రాజన్న యాదిలో..

2 Sep, 2019 11:40 IST|Sakshi

జనం గుండెల్లో వైఎస్సార్‌ పదిలం

నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి

పేదల పెన్నిధి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలనను ఉమ్మడి జిల్లా ప్రజలు మరవలేదు. ఆయన పథకాలతో జనం ఇప్పటికీ లబ్ధి పొందుతూ నిరంతరం తలుచుకూనే ఉంటున్నారు. అప్పుడు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలు, మహిళలకు పావలా వడ్డీ రుణాలు, జలయజ్ఞం, రైతులకు ఉచిత విద్యుత్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. ఇలా ఎన్నో మంచి పనులతో పేదోళ్ల గుండెల్లో కొలువై ఉన్నారు. నేడు రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రతీ పల్లె.. ప్రతీ గుండె తలుచుకుంటోంది. భౌతికంగా ఆయన లేకపోయినా జ్ఞాపకాలు మాత్రం పదిలంగా ఉన్నాయి.

సాక్షి, ఆదిలాబాద్‌: వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పేదలకు మెరుగైన వైద్యం అందించాలని సంకల్పించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2008లో ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో రూ.125 కోట్లతో రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌) కళాశాలను ఏర్పాటు చేశారు. నేడు ఈ ఆస్పత్రిలో అధునాతన వైద్యం అందుతుందంటే అది ఆ మహానుభావుడి చలువే. ఏటా వందలాది మంది విద్యార్థులు వైద్య పట్టాలు పుచ్చుకొని బయటకు వస్తున్నారు. రిమ్స్‌తోపాటు ఉమ్మడి జిల్లాలోని బాసర ట్రిపుల్‌ఐటీ నెలకొల్పి ఎందరో మంది విద్యార్థులకు విద్యా ప్రదాత అయ్యారు. పేద విద్యార్థులకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చదువులు అందించారు. రోడ్డు, ఇతర ప్రమాద మరణాలను అరికట్టాలనే ఉద్దేశంతో 108 అంబులెన్స్‌ను వైఎస్‌ఆర్‌ హయాంలోనే 2006 జూన్‌లో అమలులోకి తీసుకొచ్చారు. ఎక్కడా ఏ ప్రమాదం జరిగినా కాల్‌ చేస్తే చాలూ.. ప్రమాద స్థలానికి 108 అంబులెన్స్‌ చేరుకుంటోంది. గ్రామీణ ప్రజలకు వైద్యసేవలు అందించేలా 104 వాహనాన్ని ప్రవేశపెట్టారు. గ్రామీణులకు ప్రతినెలా వారి చెంతకే వెళ్లి వైద్యసేవలు అందిస్తున్నారు.

సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువలో..
వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల సంక్షేమానికి దోహదపడ్డాయి. ఇప్పటికే ఆయన ప్రవేశపెట్టిన పథకాలతో ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా తుది శ్వాస వరకు శ్రమించారు. పిల్లలు, యువత, విద్యార్థులు, మహిళలు, వృద్దులు, వికలాంగులు, వితంతువులు, రైతులు.. ఇలా అన్నివర్గాల ప్రజలకు ఆయన దేవుడయ్యారు. ప్రజలకు జలయజ్ఞ ఫలాలు అందించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో వేలాది ఎకరాల బీడు భూములు పంట పొలాలుగా మారాయి. తుమ్మిడిహెట్టి వద్ద డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఎల్లంపల్లి, గొల్లవాగు, ర్యాలీవాగు, కుమురంభీం, జగన్నాథ్‌ఫూర్, గడ్డెన్నవాగు, మత్తడివాగు ప్రాజెక్టులు వైఎస్‌ చొలువే.

రైతులకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేయడంతోపాటు విద్యుత్‌ బకాయిలు మాఫీ చేసిన ఘనత ఆయనకే దక్కుతోంది. ఏడు గంటల పాటు నిరంతరం ఉచిత విద్యుత్‌ అందించారు. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ పథకం తీసుకొచ్చి పేదలకు నీడ కల్పించారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల మెట్లు కూడా ఎక్కని పేదలకు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆస్పత్రుల్లో వైద్యం అందేలా చూశారు. లక్షలు ఖర్చు చేసే వైద్య సదుపాయాలను పేదలు ఉచితంగా పొందుతున్నారు. మహిళల కోసం ఇందిరా క్రాంతి పథకాన్ని ప్రవేశపెట్టారు. వీరికి పావలా వడ్డీ ద్వారా రుణాలను అందించారు. ఎంతో మంది పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందించి విద్యాప్రదాతగా నిలిచారు. దీంతో వారు ఉన్నత చదువులు చదవాలనుకున్న పేద విద్యార్థుల కల సాకారమైంది.

రైతు బిడ్డగా..
వైఎస్‌ఆర్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు సంక్షేమంపై దృష్టి సారించి ఉచిత విద్యుత్‌ సరఫరా>, బకాయిల మాఫీపై మొదటి సంతకం చేశారు. దీంతో ఆదిలాబాద్‌ జిల్లాలో విద్యుత్‌ బకాయిలు రూ.34కోట్ల మేర రైతులకు మేలు జరిగింది. 65వేల మంది రైతులు ఉచిత విద్యుత్‌ లబ్ధి పొందారు. రుణమాఫీ కింద 2.33 లక్షల మంది రైతులకు రూ.252 కోట్ల రుణమాఫీ అయ్యాయి. అప్పటికే రుణాలు చెల్లించిన 1.29 లక్షల మందికి 5వేల చొప్పున రూ.6297 కోట్ల ప్రోత్సాహకాలు అందించారు. 2004 నుంచి 2009 వరకు వైఎస్‌ హయాంలో 83,385 మంది విద్యార్థులకు రూ.38.89 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద చెల్లించారు. అదేవిధంగా అటవీ భూములపై హక్కులు కల్పించగా, భూములపై ఆధారపడిన ఎంతో మంది గిరిజనులకు మేలు జరిగింది.

పాదయాత్రలో ఈ సమస్యలు తెలుసుకున్న వైఎస్‌ఆర్‌ 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత హక్కు పత్రాలను రైతులకు అందజేశారు. ఐదు విడతల్లో 38,483 దరఖాస్తులపై 4.03 లక్షల ఎకరాలకు అటవీహక్కు పత్రాలు ఇచ్చారు. అదేవిధంగా వైఎస్‌ హయాంలో ఇందిరమ్మ పథకం ద్వారా 2.67 లక్షల గృహాలు మంజూరు కాగా, రూ.315కోట్లు వెచ్చించి 84వేల ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 1100 మందికి రూ.33 కోట్లు ఖర్చు చేసి ఆపరేషన్లు చేయించారు. ఆరోగ్యశ్రీ కింద 948 రకాల వ్యాధులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకునే విధంగా చూశారు.

నేడు వర్ధంతి కార్యక్రమాలు..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు.

మరిన్ని వార్తలు