రామ్‌చరణ్‌ రంగస్థలంకు బ్రేక్‌

5 Apr, 2018 08:16 IST|Sakshi
రంగస్థలం చిత్రంలో ఓ దృశ్యం ,ప్రదర్శన లేక ఖాళీగా ఉన్న థియేటర్‌

చెన్నై(తమిళసినిమా) : నటుడు రామ్‌చరణ్, సమంత కలిసి నటించిన రంగస్థలం చిత్రానికి బ్రేక్‌ పడింది. కంగారు పడకండి ఈ బ్రేక్‌ అనేది తమిళనాడు వరకేలెండి. వివరాల్లోకి వెళ్లితే.. కోలీవుడ్‌ ప్రస్తుతం చాలా క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఒకపక్క క్యూబ్‌ సంస్థల మంకు పట్టు, మరోవైపు థియేటర్ల యాజమాన్యం పంతంతో కోలీవుడ్‌ కష్టాల్లో పడింది. నిర్మాతల మండలికి డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల మధ్య మొదలైన సమస్య ఆ తరువాత నిర్మాతలమండలికి, థియేటర్ల సంఘం వరకూ పాకింది. ఈ సంఘాల మధ్య జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో మార్చి ఒకటవ తేదీ నుంచి కొత్త చిత్రాల ప్రదర్శనల నిలిపివేత, మార్చి 16వ తేదీ నుంచి షూటింగ్‌లు, ఇతర కార్యక్రమాలను రద్దు చేస్తూ నిర్మాతలమండలి నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయంతో అటు డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, థియేటర్ల యాజమాన్యం దిగివస్తుందని భావించిన నిర్మాతల మండలి నిర్వాహకులకు అది జరగలేదు. థియేటర్ల మాజమాన్యం పాత చిత్రాలను, ఇతర భాషా చిత్రాలను ప్రదర్శించుకుంటున్నారు.దీంతో నిర్మాతల మండలి తీసుకున్న కొత్త చిత్రాల విడుదల రద్దు నిర్ణయం పెద్దగా వారిపై ప్రభావం చూపడం లేదు.

కాగా ఇటీవల విడుదలైన రామ్‌చరణ్, సమంత జంటగా నటించిన తెలుగు చిత్రం రంగస్థలం తమిళ స్టార్‌ హీరోల చిత్రాలకు దీటుగా తమిళనాడులో అత్యధిక థియేటర్లలో ప్రదర్శంపబడుతోంది. ఇది తమిళ నిర్మాతలకు షాక్‌ ఇచ్చిందనే చెప్పాలి. దీంతో సమ్మె సమయంలో ఇతర భాషా చిత్రాల విడుదలను అడ్డుకోవాలన్న ఒత్తిడి నిర్మాతల మండలిపై పడింది. దీంతో రంగంలోకి దిగిన ఆ మండలి అధ్యక్షుడు విశాల్‌ తెలుగు చిత్ర నిర్మాతల మండలితో మాట్లాడి తెలుగు చిత్రాలను తమిళనాట విడుదల చేయకుండా తమ సమ్మెకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. విశాల్‌ ప్రయత్నం ఫలించింది. తెలుగు నిర్మాతలమండలి ఈ నెల 8వ తేదీ నుంచి తెలుగు చిత్రాలను తమిళనాడులో విడుదల చేయబోమని ప్రకటించారు.

ఐపీఎల్‌ దెబ్బ..
అయితే ఇక్కడి వరకూ బాగానే ఉంది. తాజాగా తమిళ నిర్మాతలకు ఐపీఎల్‌ క్రికెట్‌ రూపంలో మరో ముంపు ముంచుకొస్తోంది. అవును తమిళ నిర్మాతల మండలి కొత్త చిత్రాలను విడుదల చేయరాదని నిర్ణయం తీసుకోవడంతో ఇతర భాషా చిత్రాలను, పాత తమిళ చిత్రాలను ప్రదర్శించుకుంటున్న థియేటర్ల యాజమాన్యం నష్టాలనే ఎదుర్కొంటోందన్నది వాస్తవం. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గడంతో కార్మికుల జీతాలు, ఇతరత్రా  నిర్వహణ భారం పెరుగుతోంది. నిర్మాతల మండలితో సయోధ్య కుదిరే పరిస్థితి కానరావడం లేదు. ఇలాంటి సమయంలో థియేటర్ల మాజయాన్యానికి ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీలు అదృష్టంగా మారాయి.

ఆ పోటీలను నేరుగా థియేటర్లలో ప్రదర్శించాలన్న నిర్ణయానికి వచ్చారు. అందుకు నగర పోలీసు కమిషనర్‌ అనుమతి కోరుతూ వినతి పత్రాన్ని అందించారు. అందులో కోలీవుడ్‌లో సమ్మె కారణంగా కొత్త చిత్రాల విడుదల నిలిచిపోయిందని, దీంతో థియేటర్లకు ప్రేక్షకుల రాక తగ్గిపోయి నష్టాలను చవిచూస్తున్నామని, అదేవిధంగా ప్రభుత్వానికి జీఎస్‌టీ పన్ను రావడం లేదని పేర్కొన్నారు. కాబట్టి ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీలను థియేటర్లలో ప్రదర్శించుకోవడానికి అనుమతి ఇస్తే, ప్రభుత్వానికి, థియేటర్ల యాజమాన్యానికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీల ప్రదర్శనకు కనుక అనుమతి లభిస్తే మరో 51 రోజులు థియేటర్ల యాజమాన్యానికి తమిళ చిత్రాల అవసరం ఉండదు. మరి తెలుగు చిత్రాలను నిలువరించినట్లు నిర్మాతల మండలి ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీల ప్రదర్శనను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందా? ఏం జరుగుతుందో చూడాలి.

మరిన్ని వార్తలు