శివాలయం, ప్రధానాలయం ఒకేసారి ప్రారంభం 

26 Dec, 2018 03:17 IST|Sakshi

వైటీడీఏ అధికారుల సన్నాహాలు  

యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మితమవుతున్న శివాలయం, స్వామి వారి గర్భాలయం రెండు ఒకేసారి ప్రారంభించడానికి వైటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే గర్భాలయ ప్రతిష్ట చేసే తేదీలను చినజీయర్‌ స్వామి ప్రకటించడంతో అధికారులు పనుల్లో వేగం పెంచారు. ప్రధానాలయంలోని గర్భాలయంలో స్వయంభూ మూర్తుల వద్ద ఫ్లోరింగ్‌ చేసి బండలు వేస్తున్నారు. ప్రధాన ముఖ మండపంలో పనులన్నీ పూర్తయ్యాయి. బయట ఉన్న అష్టబుజి మండపం, ఆలయ ప్రాకారం పనులు, రెండో ప్రాకారం పనులు జరుగుతున్నాయి. వీటిని మరికొన్ని రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.  

శివాలయం పనులు: శివాలయంలో ప్రస్తుతం రాజగోపురాలు, ప్రధాన ద్వారం, చుట్టూ ప్రాకారం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే రెండు ఆలయాల ప్రతిష్ట కార్యక్రమాలను ఒకేసారి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే జనవరిలోనే ప్రధానాలయం పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.  

ఆలయ పనుల పరిశీలన: తిరుమాడ వీధులు, రాజగోపురాలు, నూతన ప్రధానాలయం పనులను వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఈఓ గీతారెడ్డిలు మంగళవారం పరిశీలించారు. 

మరిన్ని వార్తలు