నేడు జెడ్పీ చైర్మన్‌ ఎన్నిక 

8 Jun, 2019 10:54 IST|Sakshi
జిల్లా పరిషత్‌ హాలులో చైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో ఏర్పాటు చేసిన బారికేడ్లు, జాలీలు, విఠల్‌ రావు

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎన్నిక నేడు జరగనుంది. జెడ్పీలోని సమావేశ హాలులో చైర్మన్‌తో పాటు, వైస్‌ చైర్మన్, కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోనున్నారు. చైర్మన్‌ పదవి మాక్లూర్‌ జెడ్పీటీసీ దాదాన్నగారి విఠల్‌రావుకు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఒక వేళ ఊహించని పరిణాలు జరిగితే తప్ప మార్పులేమీ ఉండకపోవచ్చనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాగా చైర్మన్‌ పదవి రేసులో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ , ఇందల్వాయి జెడ్పీటీసీ సుమనా రవిరెడ్డితో పాటు, ధర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌ల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. విఠల్‌రావుకు ఈ పదవి దక్కితే వైస్‌ చైర్మన్‌ పదవి బీసీ జెడ్పీటీసీకి కేటాయించే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలోని 27 జెడ్పీటీసీ స్థానాలకు గాను 23 స్థానాలను గెలుచుకుని టీఆర్‌ఎస్‌ జెడ్పీలో స్పష్టమైన మెజారిటీ సాధించింది. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు రెండేసి జెడ్పీటీసీలకు పరిమితమయ్యాయి. ఈ రెండు పార్టీలు దరిదాపుల్లో లేవు.
 
క్యాంపు నుంచి గెస్ట్‌హౌస్‌కు.. అక్కడి నుంచి సమావేశానికి.. 
పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నప్పటికీ., టీఆర్‌ఎస్‌ పార్టీ ముందు జాగ్రత్తగా క్యాంపును నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ ప్రత్యేక వసతిగృహానికి టీఆర్‌ఎస్‌ జెడ్పీటీసీలను మంగళవారం రాత్రే తరలించింది. అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని ఇప్పటికే అ పార్టీ జెడ్పీటీసీలందరికి ఆదేశాలు జారీ చేశారు. కాగా చైర్మన్‌ ఎన్నిక కోసం జెడ్పీటీసీలందరిని శనివారం ఉదయం హైదరాబాద్‌ నుంచి డిచ్‌పల్లి వద్ద హైవేపై ఉన్న ఓ ప్రైవేటు గెస్ట్‌హౌస్‌కు తరలించనున్నారు. అక్కడ అధిష్టానం నిర్ణయాన్ని జెడ్పీటీసీలకు అధికారికంగా ప్రకటించి చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ఓటింగ్‌కు తీసుకెళ్లేలా గులాబీ పార్టీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడి ఈ ఎన్నిక సమన్వయ బాధ్యతలు తీసుకున్నారు.
 
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవులతో పాటు, కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు జిల్లా పరిషత్‌ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సమావేశం హాలులో మధ్యాహ్నం ఒంటి గంటకు జెడ్పీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించిన విషయం విధితమే. ఈ మేరకు సమావేశం హాలులో ఎన్నికకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. బారికేడ్లను కట్టారు. ఎన్నిక మొత్తం వీడియో చిత్రీకరణ ఉంటుంది. అలాగే వెబ్‌క్యాస్టింగ్‌ ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.
 
ఎన్నికల అధికారిగా కలెక్టర్‌..  
ఈ ఎన్నికకు ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్‌ ఎం రామ్మోహన్‌ రావు వ్యవహరించనున్నారు. కోఆప్షన్‌ సభ్యుల పదవులకు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు నామినేషన్‌లు వేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక సమావేశం ప్రారంభమవుతుంది. చైర్మన్, వైస్‌ చైర్మన్‌ల ఎన్నికకు ఒకరి పేరును ఒక జెడ్పీటీసీ ప్రతిపాదించాల్సి ఉండగా, మరొకరు బలపరచాలి. పదవులకు చేతులెత్తే విధానం ద్వారా ఎన్నిక ఉంటుంది.

గంట ముందు విప్‌జారీ.. 
జెడ్పీ ప్రత్యేక సమావేశం ప్రారంభానికి ఒక గంట ముందు అన్ని పార్టీలు విప్‌ను జారీ చేయాల్సి ఉంటుంది. ఆయా పార్టీల సభ్యులు విప్‌కు వ్యతిరేకంగా ఓటింగ్‌లో పాల్గొంటే వారి ఓటు చెల్లినప్పటికీ, వారి పదవిని కోల్పోతారు. ఈ మేరకు ముందు జాగ్రత్తగా అన్ని పార్టీలు విప్‌ను జారీ చేయనున్నాయి. ఈ ఎన్నిక సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక సమావేశానికి జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేక ఆహ్వాన సభ్యులుగా సమావేశానికి హాజరు అయ్యేందుకు వీలుంటుంది.

మరిన్ని వార్తలు