మన'సుమ'నోహరం!

23 Mar, 2018 08:59 IST|Sakshi
చిన్నారులతో యాంకర్‌ సుమ

నిజ జీవితంలోనూ తలపించిన ‘తథాస్తు’

అనాథ చిన్నారుల మధ్య పుట్టినరోజు వేడుకలు

కుటుంబంతో సహా వచ్చిన యాంకర్‌ సుమ   

సాక్షి, సిటీబ్యూరో: ఆర్పీ పట్నాయక్‌ దర్శకత్వంలో ఇటీవల నిర్మించిన ‘తథాస్తు‘ షార్ట్‌ ఫిల్మ్‌ కేవలం ఒకే ఒక్కరోజులోనే లక్షకుపైగా వ్యూస్‌ దాటిన విషయం విదితమే. అది ఇప్పటికి 4 లక్షల వ్యూస్‌తో అందరి అభిమానం పొందుతోంది. ఇందుకు కారణం ‘ఎంతోమంది అనాథలుగా జీవనం కొనసాగిస్తున్న ఈ సమాజంలో ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తూ వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారూ ఈ తరంలో ఎలా మార్పు తేవచ్చొ ఈ షార్ట్‌ ఫిల్మ్‌ ద్వారా దర్శకుడు ‘ఆర్పీ పట్నాయక్‌‘  అద్భుతంగా రూపొందించారు. ఇందులో ప్రధాన పాత్రను సుమ కనకాల పోషించారు. ఈ కథలో తమ పాప పుట్టిన రోజును అందరివలే సాదాసీదా పార్టీలతో కానిచ్చేయకుండా.. అనాథ పిల్లలతో కలిసి జరుపుకొని వారి కడుపు నిండటంతో పాటు ఆనందం పంచినట్టవుతుందని.. తన పాపకు సర్‌ప్రైజ్‌ ఇవ్వటమే ‘తథాస్తు’ అసలు సారాంశం.

నిజంగా అలాగే..  
కేవలం తాను నటించిన ఈ షార్ట్‌ ఫిల్మ్‌ వరకే పరిమితం కాకుండా నిజజీవితంలో సైతం పుట్టిన రోజైన మార్చి 22న భర్త రాజీవ్‌ కనకాల, అత్త, కూతురు, బంధువులతో గురువారం సికింద్రాబాద్‌లోని ‘సర్వ్‌ నీడి’ అనాథాశ్రమానికి వచ్చారు సుమ. అక్కడి 30 మంది అనాథ పిల్లలతో మూడు గంటల పాటు గడిపారు. వారి ఆటాపాటలను వీక్షిస్తూ కబుర్లు చెప్పారు. పిల్లలకు మిఠాయిలు, పండ్లు పంచి పెట్టారు. కేక్‌ కట్‌ చేసి పిల్లలతో భోజనం చేశారు. సంస్థ నిర్వాహకుడు గౌతమ్‌కుమార్‌తో చర్చించారు. సంస్థ సేవలను కొనియాడారు. తన పుట్టిన రో జును అనాథ పిల్లల మధ్య జరుపుకోవడం మరిచిపోని సంతృప్తినిచ్చిందని సుమ వివరించారు.

ఆమెది స్పందించే హృదయం.. 
సుమ బుల్లి తెర యాంకర్‌ మాత్రమే కాదు. సందర్భాన్ని బట్టి ఎదుటి వారి అవసరాన్ని బట్టి స్పందించే హృదయం ఆమెది. సాటివారికి సాయం చేయాలనేది ఆమె మనస్తత్వం. ‘తథాస్తు’ షార్ట్‌ ఫిల్మ్‌లో నటించేందుకు రియల్‌ లైఫ్‌ జెన్యూన్‌ హ్యూమన్‌ కావాలనే ఉద్దేశంతో సుమను ఒప్పించాను. మా యూనిట్‌ తరపున ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు.  
    – ఆర్పీ పట్నాయక్‌

మరిన్ని వార్తలు