్గం నుంచి 1,346 దరఖాస్తులు అందాయి. ఓటరు జాబితాలో నుంచి పేరు తొలగింపు కోసం ఫామ్‌ 7 ద్వారా మొత్తం 2,025 దరఖాస్తులు వచ్చాయి. మెదక్‌ నియోజకవర్గంలో 1,152, నర్సాపూర్‌లో 8,73 దరఖాస్తులు అందాయి.

ఓటరు జాబితాలో పేర్లు, చిరునామా తదితర సవరణల కోసం ఫామ్‌ 8 ద్వారా అధికారులకు 1,811 దరఖాస్తులు అందాయి. ఇందులో మెదక్‌ నియోజకవర్గంలో 779, నర్సాపూర్‌లో 1032 దరఖాస్తులు ఉన్నాయి. ఓటు బదిలీ కోసం ఫామ్‌ 8ఏ ద్వారా 285 దరఖాస్తులు వచ్చాయి. మెదక్‌ నుంచి 152, నర్సాపూర్‌ నుంచి 133 అందాయి. కొత్త ఓటర్లు నమోదు కోసం 4,390 దరఖాస్తులు రాగా ఇందులో 2వేల దరఖాస్తులు 18 ఏళ్లు నిండిన వారివిగా ఉన్నట్లు తెలిపారు. కాగా ఓటరు నమోదు, సవరణ కార్యక్రమాన్ని కలెక్టర్‌ ధర్మారెడ్డి మంగళవారం పరిశీలించారు. మెదక్‌ తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించి తహసీల్దార్, బూత్‌లెవల్‌ ఆఫీసర్లతో మాట్లాడారు.

యువతీయువకులు ముందుకు రావాలి
జిల్లాలోని 18 ఏళ్లు నిండిన యువతీయువకులు తమ పేర్లను ఓటరు జాబితాలో చేర్చుకోవాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి కోరారు. జనవరి 1, 2018 నాటికి 18 ఏళ్ల వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ  ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్‌ లేదా బూత్‌లెవల్‌ అధికారికి దరఖాస్తు ఇవ్వటం ద్వారా  నమోదు చేసుకోవచ్చన్నారు. అర్హులైన వారు ఫామ్‌ 6 పూర్తి  అందజేయాలన్నారు. ఫామ్‌ 6తో పాటు రెండు ఫొటోలు, ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్, ఆధార్‌కార్డు జతచేయాలని సూచించారు. ఫామ్‌ 6 ఇచ్చిన వెంటనే వీఆర్వో దరఖాస్తుదారుల స్థానికత, సాధారణ నివాసాన్ని ధ్రవీకరించుకుని ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌కు అందజేస్తారన్నారు. ఈనెల 25వ తేదీ వరకు సమయం ఉన్నట్లు తెలిపారు.

బీఎల్‌ఓలతో ఓటరు జాబితా సవరణ గురించి మాట్లాడుతున్న కలెక్టర్‌ ధర్మారెడ్డి 

మరిన్ని వార్తలు