సాగరమంత సానుభూతి

23 Jan, 2015 04:41 IST|Sakshi
సాగరమంత సానుభూతి

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రెండోరోజు గురువారం షర్మిల నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని మూడు కుటుంబాలను పరామర్శించారు. షర్మిల రాకతో పరామర్శకు వెళ్లిన గ్రామాలతో పాటు నియోజకవర్గమంతా సందడి నెలకొంది. తమ అభిమాన నేత కుమార్తె షర్మిలను చూసేందుకు, ఆమెను పలకరించేందుకు, కరచాలనం చేసేందుకు ప్రజలు ఎగబడ్డారు. పొలం పనులు చేసుకుంటున్న వారు కూడా షర్మిల కాన్వాయ్‌ను చూసి రోడ్డు మీదకు వచ్చి స్వాగతం పలికారు. వరినాట్లు వేస్తున్న కూలీలు తినే అన్నాన్ని పక్కనపెట్టి షర్మిలను కలిసేందుకు పరుగులుపెట్టడం వైఎస్ కుటుంబంపై జిల్లా ప్రజానీకానికి ఉన్న ప్రేమను తెలియజేస్తోంది.
 
 రెండో రోజు యాత్ర సాగిందిలా....
 గురువారం ఉదయం 9:30 గంటలకు షర్మిల పరామర్శయాత్రకు బయలుదేరారు. తొలుత నేరుగా నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో ఉన్న కామిశెట్టి వెంకటనర్సయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆమె వెళ్లారు. అక్కడ స్థానికులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. వెంకటనర్సయ్య భార్య రంగమ్మతోపాటు ఇతర కుటుంబసభ్యులు ఆమెకు కష్టసుఖాలు తెలియజేశారు. ఆ తర్వాత షర్మిల అనుముల మండలంలోని గరికేనాటితండాకు వెళ్లారు. బాణావత్ బోడియా కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన షర్మిలకు గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అక్కడ బోడియా కుటుంబ సభ్యులతో అరగంటకుపైగా షర్మిల మాట్లాడారు.
 
 వారి కుటుంబసభ్యులు తమ పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా షర్మిల వారితో ఆ కుటుంబానికి సంబంధించిన సమస్యలే కాకుండా రైతులు, ఇతర గ్రామస్తుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడినుంచి కోటమైసమ్మ దేవాలయం సమీపంలో భోజనం పూర్తి చేసుకున్న త్రిపురారం వెళ్లారు. అక్కడ మైల రాములు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. రాములు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె తమ కుటుంబ స్థితిగతులను షర్మిలకు వివరించారు. అయితే, రాములు భార్య ధనమ్మ పరిస్థితిని చూసి స్పందించిన షర్మిల ఆమెకు అవసరమైన వైద్యసాయం చేస్తానని మాట ఇచ్చారు. వెంటనే మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. అక్కడినుంచి షర్మిల మిర్యాలగూడ వెళ్లారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని నాలుగు కుటుంబాలను ఆమె శుక్రవారం పరామర్శిస్తారు.
 
 రైతుల సమస్యలంటే ఎంత ఆసక్తో!
 దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డికి రైతులు, రైతుకూలీలంటే ఎంత ప్రేమో ఆయన తనయ షర్మిలకు కూడా ఆ వర్గాలంటే అంతే ప్రేమ ఉందని తెలియజెప్పారు. పరామర్శ యాత్రలో భాగంగా గరికేనాటితండాలో బాణోతు బోడియా నాయక్ కుటుంబాన్ని పరామర్శించినప్పుడు ఆయన పెద్దకుమారుడు బిచ్చానాయక్ మాట్లాడుతూ ఈ యేడు కాలం కాలేదని, వానలు లేక ఆలస్యంగా సాగు చేశామని చెప్పారు. పండిన పంటకు కూడా గిట్టుబాటు ధర లేదని వాపోయాడు. ‘మీ నాన్న పాలించినప్పుడు రైతులంతా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడేమో అంతా దివాళా తీశారు. ఇంకో ఏడాది ఇదే పరిస్థితి ఉంటే ఉన్నది అమ్ముకోవాల్సిందేనమ్మా.’ అని వివరించారు. అప్పుడు షర్మిల మాట్లాడుతూ పంటలు సరిగా వేయలేదు.. వేసిన పంటకు మద్దతు ధర లేదా అని ప్రశ్నించారు. రుణమాఫీ పూర్తిగా కట్టలేదన్న బిచ్చా సమాధానానికి ఆమె స్పందిస్తూ మరి కొత్త రుణం ఇచ్చారా అని ఆరా తీశారు. కొత్త రుణం ఇవ్వలేదని, ప్రభుత్వం అసలు మినహాయించకుండా వడ్డీ చెల్లించడంతో రుణం ఇవ్వలేదని చెప్పారు. అదేంటి ప్రభుత్వమే వడ్డీ చెల్లించినా మీకు రుణం ఇవ్వడం లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఊర్లో అందరికీ పింఛన్లు వస్తున్నాయా అని కూడా షర్మిల ప్రశ్నించారు.
 
 మా బాధ సగం తీరిందమ్మా!
 బోడియానాయక్ కూతురు కమల, చిన్నకోడలు పద్మ మాట్లాడుతూ ‘మాకు ఒకపక్క చాలా సంతోషంగా ఉంది. మరోపక్క సంతోషంగా  బాధగా ఉంది. మీ మా దగ్గరకు వస్తే మా బాధ సగం తీరిందమ్మా! మీరు మా ఇంటి మనిషే అనిపిస్తోంది. మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఇన్ని సంవత్సరాల తర్వాతయినా వచ్చినందుకు ఎంతో కతజ్ఞతలు. మా నాన్న మీ నాన్నను నమ్ముకున్నందుకు మాకు వచ్చిన అవకాశం ఇది. మీ నాన్న ఈ విధంగా కూడా మాకు సాయం చేశాడు.’ అని చెప్పడంతో షర్మిల ఆప్యాయంగా వారిని దగ్గరకు తీసుకున్నారు.  
 
 మా అమ్మను కాపాడండమ్మా!
 ఇక, త్రిపురారంలోని మైల రాములు కుటుంబాన్ని షర్మిల కలుసుకున్నప్పుడు ఆ ఇంటిల్లిపాది కన్నీటిపర్యంతమయ్యారు. నాన్న ఎలా చనిపోయారని అడిగి తెలుసుకున్న షర్మిల పిల్లలు ఏం చేస్తున్నారని ఆరా తీశారు. రాములు కుమార్తె సంధ్య తాను డిగ్రీ చదువుతున్నానని చెప్పగా, ఉన్నత చదువులు చదువుకోవాలని సూచించారు. ఇంటర్‌సెకండియర్ చదువుతున్న శ్రీకాం త్‌కు కూడా అదే సలహా ఇచ్చారు. పెద్ద కుమారుడు వెంకటేశ్ కుమారుడు సుతారి పని చేసి కుటుం బాన్ని నెట్టుకొస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకున్న షర్మిల కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాములు భార్య ధనమ్మకు ఆరోగ్యం బాగాలేదని పిల్లలు షర్మిల దష్టికి తీసుకెళ్లడంతో ఆమె చలించిపోయారు.
 
 వెంటనే ధనమ్మకు అవసరమైన వైద్యసాయం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని, తాను అండగా ఉంటానని చెప్పారు. షర్మిల వెంట పరామర్శ యాత్రలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గున్నం నాగిరెడ్డి, జిల్లా నాయకులు గూడూరు జైపాల్‌రెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్, నాగార్జునసాగర్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జి మల్లు రవీందర్‌రెడ్డి, మిర్యాలగూడ నియోజకవర్గ ఇంచార్జి ఎం.డి.సలీం, ముదిరెడ్డి గవాస్కర్‌రెడ్డి, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పచ్చిపాల వేణుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు