లెక్క చెప్పలేదు.. అనర్హులయ్యారు

19 Apr, 2019 09:49 IST|Sakshi

సాక్షి, యాదాద్రి : 2014లో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేసి ఖర్చు వివరాలు సమర్పించని అభ్యర్థులపై అనర్హత వేటు పడింది. మూడేళ్ల పాటు వీరు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునే పలువురి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

అనర్హుల వివరాలిలా..
యాదాద్రి భువనగిరి జిల్లాలో 136 మంది అనర్హతకు గురయ్యారు. వీరంత త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కోల్పోయారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ జనవరిలోనే అనర్హుల జాబితాను మండలాల వారీగా విడుదల చేసింది. వీరిలో 32 మంది జెడ్పీటీసీ, 104 మంది ఎంపీటీసీ అభ్యర్థులు ఉన్నారు.

లెక్కలు చూపకపోవడమే వీరి తప్పు
ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి తాను ఖర్చు చేసిన మొత్తాన్ని ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం లెక్కలు చూపించాలి. నామినేషన్‌ వేసినప్పటి నుంచి పోలింగ్‌ రోజు వరకు ఖర్చు వివరాలను స్థానిక ఎన్నికల అధికారులకు అందజేయాలి. నిర్ణీత గడువులోపు ఖర్చు వివరాలను అందించలేకపోయిన వారందరూ ఓడిపోయారు. ఓటమితో డీలా పడ్డ అభ్యర్థులు ఖర్చుల వివరాలను ఇవ్వలేడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. దీంతో ఎన్నికల కమిషన్‌ వారిని మూడేళ్ల పాటు అనర్హులుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.
అధికారులనుంచి అందని సమాచారం,

అభ్యర్థుల నిర్లక్ష్యం!
 అధికారుల నుంచి సరైన సమాచారం లేకపోవడం, ఎన్నికల ఖర్చు లెక్కలు ఇవ్వడంలో అభ్యర్థులు చూపిన నిర్లక్ష్యంవల్ల వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భువనగిరి మండలంలో జెడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయిన ఓ అభ్యర్థి ఇటీవల జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో నామినేషన్‌ వేయడానికి వెళ్లాడు. గత ఎన్నికల్లో జెడ్పీటీసీగా పోటీ చేసి ఎన్నికల ఖర్చు చెప్పనందున నీవు పోటీ చేయడానికి అర్హత కోల్పోయినట్లు అధికారులు చెప్పడంతో అతను కంగుతిన్నాడు. చేసేది లేక తన భార్యతో నామినేషన్‌ వేయించాడు.

అర్హత కోల్పోయిన ఎంపీటీసీ అభ్యర్థులు వీరే
ఆలేరు మండలంలో 9,బీబీనగర్‌ 9 ,చౌటుప్పల్‌  22, రాజపేటలో ముగ్గురు, తుర్కపల్లి 38 మంది, వలిగొండలో 6, యాదగిరిగుట్ట 17 మంది అభ్యర్థులు ఎన్నికల ఖర్చు వివరాలను అందజేయలేదు.  

జెడ్పీటీసీ అభ్యర్థులు..
ఆలేరు మండలంలో ఇద్దరు, భువనగిరి 4, బొమ్మలరామారం 5, చౌటుప్పల్‌ 3, సంస్థాన్‌నారాయణపురం 7, భూదాన్‌పోచంపల్లి 3, రాజాపేట 4, తుర్కపల్లి 2, వలిగొండ మండలంలో ఇద్దరు పోటీకి అర్హత కోల్పోయారు.

మరిన్ని వార్తలు