రసాభాస

13 Sep, 2014 02:00 IST|Sakshi
రసాభాస

 కరీంనగర్ : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. శుక్రవారం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యూరు. కలెక్టర్ వీరబ్రహ్మయ్య, ఎమ్మెల్యేలు టి.జీవన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, పుట్ట మధు, బొడిగె శోభ, దాసరి మనోహర్‌రెడ్డి, ఒడితెల సతీష్‌బాబు, సోమారపు సత్యనారాయణ, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు సంతోష్‌కుమార్, పాతూరి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సభ ప్రారంభం కాగానే బోయినపల్లి, ఇబ్రహీంపట్నం, రామడుగు, సైదాపూర్, మహాముత్తారం, ఎల్లారెడ్డిపేట, ఓదెల జెడ్పీటీసీ సభ్యులు లచ్చిరెడ్డి, సునీత, వీర్ల కవిత, సంజీవరెడ్డి, సదయ్య, ఆగయ్య, గంట అక్షితలు మాట్లాడుతూ జిల్లాలో విద్యా, వైద్య రంగం అస్తవ్యస్తంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో వసతులు లేవని, మోడల్ స్కూళ్లకు రహదారులు, తాగునీటి వసతులు, చాలా పాఠశాలల్లో వంట గదులు లేవని ఆందోళన  వ్యక్తంచేశారు.అనుమతిస్తే నాలుగు రోజుల్లో వంటగదులు నిర్మించి చూపిస్తామని ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీ సభ్యుడు తోట ఆగయ్య తెలిపారు. వచ్చే సర్వసభ్య సమావేశాలకల్లా మౌలిక వసతులు కల్పించేలా అధికారులను ఆదేశించాలని మంత్రిని కోరారు.
 
వైద్య రంగం అస్తవ్యస్తం
జిల్లా వ్యాప్తంగా డాక్టర్లు, నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ల్యాబ్‌లు లేవని, భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని.. తక్షణమే ప్రక్షాళన చేయాలని జెడ్పీటీసీలు పూర్ణిమ, శరత్‌రావు, పొన్నాల లక్ష్మయ్య, సిద్దం వేణు, చల్లా నారాయణరెడ్డి, గోపగాని సారయ్యగౌడ్, శ్రీకాంత్, కోఆప్షన్ సభ్యుడు జమీలొద్దీన్ డిమాండ్ చేశారు. కోహెడ్ డాక్టర్ అందుబాటులో ఉండడం లేదని జెడ్పీటీసీ లక్ష్మణ్ తెలిపారు. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ప్లేట్‌లేట్స్ మిషన్ పనిచేసేలా చూ డాలని జమిలొద్దీన్ కోరారు. మహాముత్తారంలో వై ద్యులు ఉండడం లేదని ఎంపీపీ అ న్నారు.
 
వ్యవసాయంపై అట్టుడికిన సభ
వ్యవసాయశాఖ పనితీరు అధ్వానంగా ఉందని పంట నష్టపరిహారం చెల్లింపులో ఆదర్శ రైతుల అవినీతికి అంతులేకుండా పోయిందంటూ సభ్యులు ధ్వజమెత్తారు. పరిహారం జాబితా అడిగితే వ్యవసాయ అధికారులు ఇవ్వడం లేదని, జెడ్పీటీసీలంటే అంత చులకనా? అంటూ బెజ్జంకి, శంకరపట్నం, ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీలు తన్నీరు శరత్‌రావు, సంజీవరెడ్డి, తోట ఆగయ్య తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదర్శరైతులకు అనుకూలమైన వారిపేర్లే జాబితాలో చేర్చి డబ్బులు దండుకున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. బెజ్జంకి ఏవో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మంత్రితో వాపోయారు.
 
అభివృద్ధికి బాటలు వేయండి: మంత్రి ‘ఈటెల’
జిల్లా సమగ్రాభివృద్ధికి పార్టీలకతీతంగా సభ్యులు కలిసి రావాలని రాష్ట్ర ఆర్థిక పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కోరారు. జెడ్పీ సమావేశంలో ఆయన శుక్రవారం మాట్లాడారు. బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ముందుకుసాగుదామన్నారు. ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలే అయిందని, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన చేస్తామని తెలిపారు. రుణమాఫీ విషయంలో వెనుకంజ వేయబోమన్నారు. పంట పరిహారం జాబితాలను జెడ్పీటీసీ, ఎంపీపీలకు అందించాలని వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు.
 
అధికార పార్టీకి చుక్కెదురు
జెడ్పీలో మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతిపాదించిన పనులు తిరస్కరణకు గురయ్యాయి. మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే బొడిగె శోభ, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి కమలాపూర్, గంగాధర, కథలాపూర్, చొప్పదండి, కొడిమ్యాల మండలాల్లో బోర్‌వెల్స్, కమ్యూనిటీ హాళ్లు, రోడ్లు తదితర పనుల నిమిత్తం రూ.36 లక్షల 50 వేలతో ప్రతిపాదనలు పంపించారు. శుక్రవారం ఉదయం జరిగిన వర్క్స్, ఆర్థికస్థాయీ సంఘాల్లో పలువురు సభ్యులు మాట్లాడుతూ జిల్లాలో 13 నియోజకవర్గాలుంటే మూడు నియోజకవర్గాలకు మాత్రమే 24 ప్రతిపాదనలతో నిధులు కేటాయించడమేంటని ప్రశ్నించారు. అన్ని నియోజకవర్గాలకు సమానంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపాదనలను ఏకగ్రీవంగా తిరస్కరించారు. దీంతో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చుక్కెదురైనట్లయింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా