నాపై కేసు కొట్టివేయండి...: వైఎస్ జగన్

26 Jun, 2014 01:15 IST|Sakshi
నాపై కేసు కొట్టివేయండి...: వైఎస్ జగన్

హైకోర్టులో జగన్‌మోహన్‌రెడ్డి పిటిషన్
 సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచారంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ తనపై కోదాడ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాక ఈ ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి తన అరెస్ట్‌తో సహా తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. నల్లగొండ జిల్లా, కోదాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భంలో జగన్‌మోహన్‌రెడ్డి మరికొందరు రోడ్‌షో నిర్వహించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని, తద్వారా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ అప్పటి ఎన్నికల అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోదాడ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండానే పోలీసులు ఏకపక్షంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని జగన్‌మోహన్‌రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
 
  సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకున్న తరువాతనే తాను ఈ ఏడాది ఏప్రిల్ 26న కోదాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించానని, ఎక్కడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించలేదని పేర్కొన్నారు. చేయని తప్పుకు కేసు నమోదు చేయడం, అధికార దుర్వినియోగమే అవుతుందని, అందువల్ల తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఇందులో కోదాడ ఎస్‌హెచ్‌ఓ, అప్పటి ఎన్నికల అధికారి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ ప్రభుత్వ హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు