జెడ్పీ, ఎంపీపీ ఎన్నికల కసరత్తు షురూ! 

21 Feb, 2019 03:49 IST|Sakshi

రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా ఎన్నికలు.. 

మే చివరకు పూర్తి చేయాలని ఎస్‌ఈసీ యోచన 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా రాష్ట్రంలో జిల్లా, మండల ప్రజా పరిషత్‌ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. 2014లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉమ్మడి ఏపీలో జరిగాయి. గతంలో జిల్లా ప్రజాపరిషత్‌ల సంఖ్య 9 ఉండగా, ఇప్పుడు కొత్తగా జిల్లాలు (తాజాగా ప్రకటించిన రెండు జిల్లాలు కలిపి), మండలాల పునర్విభజనతో జిల్లాల సంఖ్య 32కు (ఆగస్టుతో కాలపరిమితి ముగియనున్న ఖమ్మం జెడ్పీ దాని పరిధిలోని భద్రాద్రి జిల్లా కలిపి) పెరగబోతోంది. వచ్చే జూలై 3, 4 తేదీలతో పాత జిల్లా పరిషత్‌ల కాలపరిమితి ముగియనుండటంతో కొత్తజిల్లా పరిషత్‌లకు ఎన్నిక లు జరగాల్సి ఉంది. మే చివరి కల్లా మండల, జిల్లా పరిషత్‌ల ఎన్నికల నిర్వహణ పూర్తయ్యేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ భావిస్తోంది. కొత్త జిల్లాలకు అనుగుణంగా జెడ్పీటీసీలు, వాటి పరిధిలోని మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ పూర్తి చేయాల్సి ఉంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల గుర్తింపు ఆ తర్వాత రిజర్వేషన్ల ఖరారు చేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 

రిజర్వేషన్ల ఖరారు: వచ్చే నెలాఖరులోగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్ల ఖరారు పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇదివరకే ఎస్‌ఈసీ సూచించింది.  మే ఆఖరులోగా ఈ ఎన్నికలు పూర్తయితే జూలై 5న 30 జెడ్పీలు, ఆగస్టు 7న ఖమ్మం, భద్రాద్రి జెడ్పీ (ఉమ్మడి జెడ్పీ గడువు ముగిశాక) పాలకవర్గాలు బాధ్యతలు చేపడతాయి. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, కొత్త గ్రామపంచాయతీల ప్రాతిపదికన జిల్లా, మండల ప్రజాపరిషత్‌ స్థానాలు ఖరారుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు తీసుకుంటోంది. కొత్త జిల్లాల ప్రాతిపదికన 32 జెడ్పీలు, కొత్త మండలాల ప్రాతిపదికన మండల ప్రజాపరిషత్‌లు ఏర్పడతాయి. గతంలో 438 మండలాల నుంచి పునర్విభజన తర్వాత మరో 96 గ్రామీణ మండలాల ఏర్పాటుతో ఈ సంఖ్య 534కు పెరగగా తాజాగా మరో 4 మండలాలను పెంచడంతో 538కు చేరనుంది. దీంతో జెడ్పీటీసీల సంఖ్య కూడా 538కు పెరగనుంది. 

చిన్న జిల్లాల పరిస్థితేంటీ?: కొత్తగా ఏర్పడిన కొన్ని జిల్లాల్లో గ్రామీణ మండలాలు మరీ తక్కువ సంఖ్యలో ఉండటంతో ఆ జిల్లాల్లో జిల్లా పరిషత్‌ల ఏర్పాటు సాధ్యమేనా అన్న సందేహాలున్నాయి. ఈ జిల్లాల్లోని ఆయా మండలాలను పొరుగునే ఉన్న జిల్లాల్లో విలీనం చేస్తారా అన్న దానిపైనా ఇంకా స్పష్టత రాలేదు.

మరిన్ని వార్తలు