అన్నీ అపశకునాలే!

10 Sep, 2014 00:06 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఏ ముహూర్తాన మొదలు పెట్టారో తెలియదు కానీ జిల్లా పరిషత్ భవన నిర్మాణానికి అన్నీ అపశకునాలే ఎదురవుతున్నాయి. శంకుస్థాపన జరిగి పుష్కరకాలం గడుస్తున్నా, ప్రతిపాదిత భవనం పునాదులకే పరిమితమైంది. శిథిలావస్థకు చేరిన జెడ్పీ భవనాన్ని 2003లో నేలమట్టం చేశారు. దీని స్థానంలో జెడ్పీ కాంప్లెక్స్‌ను నిర్మించాలని నిర్ణయించిన అప్పటి పాలకవర్గం అదే ఏడాది జూన్‌లో పునాదిరాయి వేసింది. భవన నిర్మాణం విషయంలో తనను సంప్రదించకుండా ముఖ్యమంత్రిని కలవడంపై అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారం కాస్తా రాజకీయ మలుపు తిరగడంతో జిల్లా పరిషత్ భవన సముదాయం శిలాఫలాకంతోనే సరిపెట్టుకుంది. ఆ తర్వాత జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి కొలువుదీరినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పురాలేదు. చివరకు పాలకవర్గం పదవీకాలం ముగిసే తరుణంలో శాంతించిన సబిత.. జెడ్పీ భవనానికి పాలనాపరమైన అనుమతి లభించేలా చేశారు. దీంతో భవన నిర్మాణానికి మార్గం సుగమమైనా...పురోగతి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది.

 భగీరథ ప్రయత్నం
 పాత బిల్డింగ్ స్థానే జెడ్పీ కాంప్లెక్స్‌ను నిర్మించాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. తొమ్మిది అంతస్తుల భవనాన్ని ప్రతిపాదించిన ఇంజినీరింగ్ శాఖ... ఒక్కో అంతస్తులో 22 వేల చదరపు మీటర్ల స్థలం ఉండేలా డిజైన్ చేసింది. ఈ క్రమంలోనే తొలిదశలో కేవలం జీ+3 అంతస్తులకే పరిమితం చేయాలని భావించి... ఆ మేరకు రూ.10 కోట్లను కేటాయించింది. 2012, జూన్‌లో కాంట్రాక్టర్‌కు పని అప్పగించింది. కాంట్రాక్టు కాలపరిమితి ఈ ఏడాది మే నాటికి పూర్తయినప్పటికీ, పనుల్లో పురోగతి కనిపించకపోవడంతో మరో ఏడాది గడువును పొడిగించింది.

 జిల్లా పరిషత్ ఆవరణలో భారీ బండరాళ్లు ఉండడం, వీటిని పగులగొట్టడం శక్తికిమించిన భారం కావడంతో పనులు ఆలస్యమయ్యాయి. నివాస ప్రాంతాల మధ్య ఉండడం రాళ్లను పగులగొట్టేందుకు అనుమతి లభించకపోవడం కూడా జాప్యానికి మరో కారణం. ఎలాగోలా రాతి కొండలను తొలగించిన కాంట్రాక్టర్‌కు తాజాగా మరో చిక్కు వచ్చి పడింది. ఈ ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటడం... ఇక్కడ వేసిన బోర్లలో నీటి చుక్క రాకపోవడం కొత్త సమస్యకు దారితీసింది. సుమారు 1000-1500 అడుగుల లోతులో దాదాపు 16 బోర్లు వేసినప్పటికీ నీటి అచూకీ లభ్యం కాకపోవడం నిర్మాణ పనులపై తీవ్ర ప్రభావం చూపింది.

 రూ.36 లక్షలు కడితే..!
 బోరుబావులు తవ్వినా నీటి జాడ కనిపించకపోవడంతో జలమండలి నుంచి నల్లా కనెక్షన్ తీసుకోవాలని జెడ్పీ నిర్ణయించింది. వాణిజ్యావసరాల కేటగిరి కింద కనెక్షన్ తీసుకోవాల్సి ఉండడం... దీనికి రూ.36 లక్షలు చెల్లించాల్సి రావడంపై జెడ్పీ యంత్రాంగం పెదవి విరుస్తోంది. ఈ మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని, ప్రభుత్వ భవనం కనుక ఉచితంగా కనెక్షన్ ఇవ్వాలని బేరమాడుతోంది. గృహావసరాల కింద కనెక్షన్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని వేడుకుంటోంది.

వాటర్‌బోర్డు మాత్రం కమర్షియల్‌గా పరిగణించి కనెక్షన్ జారీచేస్తామని, నయాపైసా కూడా తగ్గించే ప్రసక్తేలేదని తేల్చిచెప్పింది. దింపుడు కళ్లెం ఆశలు వదులుకోని జిల్లా పరిషత్ అధికారులు మాత్రం.. పునరాలోచించాలని వాటర్‌బోర్డుకు లేఖ రాయాలని నిర్ణయించారు. కాంట్రాక్టు అగ్రిమెంట్‌లో కేవలం బోర్లు మాత్రమే ప్రతిపాదించిన నేపథ్యంలో... నల్లా కనెక్షన్‌కు సంబంధించిన మొత్తాన్ని ఎవరు భరించాలనే అంశంపై జెడ్పీ తేల్చుకోలేకపోతుంది.
 
 రూ.2 కోట్లు పెంపు..!
 మరోవైపు అంచనా వ్యయాన్ని పెంచేందుకు ఇంజనీరింగ్ శాఖ తెరవె నుక ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బండరాళ్లను తొలగించడం కాంట్రాక్టర్‌కు ఆర్థికభారాన్ని కలిగించినందున.. అదనంగా రూ.2 కోట్ల వ్యయం పెంచాలని భావిస్తోంది.ఇదిలావుండగా, కాంట్రాక్టర్ కూడా భవన నిర్మాణానికి సంబంధించి నిధులు విడుదల చేస్తే తప్ప పనులు కొనసాగించలేనని చేతులెత్తేశారు.

 దీంతో గత  పక్షం రోజులుగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి. రాళ్లను పగలగొట్టేందుకే రూ.కోటిన్నర ఖర్చయిందని, కొంత మేర నిధులు విడుదల చేస్తేనే అడుగు ముందుకేస్తానని తెగేసి చెప్పినట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. దీంతో జెడ్పీ యంత్రాంగం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి మరి.

మరిన్ని వార్తలు