జిల్లాను అగ్రస్థానంలో నిలుపుదాం

2 Oct, 2019 10:04 IST|Sakshi
మాట్లాడుతున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి

ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలి

జెడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి

వైస్‌ చైర్మన్‌గా కోనేరు కృష్ణ ప్రమాణ స్వీకారం

సాక్షి, ఆసిఫాబాద్‌: ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేసి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుపుదామని జెడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాలకవర్గ  సమావేశంలో చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ వెనకబడిన ఆదవాసీ జిల్లాకు ప్రత్యేక నిధులు తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. వచ్చే ఐదేళ్లలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా జిల్లాకు వచ్చిన నిధులు అన్ని మండలాలకు సమానంగా పంచుతామని తెలిపారు. ఆదివాసీల సమస్యలు జెడ్పీ స్టాండింగ్‌ కమిటీలో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందేలా కొత్తగా గెలుపొందిన ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని సూచించారు. త్వరలోనే సీఎం అపాయింట్‌మెంట్‌ తీసుకుని జిల్లా సమస్యలు వివరిస్తామని తెలిపారు.

వైస్‌చైర్మన్‌గా కృష్ణ ప్రమాణ స్వీకారం..
కాగజ్‌నగర్‌ జెడ్పీటీసీ కోనేరు కృష్ణ జిల్లా పరిషత్‌ వైస్‌చైర్మన్‌గా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కలెక్టర్, జెడ్పీ చైర్‌పర్సన్‌తో పాటు జెడ్పీ సీఈవో వైస్‌చైర్మన్‌ కృష్ణకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం ఆసిఫాబాద్, సిర్పూర్‌ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్పతో పాటు జిల్లాలోని అన్ని మండలాల జెడ్పీటీసీలు కృష్ణను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా సిర్పూర్‌ నియోజకవర్గం నుంచి కృష్ణ అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జెడ్పీ కార్యాలయం ఎదుట బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సమావేశంలో ఆసిఫాబాద్‌ జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, సీఈవో వేణు, డిప్యూటీ సీఈవో సాయిగౌడ్, జెడ్పీటీసీలు తాళ్లపెల్లి రామారావు, అజ య్‌కుమార్, సంతోశ్, కోవ అరుణ, దృపదా బాయి, అన్ని మండలాల సభ్యులు, కో అప్షన్‌ సభ్యులు సిద్దిక్, అబుద్‌ అలీ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు