మరపురాని మారాజు

2 Sep, 2019 10:15 IST|Sakshi

ఆయన సేవలు అజరామరం

గోదారమ్మను తెచ్చి గొంతు తడిపాడు

నేడు వైఎస్సార్‌ వర్ధంతి

సాక్షి, కామారెడ్డి: పేద ప్రజల కన్నీళ్లను తుడిచిన మహా నాయకుడు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి. తన పాదయాత్రతో ప్రజల కష్టాలను కళ్లారా చూసి చలించిపోయిన రాజన్న సీఎం అయ్యాక పేదల కోసం ఎన్నో పథకాలను తీసుకువచ్చి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఈ నెల 2న వైఎస్సార్‌ వర్దంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 2008లో ప్రజాప్రస్థానం పాదయాత్ర ద్వారా కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట మండలంలో అడుగిడిన వైఎస్సార్‌ ఎల్లారెడ్డి, లింగంపేట, తాడ్వాయి, కామారెడ్డి, మాచారెడ్డి మండలాల మీదుగా సిరిసిల్ల జిల్లాలోకి ప్రవేశించింది. కాగా పాదయాత్ర సందర్భంగా జిల్లాలోని రైతులు, రైతుకూలీలు పడుతున్న కష్టాలను ఆయన కళ్లారా చూశారు. మాచారెడ్డి మండలంలో రైతుల ఆత్మ హత్యల గురించి తెలుసుకుని చలించిపోయారు.

వైఎస్సార్‌ సీఎం అయ్యాక ఆ రైతు కుటుంబాల కన్నీళ్లు తుడిచే ప్రయత్నం జరిగింది. అలాగే రైతులు సాగునీటికి పడుతున్న కష్టాలను తీర్చడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అప్పట్లో మాచారెడ్డి మండలంలో రూ.10 కోట్ల వ్యయంతో చెరువుల నిర్మాణం, మరమ్మతులకు నిధులు మంజూరు చేశారు. నాగిరెడ్డిపేట మండలంలో పోచారం ప్రాజెక్టుకు నిధులు కేటాయించారు. తెలంగాణ రైతాంగ సాగునీటి కష్టాలు తీర్చేందుకు గాను ప్రాణహిత–చేవెళ్ల పథకానికి శ్రీకారం చుట్టారు. దీనికి కామారెడ్డిలోనే శంకుస్థాపన చేశారు. 20,21,22 ప్యాకేజీల ద్వారా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా మొదట 20,21 ప్యాకేజీ పనులు చేపట్టారు.

కామారెడ్డి ప్రాంతంలో..
కామారెడ్డి ప్రాంతానికి సంబంధించి 22వ ప్యాకేజీ పనుల్లో భాగంగా భూంపల్లి వద్ద రిజర్వాయర్‌ నిర్మాణ పనులు చేపట్టారు. అలాగే కెనాల్‌ పనులు కూడా జరిగాయి. తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్టు రిడిజైన్‌ కోసం పనులను నిలిపివేసింది. ఇటీవలే 22వ ప్యాకేజీని యధావిధిగా కొనసాగిస్తూ, రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచి, మరికొంత విస్తీర్ణాన్ని కలిపింది. రూ. 33 కోట్ల వ్యయంతో గోదావరి నుంచి నీటిని తీసుకువచ్చి కామారెడ్డి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చారు. సంక్షేమరంగంలో ఎన్నో మార్పులు జరిగాయి. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్‌ను రూ.200కు పెంచి వారిని ఆదుకున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మందికి పునర్జన్మ ప్రసాదించారు. ఫీజు రీయింబర్స్‌మెంటు ద్వారా వేలాది మంది విద్యార్థుల ఉన్నత చదువుల కోసం దోహదపడ్డారు. కామారెడ్డి పట్టణంలో స్టేడియం నిర్మాణం, డెయిరీ కళాశాల భవనం... ఇలా ఎన్నో అభివృద్ది పనులు వైఎస్సార్‌ హయాంలోనే చేపట్టారు.

గుండెల్లో నిలిచిన మహానేత..
అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల ఆదరాభిమానాలను పొందిన వైఎస్సార్‌ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఎంతో మంది వైఎస్సార్‌ చేసిన సేవలను గుర్తు చేసుకుంటారు. పెద్దాయన తమ కుటుంభానికి ఎంతో మేలు చేశారంటూ చెప్పుకుంటారు. ముఖ్యంగా విద్య, వైద్యం విషయంలో జిల్లాలో వేలాది కుటుంబాలు ప్రయోజనం పొందాయి. వైఎస్సార్‌ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆయనను స్మరించుకుంటున్నారు. జిల్లాలో చాలా చోట్ల వైఎస్సార్‌ విగ్రహాలను ఏర్పాటు చేసుకుని ఏటా జయంతి, వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ నియోజక వర్గాల్లో వైఎస్సార్‌ను అభిమానించే వారెందరో ఉన్నారు. వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఎందరో వైఎస్సార్‌ను అభిమానిస్తారు. ఆయన హయంలో జరిగిన అభివృద్దిని గురించి చర్చించుకుంటుంటారు. 

చివరి ఆయకట్టుకూ నీళ్లొచ్చాయ్‌..
బోధన్‌: దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చలువతో నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ చివరి ఆయకట్టుకు గోదావరి జలాలు అందించేందుకు ఎత్తిపోతల పథకాలు రూపుదిద్దుకున్నాయి. రైతులు ఫలితాలు అనుభవిస్తున్నారు. రూ కోట్లు కేటాయించి గోదావరి నదిపై బోధన్, ఆర్మూర్‌ నియోజక వర్గం పరిధిలో అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాలు చేపట్టి పూర్తి చేయించారు. మంజీర, తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న బోధన్‌ నియోజక వర్గం మంజీర, గోదావరి నది తీరంలో విస్తరించి ఉంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు చివరి ఆయకట్టు ప్రాంతం. కాగా నిజాంకాలంలో నిర్మించిన నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ద్య తగ్గిపోయి చివరి ఆయకట్టుకు నీరందక పంటలు ఎండి రైతులు ఆర్థికం నష్టపోయారు. సరిగ్గా పద్నాలుగేళ్ల క్రితం ఈ ప్రాంత రైతులు వర్షాధారం పై ఆధారపడి, కరెంట్‌ బోరుబావుల కింద పంటలు సాగుకుచేసి పంట చేతికొచ్చే వరకు భరోసా ఉండేది కాదు. కరువు పరిస్థితిని ఎదుర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్సార్‌ 2004లో అధికారంలోకి రాగానే వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యత కల్పించారు.

‘అలీసాగర్‌’తో 53వేల ఎకరాలకు..
జలయజ్ఞంలో బాగంగా నవీపేట మండలంలోని కోస్లీ శివారులో ఉన్న గోదావరి నది పై అలీసాగర్‌ ఎత్తిపోతల పథకం కోసం రూ 261 కోట్లు మంజూరు చేసి 2007 నవంబర్‌ 5న పథకం పూర్తి చేయించి ప్రారంభించారు. ఈ పథకం కింద నవీపేట మండలంలోని కోస్లీ, రెంజల్‌ మండలంలోని బాగేపల్లి, ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామ శివారుల్లో మూడు పంప్‌ హౌజ్‌లు, విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లు ఏర్పాటు అయ్యాయి. ఈ పథకం కింద నియోజక వర్గం పరిధిలోని రెంజల్, నవీపేట, ఎడపల్లి మండలాలతో పాటు నిజామాబాద్‌, డిచ్‌పల్లి, మాక్లూర్‌ మండలాల పరిధిలోని 53 వేల 792 ఎకరాలకు నిజాం సాగర్‌ చివరి ఆయకట్టు సాగు భూములకు నీరందుతోంది.

నందిపేటలోని ఉమ్మెడలో..
నందిపేట మండలంలోని ఉమ్మెడ గ్రామ శివారులో గుత్ప ఎత్తిపోతల పథకాన్ని రూ 204 కోట్ల ఖర్చు చేసి 2008 మార్చి 18న ప్రారంభించారు. ఈ పథకం కింద 38వేల 792 ఎకరాలకు సాగు నీరందుతోంది. గుత్ప ఎత్తిపోతల పథకం కింద నందిపేట, ఆర్మూర్, మాక్లూరు. బాల్కొండ, జక్రాన్‌పల్లి, వేల్పూర్‌  మండలాల పరిధిలోని నిజాంసాగర్‌ చివరి ఆయకట్టు నీరందుతోంది.

జిల్లా అభివృద్ధిలో చెరగని ముద్ర
నిజామాబాద్‌ అర్బన్‌: దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖ ర్‌రెడ్డి 10వ వర్ధంతి నేడు ఆయన సీఎంగా కొనసాగుతున్న స మయంలో జిల్లా ఎంతగానో అభివృద్ధి చెందింది. ఆయా రంగా ల్లో ఆయన చేసిన అభివృద్ధికి జిల్లా ప్రజలు నేటి వరకు గుర్తించు కుంటున్నారు. మహానీయుడు రాజశేఖర్‌రెడ్డి జిల్లా ప్రజల మేలుకోరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, నీటి ప్రాజెక్టులు తెచ్చారు. విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయంలో తనకంటూ ముద్రవేసుకున్నారు.

నగరంలో మెడికల్‌ కళాశాల..
జిల్లాకు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను మంజూరు చేసిన ఘనత వైఎస్‌ రాజశేఖరరెడ్డిదే. 2007లో నాటి మంత్రి డి.శ్రీనివాస్‌ షష్టిపుర్తి వేడుకలకు జిల్లా కేంద్రానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఖలీల్‌వాడి గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లాకు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతలోనే కళాశాలకు సంబంధించి స్థల సేకరణ, ప్రారంభ ఏర్పాట్లు చకచకా కొనసాగాయి. 100 సీట్లతో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను ఏర్పాటుకు సంబంధించి మొదటిసారిగా ఖిల్లా వద్ద శంకుస్థాపనలో ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయన చొరవ వల్లే నేడు ప్రభుత్వ మెడికల్‌ కళశాల కొనసాగుతుంది. 2004లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన మొదటి సారిగా రాజీవ్‌ పల్లెబాటలో భాగంగా అదే ఏడాది నవంబర్‌ 9న జిల్లాకు వచ్చారు. అప్పటి నుంచి 2009 జనవరి 30 వరకు 28 సార్లు జిల్లాలో పర్యటించారు. గతంలో ఏ ముఖ్య మంత్రి అన్నిసార్లు జిల్లాలో పర్యటించలేదు.

వ్యవ‘సాయం’..
వ్యవసాయానికి పెట్టింది పేరుగా ఉన్న ఇందూరు జిల్లాలో వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేశారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టును స్థిరికరించాలనే లక్ష్యంతో ప్రధాన కాలువల ఆధునికీకరణ పనులకు రూ.549.60 కోట్లు మంజూరు చేశారు. జిల్లాలో అర్గుల రాజారాం(గుత్ప) అలీసాగర్‌ ఎత్తిపోతల ప్రాజెక్టులు చేపట్టారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 92.585 ఎకరాల అదనపు ఆయకట్టుకు నీరందుతోంది. ఎస్సారెస్సీ వరదకాలువ, ఎస్సారెస్పీ రెండో దశ పనులకు జలయజ్ఞంలో శ్రీకారం చుట్టరు. చౌట్‌పల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకం 90 శాతం పనులు వైఎస్‌ మయంలోనే పూర్తయ్యాయి. మహారాష్ట్ర –ఆంధ్రా సరిహద్దుల్లో రూ.110కోట్లు వెచ్చించి లెండి అంతరాష్ట్ర ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు.

పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువ ఆధునికీకరణకు రూ.14 కోట్లు, ధర్పల్లి మండలంలో రామడుగు ప్రాజెక్టు  ఎత్తు పెంచేందుకు రూ.20 కోట్లు, డిచ్‌పల్లిలో బర్ధీపూర్‌ ఎత్తిపోతలకు రూ.14 కోట్లు మంజూరు చేశారు. ప్రాణహిత–చేవెళ్ల పథకానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్‌ జిల్లాలో రూ.3.484 కోట్లతో 20,21,22 ప్యాకేజీల పనులకు కామారెడ్డిలో శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణం పూర్తయితే జిల్లాలో 3.05 లక్షల ఎకరాల బీడు భూములను సాగులోకి వచ్చేది. బోధన్‌ మండల వాసుల 30 ఏళ్ల కలను నెరవేర్చేందుకు రూ.3.81 కోట్లతో సాలూర ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. సుమారు 1800 ఎకరాలకు ఈ పథకం ద్వారా సాగు నీరందుతోంది. డిచ్‌పల్లిలో ఏర్పాటు చేసిన 400 కె.వి. సబ్‌స్టేషన్‌తో మెరుగైన విద్యుత్‌ సరఫరా అవుతోంది.

విద్య, వైద్య ఎంతో అభివృద్ధి
జిల్లాలో విద్య, వైద్యరంగాల అభివద్ధికి వైఎస్సార్‌ భారీగా నిధులు కేటాయించారు. డిచ్‌పల్లి వద్ద తెలంగాణ యూనివర్శిటీ ఏర్పాటు చేశారు. వైద్య కళాశాలను ఏర్పాటు చేసి రూ.142 కోట్ల నిధులు కేటాయించారు. బాన్సువాడ నియోజక వర్గంలోని రుద్రూరులో అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల, కోటగిరిలో పాలిటెక్నిక్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద జిల్లాలో 9,927 మంది రోగులు వైద్య, శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఇందుకుగాను 2008లో ఒకే ఏడాదిలో రూ.9.04 కోట్లు ఖర్చు చేశారు. రుణమాఫీ పథకంతో రైతులకు లబ్ది చేకూర్పారు. జిల్లాలో 70 వేల మంది రైతులకు సంబంధించిన పంట రుణాల్లో రూ.400 కోట్లు మాఫీ అయ్యాయి.

మరిన్ని వార్తలు