-

వీడలేమంటూ..వీడ్కోలంటూ..

16 Jun, 2019 09:59 IST|Sakshi
తోటి సభ్యులతో సెల్ఫీ దిగుతున్న జెడ్పీటీసీ సభ్యురాలు

ఎక్కడో పుట్టి..ఎక్కడో ఎన్నికై.. ఇక్కడే కలిశాం..వీడలేమంటూ వీడ్కో లంటూ.. ఈ ఐదేళ్లు కలిసి నడిచిన సభ్యులు శనివారం చివరి జెడ్పీ సర్వసభ్య సమావేశంతో విడిపోయారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో జెడ్పీ విభజ న జరగడం..ఇటీవల కొత్త పాలకవర్గాలు ఎన్నిక కావడంతో అరవై ఏళ్ల అనుబంధానికి ఫుల్‌స్టాప్‌ పడింది. చివరిరోజు ఆత్మీయ పలకరింపులు..సన్మానాలు, సత్కారాలు, ఆద్యంతం ఉద్విగ్న భరిత వాతావరణంలో సభ్యులంతా పాత జెడ్పీకి బైబై చెప్పారు.  

సాక్షి, ఆదిలాబాద్‌: యాభై రెండు మంది జెడ్పీటీసీలు.. పది మంది శాసన సభ్యులు.. అందులోంచే మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్సీలు.. జిల్లా ఉన్నతాధికారులు.. వీరంతా ఒకేసారి కలిసేది ఉమ్మడి జెడ్పీ సమావేశం. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత నాలుగు జిల్లాల కలెక్టర్లు అదనపు ఆకర్షణగా నిలిచింది. చరిత్ర కలిగిన ఉమ్మడి జెడ్పీ ఠీవి ఇక ముగిసిన ప్రస్థానం. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత కొత్త జెడ్పీ పాలకవర్గాలు త్వరలో కొలువుదీరనుండగా, ఉమ్మడి జిల్లాలోని పాలకవర్గం పదవీకాలం వచ్చే నెల పూర్తి కావస్తుంది. అంతకుముందు చివరిసారిగా సభ్యులు సమావేశమయ్యారు. ఉమ్మడి జిల్లా పరిషత్‌ పాలకవర్గ సర్వసభ్య సమావేశం శనివారం జెడ్పీ చైర్‌పర్సన్‌ వి.శోభాసత్యనారాయణ గౌడ్‌ అధ్యక్షతన జరిగింది. ఉమ్మడి జిల్లా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఆసిఫాబాద్‌ కలెక్టర్, ఇన్‌చార్జి ఆదిలాబాద్‌ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఆదిలాబాద్‌ జేసీ సంధ్యారాణి, మంచిర్యాల జేసీ సురేందర్‌రావు, నిర్మల్‌ ఇన్‌చార్జి కలెక్టర్‌ భాస్కర్‌రావు పాల్గొన్నారు.

మధుర క్షణాలు..
ఉదయం 11 గంటలకు జెడ్పీ సమావేశం ప్రారంభమైంది. వేదికను జెడ్పీ చైర్‌పర్సన్‌ శోభారాణి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్, జేసీలు, జెడ్పీ సీఈఓ కె.నరేందర్‌ అలంకరించారు. ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, రాథోడ్‌ బాపురావు వేదిక ఎదురుగా ఆసీనులయ్యారు. జెడ్పీ వైస్‌చైర్మన్‌ మూల రాజీరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ దామోదర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి అదే వరుసలో కూర్చున్నారు. సమావేశం మధ్యలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఐకే రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా జెడ్పీ పాలకవర్గానికి ఇదే చివరి సభ అని, జూలై 4 వరకు పదవీ కాలం ఉన్నా అధికారికంగా సభ ఇదే చివరిదని పేర్కొన్నారు. ఈ సభలో సభ్యులు హుందాగా సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు.

ప్రధాన అంశాలపైనే  చర్చ..
ఉమ్మడి జెడ్పీ చివరి సమావేశంలో ఎజెండా అంశాలు అనేకంగా ఉన్నా ప్రధాన అంశాలపైనే చర్చ సాగింది.  సమావేశంలోనే సభ్యులకు వీడ్కోలులో భాగంగా సన్మానం చేయాలని ముందుగానే నిర్ణయించడంతో ప్రధాన అంశాల మట్టుకు చర్చించారు. మిషన్‌ భగీరథ, హరితహారం, వ్యవసాయంపై మాట్లాడారు. సభలో జెడ్పీటీసీలు అశోక్, జగ్జీవన్, సుజాత, రాథోడ్‌ విమల, కేశవ్‌గిత్తే వివిధ అంశాలపై ప్రస్తావించారు. ప్రధానంగా వర్షాలు పడిన తర్వాత హరితహారం కార్యక్రమంలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలని మంత్రి ఐకేరెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం సమావేశాన్ని ముగిస్తూ సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

గుండె దిటువు..
సన్మాన కార్యక్రమం ప్రారంభమైన తర్వాత సభ్యుల్లో తాము ఇక ఒకేచోట కలవలేమన్న ఆవేదన కనిపించింది. ఈ ఐదేళ్లు కలిసి నడిచిన ప్రస్తానం వారి కళ్లముందు కదలాడింది. మొదట సభ్యులు సభ ప్రాంగణంలోకి వస్తున్న సమ యంలోనూ అందరిలో ఈ పాలకవర్గానికి ఇదే చివరి సభ కావడంతో వస్తువస్తూనే ఒకరికొకరు పలకరించుకోవడం కనిపించింది. మహిళ సభ్యులు గుమిగూడి మాట్లాడుకోవడం అగు పించింది. పురుష సభ్యులు కరచలనం చేసుకుంటూ కనిపించారు. మొత్తం మీదా సమావేశం ప్రారంభం నుంచి చివరి వరకు వీడ్కోలు ఘట్టం వారి హావభావాలతో కొనసాగింది. మొదట ఉమ్మడి జిల్లా మంత్రి ఐకేరెడ్డిని జెడ్పీ చైర్‌పర్సన్‌ శోభారాణి, వైస్‌చైర్మన్‌ మూల రాజీరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కలిసి జ్ఞాపికను అందజేసి శాలువాతో సన్మానించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ శోభారాణిని మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్, జేసీలు శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కలెక్టర్, డీసీసీబీ చైర్మన్, డీసీఎంఎస్‌ చైర్మన్, గ్రంథాలయ చైర్మన్, తదితరులను సన్మానించి మెమోంటోలను అందజేశారు. 

సభ్యులకు సన్మానం..
జెడ్పీటీసీలకు ఆ తర్వాత సన్మానం నిర్వహించారు. మొదట మహిళా జెడ్పీటీసీలను అనంతరం మిగతా జెడ్పీటీసీలకు శాలువా కప్పి పూలమాల వేసి జ్ఞాపికను ఇచ్చి సన్మానించారు. జైనూర్‌ జెడ్పీటీసీ మస్రత్‌ ఖానమ్‌ను సన్మానించినప్పుడు ఆమె ప్రసంగించారు. ఐదేళ్లు సభలో ఎంతో నేర్చుకున్నామని, ఏదైన తప్పు చేసి ఉంటే క్షమించాలని కోరారు. మంత్రి, జెడ్పీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యేల సహకారం మరవలేనిదన్నారు. ఆమె మాట్లాడుతున్నప్పుడు సభ్యులందరిలో ఒక రకమైన ఆవేదన కనిపించింది. అనంతరం సభ్యులు గ్రూప్‌ ఫొటోలు దిగారు. ఈ ఐదేళ్ల జ్ఞాపకాలను చివరి రోజు మధుర ఘట్టంగా మలుచుకున్నారు. అదే సందర్భంలో మంత్రి ఐకేరెడ్డి మాట్లాడుతూ జెడ్పీటీసీలుగా పదవి కాలం ముగిసినప్పటికీ భవిష్యత్‌లో ఇతర పదవుల ద్వారా ప్రజాసేవలో ఉండాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు