టాయ్‌లెట్స్ ప్లీజ్

16 Nov, 2014 04:20 IST|Sakshi
టాయ్‌లెట్స్ ప్లీజ్

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని భావించిన జెడ్పీ చైర్‌పర్సన్ ఉమ ‘సాక్షి’ తరఫున ‘వీఐపీ రిపోర్టర్’గా మారారు. నిత్యం అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నప్పటికీ కాసేపు ప్రజాప్రతినిధి హోదాను పక్కనపెట్టి విద్యార్థుల సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. జిల్లా కేంద్రానికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెజ్జంకి మండలం జంగపల్లి పాఠశాలకు వెళ్లి అక్కడి విద్యార్థులు పడుతున్న వెతలను వెలుగులోకి తెచ్చారు. అందులో భాగంగా ఒక్కో విద్యార్థి వద్దకు వెళ్లి వాళ్లకు ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణ మొత్తం కలియతిరగడంతోపాటు తరగతి గదులన్నింటినీ స్వయంగా పరిశీలించి అక్కడి ఇబ్బందులను ‘సాక్షి’ ద్వారా ప్రజల కళ్లకు కట్టినట్లు చూపించే యత్నం చేశారు.

* మూత్రం వస్తదని మంచినీళ్లు కూడా తాగడం లేదు
* రాత్రయితే మందుతాగి క్లాస్‌రూముల్లో బాటిళ్లు పడేస్తున్నరు
* ఆట స్థలమున్నా ఆడే అవకాశమే లేదు
* ప్రహరీ లేక పాములు, పశువులు వస్తున్నయ్..
* ఊడ్చేటోళ్లు లేరు... అన్ని పనులు మేమే చేసుకుంటున్నం
* ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్ తుల ఉమ ఎదుటజంగపల్లి పాఠశాల విద్యార్థుల గోడు

 
‘మేడం... స్కూళ్లో ఉన్నవేమో రెండు టాయ్‌లెట్స్. నాలుగు వందల మంది స్టూడెంట్స్‌కు ఏం సరిపోతయ్. పైగా నీళ్లు కూడా ఉండవ్. టాయ్‌లెట్ పోవాల్సి వస్తుందని మేం నీళ్లు కూడా తాగడం లేదు. స్కూల్‌కు ప్రహరీ గోడ లేదు. పాములు స్కూల్‌లోకే కాదు... క్లాస్‌రూమ్‌లకు కూడా వస్తున్నాయ్. పశువులు వచ్చి మొక్కలు లేకుండా చేస్తున్నయ్. రాత్రయితే మందు తాగి కొంతమంది బాటిళ్లను స్కూల్‌లోనే వేస్తున్నరు. ఆటలాడుదామంటేగ్రౌండ్‌లో అన్ని బండలే. ఆడితే దెబ్బలు తాకుతున్నయ్’’ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ ఎదుట బెజ్జంకి మండలం జంగపల్లి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ఆవేదన ఇది.
 
తుల ఉమ : గుడ్‌మార్నింగ్ పిల్లలూ... ఎలా ఉన్నారు?
విద్యార్థులు : బాగానే ఉన్నాం మేడం.

తుల ఉమ : స్కూళ్లో ఎంతమంది ఉన్నారు?
విద్యార్థులు : 421 మంది ఉన్నం.

తుల ఉమ : పాఠశాలలో టాయ్‌లెట్స్ ఉన్నాయా?
గొడుగు అపర్ణ : స్కూళ్లో ఉన్నవేమో రెండు టాయ్‌లెట్స్. నాలుగు వందల మంది స్టూడెంట్స్‌కు ఏం సరిపోతయ్. మాకు టాయ్‌లెట్స్‌కు వెళ్లడానికి కూడా ఇబ్బందవుతోంది. టాయ్‌లెట్ పోవాల్సి వస్తుందని మేం నీళ్లు కూడా తాగడం లేదు.
 
తుల ఉమ : ఏ ఊళ్ల నుంచి వస్తున్నారు... ఇబ్బంది లేదా?
ప్రణతి : మా ఊరు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడినుంచి రోజూ వస్తుంటాం. చాలా ఇబ్బందిగా ఉంది. సాయంత్రం క్లాస్ లేట్ అయితే రాత్రి అవుతోంది. భయంగా ఉంది. సైకిల్ ఇప్పించండి.
 
తుల ఉమ : ఎలా వస్తున్నారు... బస్సు సౌకర్యం ఉందా ?
స్వప్న : టైంకు బస్సు లేదు. కొంతమందిమి కలిసి నడుచుకుంటూ వస్తున్నాం. మరికొంతమందిమి ఆటోల్లో రోజుకు పది రూపాయలు ఖర్చుపెట్టుకొని వస్తున్నం.
 
తుల ఉమ : మూడు కిలోమీటర్లు దాటితే ఆర్‌వీఎం వాళ్లు రవాణా చార్జీలు ఇవ్వాలి కదా.. ఇస్తున్నారా?
ప్రణతి : ఇవ్వడం లేదు.
 
తుల ఉమ : అన్ని సబ్జెక్ట్‌లలో టీచర్లున్నారా.. బాగా బోధిస్తున్నారా?
ప్రత్యూష : తెలుగు సబ్జెక్ట్‌లో టీచర్‌లేడు. కంప్యూటర్లున్నా, ఇన్‌స్ట్రక్టర్ లేడు.
 
తుల ఉమ : టీచర్లు మీతో ఎలా ఉంటున్నారు.. బోధన సక్రమంగా చేస్తున్నారా?
రమ్య : బాగానే ఉంటున్నరు. టీచింగ్ బాగానే చేస్తున్నరు. తెలుగు, కంప్యూటర్ టీచర్‌లు లే కపోవడంతో ఆ సబ్జెక్ట్‌లలో వెనుకబడిపోతున్నం.
 
తుల ఉమ : సైన్స్ ల్యాబ్‌లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా?
రమేష్ : సైన్స్ అంటే నాకు చాలా ఇష్టం. సైన్స్‌ఫెయిర్‌లో జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. సైన్స్‌ల్యాబ్‌లో మరిన్ని వసతులు కల్పించి, టెస్ట్ ట్యూబ్స్, కెమికల్స్ పెంచాలి.

తుల ఉమ : స్కూల్‌కు ప్లే గ్రౌండ్ ఉందా?
సాయితేజ్ : స్కూల్‌కు స్థలం ఉన్నా, అన్ని బండలు, లొందలున్నాయి. ఆటలాడితే దెబ్బలు తగులుతున్నయ్. మైదానంగా మార్చాలి.
 
తుల ఉమ : స్కూల్‌కు ప్రహరీ గోడ లేదు కదా..?
కవిత : పాఠశాలకు ప్రహరీగోడ లేదు. తరగతి గదుల్లోకి పాములొస్తున్నయ్. పశువులు తిరుగుతున్నయ్. ప్రహరీగోడ నిర్మించాలి.
 
తుల ఉమ : ప్రహరీ గోడ లేక ఇబ్బందులు పడుతున్నారా?
సుష్మ : ప్రహరీగోడ లేకపోవడంతో బడిలోకి వచ్చి మందు తాగుతున్నరు. తాగిన బాటిళ్లు ఎక్కడపడితే అక్కడ వేస్తున్నరు.
 
తుల ఉమ : స్కూల్ డ్రెస్ ఇస్తున్నారా ?
విద్యార్థులు : డ్రెస్ ఇవ్వడం లేదు. 9,10 తరగతి విద్యార్థులకు కూడా ఇవ్వాలి.
తుల ఉమ : అటెండర్  ఉన్నడా?
ప్రణతి : అటెండర్ లేడు. మేమే వంతుల వారీగా గదులు ఊడ్చుకుంటున్నాం. బెల్ కొడుతున్నం. అటెండర్ పనులు కూడా మేమే చేయాల్సి వస్తోంది.
 
తుల ఉమ : మధ్యాహ్న భోజనం సరిగా పెడుతున్నారా.. బాగుంటుందా?
సింధూజ : అన్నం లేట్‌గా పెడుతున్నరు. చెడిపోయిన కూరగాయలు పెట్టకుండా చూడాలి.

తుల ఉమ : రోజు ఎంతమందికి అన్నం పెడుతన్నరు?
 రాధ, కుక్ : రోజుకు 350 మందికి అన్నం పెడుతున్నం. కిచెన్ షెడ్ లేకపోవడంతో గాలికి అన్నం సరిగా ఉడకడం లేదు. షెడ్ నిర్మించాలి. వర్షం వస్తే కట్టెలతో కష్టమవుతోంది. సిలిండర్ ఇస్తే అన్నం వండడానికి ఇబ్బంది ఉండదు.
 
తుల ఉమ : నీటి సౌకర్యం ఎలా ఉంది?
అపర్ణ : నీటికి ఇబ్బందవుతోంది. మొన్నీమధ్యే బోర్‌వెల్ వేశారు కానీ పనిచేయడం లేదు. నీళ్లు ఇండ్లలో నుంచి తెచ్చుకుంటున్నం.
 
తుల ఉమ : విద్యార్థినులకు ఇంకా ఏయే సమస్యలున్నాయ్?
ప్రత్యూష : చాలా మందిమి ఉన్నాం. రెస్ట్‌రూంలు లేకపోవడంతో ఇబ్బందులున్నాయి. రెస్ట్‌రూంలు ఏర్పాటు చేయాలి.
 
తుల ఉమ : భవిష్యత్‌లో ఏం కావాలునుకుంటున్నారు.. ఎవరైనా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా?
ఆర్.రజని : నాకు రాజకీయాలంటే ఇష్టం. నేను భవిష్యత్‌లో జెడ్పీటీసీ అయి ప్రజలకు సేవల చేయాలనుకుంటున్నా.
 
తుల ఉమ : టీచర్లు పాఠాలు బాగా చెబుతున్నారా.. రెగ్యులర్‌గా వస్తున్నారా.. భయపడకుండా చెప్పండి?
సౌజన్య : మా టీచర్లు పాఠాలైతే బాగా చెబుతున్నారు మేడం. ఇక్కడ చాలా మందిమి ఐఐటీకి కూడా ప్రిపేర్ అవుతున్నాం. మార్కులు కూడా బాగా వస్తున్నాయ్.
 
తుల ఉమ : ప్రభుత్వ పాఠశాలలో ఐఐటీ ప్రిపరేషనా.. వెరీగుడ్! బాగా చదువుకోండి.
 
జెడ్పీ పరిధిలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా
‘సాక్షి వీఐపీ రిపోర్టర్’ కార్యక్రమం అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్ధేశించి మాట్లాడారు. ‘విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ తప్పకుండా పరిష్కరించేందుకు కృషి చేస్తా. ముఖ్యంగా జిల్లా పరిషత్ పరిధిలోని సమస్యలన్నీ వెంటనే పరిష్కరిస్తా’ అని హామీ ఇచ్చారు.

‘నేను పోషించిన కొత్త పాత్రతో విద్యార్థుల సమస్యలు నేరుగా తెలుసుకోగలిగాను. ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసంతో 421 మంది విద్యార్థులున్న ఈ పాఠశాల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తా’నని అన్నారు. ‘రూ.55 లక్షల అంచనా వ్యయంతో నాలుగు అదనపు తరగతి గదులు, ప్రహరీగోడ నిర్మాణానికి నాబార్డ్‌కు రాశాం. నిధులు రాగానే త్వరలో నిర్మాణం చేపడుతాం. ఏడు మరుగుదొడ్లు నిర్మించేందుకు ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జెడ్పీటీసీ సభ్యుడు తన్నీరు శరత్‌రావు ప్రతిపాదనలు పంపించారు.

ఆర్‌వీఎం అధికారులతో మాట్లాడి త్వరగా నిర్మించేట్లు చూస్తా. పాఠశాల సమయ వేళలకు అనుగుణంగా రెండు, మూడు రోజుల్లో బస్సు సర్వీసులు నడుస్తాయ్. మూడు కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం నుంచి వస్తున్న విద్యార్థులకు ఆర్‌వీఎం నుంచి రావాల్సిన చార్జీలను ఇప్పిస్తా. తెలుగు పండిత్ పోస్టును వారం రోజుల్లో భర్తీ చేస్తాం. అటెండర్ లేకపోవడం రాష్ట్ర స్థాయిలో సమస్యగా మారింది. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా. కిచెన్ షెడ్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు వచ్చి ఉన్నాయి. డిజైన్ మార్చే క్రమంలో జాప్యం జరుగుతోంది. మైదానాన్ని చదును చేసేందుకు నిధులు కేటాయిస్తా’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు