కేసీఆర్‌ను మేల్కొలిపేందుకే రైతు దీక్ష

9 May, 2015 05:18 IST|Sakshi
శుక్రవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కె.శివక

- వైఎస్సార్‌సీపీ నేత శివకుమార్ వెల్లడి
- మైనార్టీ సోదరులందరూ తరలిరావాలని విజ్ఞప్తి
- పోస్టర్ విడుదల

హైదరాబాద్:
రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొని రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు... ఈ విపత్కర పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ను మేల్కొలిపేందుకు రైతన్నకు అండగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతుదీక్ష చేపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ తెలిపారు. శుక్రవారం వైఎస్సార్ సీపీ నగర మైనార్టీ కమిటీ అధ్యక్షుడు షేక్ అర్షద్ ఆధ్వర్యంలో లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రచార పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు భరోసా కల్పించడం ద్వారా ఆత్మహత్యలకు పాల్పడకుండా నిరోధించే ఉద్దేశంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శ్రీనివాస రెడ్డి దీక్ష చేపడుతున్నారన్నారు. అక్కడ ఏపీ రాష్ట్రంలోనూ ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాల్లో ధైర్యం నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ నెల 11 నుంచి తిరిగి అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేపడుతున్నారని తెలిపారు. హైదరాబాద్ నగర మైనార్టీ కమిటీ అధ్యక్షుడు షేక్ అర్షద్ మాట్లాడుతూ తెలంగాణ జిల్లాల్లోని మైనార్టీ సోదరులందరూ ఎంపీ శ్రీనివాస రెడ్డి చేపట్టే దీక్షలో పాల్గొనాలని కోరారు.

గారడీ మాటలొద్దు: వైఎస్సార్ సీపీ నగర యువజన విభాగం
రైతులు కరువు పరిస్థితులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, వడగండ్ల వర్షాలు మరింత నష్టం తెచ్చిపెట్టాయని ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధప్రాతిపదికన ఆదుకోవాల్సిన సీఎం కేసీఆర్ గాల్లో తిరుగుతూ గారడీ మాటలు చెబుతున్నారని వైఎస్సార్ సీపీ నగర విభాగం అధ్యక్షుడు ఎ. అవినాష్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు.

శుక్రవారం ఆదర్శ నగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నగర యువజన విభాగం ఆధ్వర్యంలో రైతు దీక్ష ప్రచార పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. వేరువేరు చోట్ల జరిగిన ఈ పోస్టర్ల విడుదల కార్యక్రమంలో నగర మైనార్టీ విభాగం కార్యదర్శి ఎం.రిజ్వాన్ హుస్సేన్, కమిటీ సభ్యులు ఎం అల్తాఫ్ ఉద్దీన్, ఎం.ఇస్మాయిల్, ఫైషల్ షా, అబుల్ ఖైర్ సిద్దికీ, నగర యువజన విభాగం నాయకులు కపిల్, ఫైజల్, మాజీద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు