సున్నా విద్యార్థులున్న స్కూల్స్‌126

15 Jun, 2019 10:43 IST|Sakshi

నల్లగొండ : ఒకనాడు చదువులకు నిలయాలుగా ఉన్న సర్కారు పాఠశాలలు నేడు ఆదరణ కోల్పోయి మూత పడే పరిస్థితికి వచ్చాయి.  నిత్యం విద్యార్థులతో కళకళలాడిన పాఠశాలలు ఇప్పుడు విద్యార్థులు కరువై కళావిహీనంగా మారుతున్నాయి.  ఓ పక్క ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ప్రవేశపెట్టడం, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ బోధనల ప్రభావం తెలుగుమీడియం సర్కారు బడులపై పడుతోంది. జిల్లాల్లో చాలా పాఠశాలలు ఇప్పటికే మూత పడిపోగా ఈ సంవత్సరం కూడా మరికొన్నింటికి తాళం వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

జిల్లా వ్యాప్తంగా మొత్తం 1 నుంచి 10వ తరగతి వరకు 1,483 ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాల్లో  బోధన సాగుతుండడంతో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు ముందుకు రావడంలేదు. కొన్ని సంవత్సరాలుగా ఇంగ్లిష్‌ మీడియం ప్రైవేట్‌ పాఠశాలలు  జిల్లా, డివిజన్‌. మండల కేంద్రాల్లో విచ్చలవిడిగా వెలిశాయి. ఆయా గ్రామాలకు స్కూళ్లకు సంబంధించిన బస్సులను కూడా పంపిస్తున్నారు. దీంతో వ్యవసాయదారులతో పాటు గ్రామాల్లో, పట్టణాల్లో కూలి చేసుకునే వారు కూడా ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో చేర్పిస్తూ వస్తున్నారు. దీంతో కొంత కాలంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల కంటే ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అక్కడ ఉన్న ఉపాధ్యాయులను డిప్యుటేషన్లపై పక్క పాఠశాలలకు పంపిన సంఘటనలు ఉన్నాయి.
 
గురుకులాల వైపు మొగ్గు
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు కేజీ టు పీజీ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలను ప్రవేశపెడతానని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, గురుకుల పాఠశాలలు పెద్ద ఎత్తున నెలకొల్పారు. ఆయా వర్గాల వారితోపాటు ఓసీల్లోని పేదలు కూడా గురుకులాల్లోనే చేరుతున్నారు. ఒక్కో విద్యార్థిపై తెలంగాణ ప్రభుత్వం రూ.1.20లక్షల పై చిలుకే ఖర్చు చేస్తుంది. మంచి పోషకాహారంతోపాటు నాణ్యమైన విద్యను కూడా ఆంగ్లంలోనే అందిస్తుంది. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులంతా గురుకుల పాఠశాలల్లో చేరారు. దీంతో గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతుండగా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అంతంత మాత్రంగా కొనసాగే ప్రైవేట్‌ పాఠశాలలు కూడా మూతపడిపోతున్నాయి.

తిరిగి కొనసాగిస్తామంటున్న అధికారులు
జిల్లాలో 1483 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే అం దులో 126 ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేడు. ఈ పాఠశాలలన్నీ మూతపడుతుండగా 10 మందిలోపు ఉన్న పాఠశాలలు 97 ఉన్నా యి. 20 మంది పిల్లల లోపు ఉన్నటువంటి యూ పీఎస్‌ పాఠశాలలు 88 ఉన్నాయి. ఈ పాఠశాలల ను ఆయా గ్రామ సమీప పాఠశాలల్లో విలీనం చే సేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా ఈ విషయాన్ని విద్యాశాఖ కమిషనర్‌ వివరించారు. పిల్లలు లే ని పాఠశాలలను పూర్తిగా మూసివేయడం జరగద ని, తిరిగి పిల్లలు చేరితే యధావిధిగా కొనసాగిస్తామని తెలిపారు.

పక్క గ్రామాల పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు రవాణా చార్జీలు 
తక్కువ విద్యార్థులున్న పాఠశాలలనుంచి పక్క గ్రామాల పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ప్రభుత్వం రవాణా చార్జీలు చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. ఒక్కో విద్యార్థికి ప్రతి నెలా రూ. 600 చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.  

పాఠశాలల్లో పిల్లలు చేరితే యధావిధిగా కొనసాగిస్తాం
ప్రస్తుతం జిల్లాలో 126 పాఠశాలల్లో విద్యార్థులు లేరు. ఆ పాఠశాలల్లో తిరిగి విద్యార్థులు చేరితే యధావిధిగా కొనసాగిస్తాం. ఎప్పుడు విద్యార్థులు వచ్చినా పాఠశాలలు కొనసాగించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నాయి. పక్క గ్రామాల పాఠశాలలకు పంపిస్తే వారికి ప్రభుత్వమే ప్రతినెలా రూ.600 రవాణా ఖర్చులను చెల్లిస్తుంది.  – డీఈఓ సరోజినీదేవి

మరిన్ని వార్తలు