మీకెందుకు రాజకీయాలు?: జూపూడి ప్రభాకరరావు

19 Mar, 2014 01:25 IST|Sakshi
మీకెందుకు రాజకీయాలు?: జూపూడి ప్రభాకరరావు

పరాజయాల చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ సూటి ప్రశ్న
 సాక్షి, హైదరాబాద్: పదిహేనేళ్లుగా వరుస పరాజయాలతో టీడీపీని నడిపిస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇంకా రాజకీయాల్లో కొనసాగడమే దండగ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. చంద్రబాబు ఎన్నికల్లో ఒంటరిగా పోరాడలేనని ఎప్పటిలాగే ఇప్పు డూ మిగతా పార్టీలపై ఆధారపడ్డారని ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు ఎద్దేవా చేశారు. ఆయన మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో చంద్రబాబుకు సూటిగా పలు ప్రశ్నలు సంధించారు.
 1999 సార్వత్రిక ఎన్నికల్లో కార్గిల్ గాలిని ఉపయోగించుకుని ఒకే ఒక్కసారి మీ అధ్యక్షతన టీడీపీ గెల వడం తప్ప మీ రాజకీయ జీవితంలో ఏనాడైనా పార్టీ గెలిచిందా?
 
 * 1999 తరువాత 2014 వరకూ ఏకంగా 15 సంవత్సరాల పాటు టీడీపీకి విజయం అనేది సాధించకుండా ప్రతి ఎన్నికలో ఓడిపోతూ కూడా ఆ పార్టీ అధ్యక్ష పదవిలో ఎలా కొనసాగుతున్నారు?
 * 2001లో జరిగిన జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీని, మిమ్మల్ని గ్రామీణ ప్రజలు ఓడించింది నిజం కాదా? 1,094 జెడ్‌పీటీసీ స్థానాల్లో అధికారంలో ఉండి కూడా టీడీపీ గెలిచింది 512లో మాత్రమే.. ప్రతిపక్షాలకు 582 స్థానాలు దక్కాయి. 14,591 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ గెల్చుకున్నది 6,350 (సగానికన్నా చాలా తక్కువ) మాత్రమే. అప్పట్లో ప్రతిపక్షాలు గెల్చుకున్నవి 8,241 (సగం కన్నా చాలా ఎక్కువ) వాస్తవం కాదా? అప్పటి నుంచీ ఏ ఒక్క సార్వత్రిక ఎన్నికల్లోనూ మీరు విజయం సాధించలేదన్నది నిజం కాదా?
 * ఎన్‌టీఆర్ హయాంలో 1994 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి 44.1 శాతం ఓట్లు వచ్చాయి. ఎన్‌టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన వద్దనుంచి పార్టీని లాగేసుకున్న తరువాత కార్గిల్ యుద్ధానంతరం మీ పార్టీకి వచ్చిన 43.8 శాతం ఓట్లే కదా! 2004 ఎన్నికల్లో మీ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 37.59 శాతమే కదా! ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా కూడా ప్రజలకు మీ వల్ల మంచి జరుగలేదు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాలన ముందు మీ దుష్పరిపాలన పోల్చడానికే వీల్లేకుండా తయారైంది కాబట్టే 2009లో మీరు మహా కూటమి అంటూ ప్రజల్లోకి వెళ్లినా వచ్చింది కేవలం 28.12 శాతం ఓట్లే. ముఖాముఖి తలపడిన ఎన్నికల్లో మీకు దక్కిన ఓట్లు కేవలం 19 శాతమే కదా! ఇంకా ఎందుకు మీరు రాజకీయాల్లో కొనసాగుతున్నారు?
 * వైఎస్ మరణం తరువాత రాష్ట్రంలో 42 ఉప ఎన్నికలు జరిగితే (2 ఏకగ్రీవాలు కాకుండా) అందులో ఒక్కటంటే ఒక్క సీటు మీరు గెల్చుకోలేదు కదా? 21 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి డిపాజిట్ గల్లంతయింది కదా? ఇంత అద్భుతమైన పరాజయ పటిమను సంపాదించుకున్న మీరు ఇన్ని ఓటముల తరువాత పార్టీ నాయకుడిగా ఎలా ఉండగలిగారు?
 * 2011లో వైఎస్సార్ సీపీ ఏర్పడినప్పటి నుంచీ 20 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో మీ పార్టీ, మా పార్టీ ముఖాముఖి తలపడితే అందులో 17 స్థానాలు మేం గెల్చుకున్నాం. మీరు ఒక్కటంటే ఒక్కటీ గెలవక పోగా 2 లోక్‌సభ స్థానాల్లోనూ మీ పార్టీ డిపాజిట్లు పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకుంది.
* రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని లేఖ ఇచ్చి కోట్లాది మందికి కావాలని అన్యాయం చేసిన బాబు గారూ.. మీరు ఎవరికి నాయకుడు? ప్రతిపక్ష నాయకుడా? ప్రతినాయకుడా? రెండు చిప్పలు, రెండు వేళ్లు, రెండు కళ్ల సిద్ధాంతం ద్వారా రాష్ట్రాన్ని ముక్కలు చేసిన మీరు మీ పార్టీ పేరును ఏమని మార్చుకుంటా రు? వన్ బై టు టీడీపీ అని మార్చుకుంటారా?
* పార్టీ గుర్తులపై ఎన్నికలు జరుగని సహకార, పంచాయతీ ఎన్నికల్లో గెలిచానని అబద్ధాలు చెప్పి టీడీపీ కార్యాలయంలో మీ కార్యకర్తలు, నేతలను ఎందుకు మోసం చేస్తున్నారు?
 * రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ కాళ్లు నరకాలని, వందేళ్లు ఆ పార్టీని ఓడించాలని మా పార్టీ నాయకుడు పిలుపు నిచ్చారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యతిరేకతతో మీరు కాంగ్రెస్‌తో కలిసిన తరువాత, మీరు కూడా వారితో పాటే మునిగిపోవడం నిజం కాదా? ఇన్ని ఓటములు పొందిన మీరు టీడీపీకి అదృష్టం కావచ్చేమో గాని, తెలుగుజాతికి దురదృష్టం కాదా? మీరు ఏ వ్యవస్థలనైనా ప్రభావితం చేయగలరు కానీ, ప్రజలను ప్రలోభ పెట్టలేరు.
 (వైఎస్ మరణం తరువాత జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు, టీడీపీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయిన వివరాలను వైఎస్సార్‌సీపీ ఈ సందర్భంగా విడుదల చేసింది.)

మరిన్ని వార్తలు