'రాజ'ముద్ర

2 Sep, 2019 09:14 IST|Sakshi

నగరాభివృద్ధికి బాటలు వేసిన డాక్టర్‌ వైఎస్సార్‌

30 ఏళ్ల ముందుచూపుతో ప్రాజెక్టులు

ఆయన కలే మెట్రోరైలు, ఔటర్‌ రింగురోడ్డు, గోదావరి జలాలు

జీహెచ్‌ఎంసీ విస్తరణ, పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే సైతం...

నేడు మహానేత వర్ధంతి

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ అభివృద్ధిలో చెరగని సంతకం ఆయనది..ఐదున్నరేళ్ల తన పాలనలో హైదరాబాద్‌ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముందు చూపే నేడు నగరంలో పరుగులు పెడుతున్న మెట్రోరైలు, నగరాన్ని చుట్టేసిన ఔటర్‌రింగు రోడ్డు, నీటి కొరతను తీర్చిన గోదావరి జలాలు. హైదరాబాద్‌ మున్సిపాలిటీలో శివారు ప్రాంతాలను విలీనం చేసిన మహానగరాన్ని మరింతగా విస్తరించింది డాక్టర్‌ వైఎస్‌ హయాంలోనే. ఆయన వర్ధంతి సందర్భంగా సిటీలో వైఎస్‌ ముద్రపై ప్రత్యేక కథనం...

మెట్రో...వైఎస్‌ కలల ప్రాజెక్టే  
నగరంలో నేడు నిత్యం మూడు లక్షల మంది ప్రయాణికులకు చేరువైన హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్ట్‌కు వైఎస్‌ చేతుల మీదుగానే  అంకురార్పణ జరిగింది. వడివడిగా విస్తరిస్తున్న సమయంలో వచ్చే 2050 వరకు ట్రాఫిక్‌ అవసరాల్ని తీర్చే విధంగా 2008లో నాగోలు –శిల్పారామం, ఎల్బీనగర్‌ – మియాపూర్, జేబీఎస్‌–ఇమ్లీబన్‌ల మధ్య 72 కి.మీల మేర రూ.14,132 కోట్ల అంచనాతో ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్‌ ప్రైవైట్‌ భాగస్వామ్యంతో 20 లక్షల మంది ప్రయాణికుల కోసం  చేపట్టిన తొలి ప్రాజెక్ట్‌ ఇదే కావటం విశేషం. 

తరలివచ్చిన ‘గోదావరి’
వైఎస్‌ అధికారంలోకి వచ్చేనాటికి మంజీరా, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లతో పాటు కృష్ణా నుంచి వచ్చే 45 ఎంజీడీల నీళ్లే హైదరాబాద్‌కు దిక్కు. అన్ని జలాశయాల నుండి కేవలం 150 ఎంజీడీలే సరఫరా కావటంతో నగరంలో వారం రోజులకోసారి మంచినీటి సరఫరా చేసే వారు. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు కృష్ణా రెండు, మూడు దశలతో పాటు, గత మూడేళ్ల క్రితం నగరానికి తరలివచ్చి...నేడు సగం సిటీ దాహర్తిని తీరుస్తున్న గోదావరి జలాల ప్రాజెక్ట్‌లు వైఎస్‌ హయాంలోనే రూపొందించి పనులు ప్రారంభించారు.

ఔటర్‌తో మారిన రూపురేఖలు  
నగరం చుట్టూ 158 కి.మీల మేర ఔటర్‌ రింగురోడ్డు పనులను ప్రారంభించింది వైఎస్‌ హయాంలోనే. నగరంలో ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, గేమ్స్‌విలేజ్, ఎయిర్‌పోర్ట్, సింగ్‌పూర్‌ సిటీ, ఫార్మా ఇండస్ట్రీలను కలుపుతూ రు.9819 కోట్ల వ్యయంతో  ఎనిమిది లైన్ల అధునూతన రింగురోడ్డు పనులను హెచ్‌ఎండీఏ, జపాన్‌ ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌ ఆర్థిక సహాయంతో ప్రారంభించి గడిచిన రెండేళ్ల క్రితం నిర్మాణం మొత్తాన్ని పూర్తి చేశారు.

ఎయిర్‌పోర్ట్‌కు ఎక్స్‌ప్రెస్‌ వే...  
ఔటర్‌తో నగరం మీదుగా వెళ్లే జాతీయ రహదారుల విస్తరణ..ఆటంకాలు లేని ప్రయాణాల కోసం పంజగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్, నల్లగొండ క్రాస్‌రోడ్స్, చంద్రాయణగుట్ట ఫ్‌లై ఓవర్లు, రూ.622 కోట్ల వ్యయంతో  11.2 కి.మీల ఎయిర్‌పోర్ట్‌కు ఎక్స్‌ప్రెస్‌ వే పనులు డాక్టర్‌ వైఎస్సార్‌ హయాంలోనే రూపుదిద్దుకున్నాయి.

సూపర్‌ స్పీడ్‌ ఐటీ
నగరంలో ఐటీ పరిశ్రమల ఏర్పాటు, ఉత్పత్తి వైఎస్‌ హయాంలో సూపర్‌ స్పూడ్‌తో దూసుకుపోయింది. 2004 నుండి 2009 వరకు 1206 ఐటీ కంపెనీలు ఏర్పడి ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు రూ.32,509 కోట్లకు దూసుకువెళ్లాయి. 2.5 లక్షల మందికి ఉపాధి లభించింది.

వైఎస్‌ ఆదేశాలతోనే..  
హైదరాబాద్‌లో పెరిగిపోతున్న ట్రాఫిక్‌ నేపథ్యంలో 2007లో వైఎస్‌ ఆదేశాలతో మెట్రోరైలుకు రూపకల్పన జరిగింది. హైదరాబాద్‌ స్థితిని మార్చే సత్తా మెట్రోరైలుకు ఉంది. ఈ మహా ప్రాజెక్ట్‌లో నేను డాక్టర్‌ వైఎస్‌తో కలిసి పాలు పంచుకోవటం జీవితంలో మర్చిపోలేని గొప్ప అంశం.– ఎన్వీఎస్‌ రెడ్డి, మెట్రోరైల్‌ ఎండీ  

అభివృద్ధి పరుగులు పెట్టింది..
వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితోనే హైదరాబాద్‌లో అభివృద్ధి పరుగులు పెట్టింది. పాతబస్తీ అభివృద్ధికోసం రూ.2 వేల కోట్లను కేటాయించారు. రోడ్ల విస్తరణతో పాటు ఫ్‌లై ఓవర్లు, మెట్రో కోసం భూసేకరణ, ఎంఎంటీఎస్‌ రెండవ దశ పనులన్నీ వైఎస్‌ ముందుచూపుతోనే సాకారమయ్యాయి. ఆ యజ్ఞంలో పాలుపంచుకునే అవకాశం కలగటం నా అదృష్టంగానే భావిస్తున్నా.– ధనుంజయ్‌రెడ్డి, ఐఏఎస్‌ అధికారి

ఐటీ కంపెనీలు..క్యూ కట్టాయి  
చంద్రబాబునాయుడు ఐటీ పేరుతో బినామీలతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటే.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఐటీలో రియల్‌ అభివృద్ధి జరిగింది. అనేక కంపెనీలు హైదరాబాద్‌ను తమ ఐటీ బేస్‌గా ఎంచుకున్నాయి. ఐటీ కంపెనీలకు సింగిల్‌విండో అనుమతులు ఇచ్చాం. వైఎస్‌ ముందుచూపే నేటి ఐటీ విప్లవం. – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, (వైఎస్‌ కేబినెట్‌లో ఐటీ మంత్రి)

మరిన్ని వార్తలు