శ్రీ ఎదుటివారిని నొప్పించేది కాదు

26 Feb, 2018 09:01 IST|Sakshi
జయసుధ

జయసుధ, జయప్రద, శ్రీదేవి.. ఒకానొక సమయంలో ఈ ముగ్గురు నాయికలూ ఇండస్ట్రీని రూల్‌ చేశారు. ఆ రోజుల్లో మీ మధ్య బాగా పోటీ ఉండేదా?
జయసుధ: శ్రీదేవి, నేను కలిసి దాదాపు 8,9 వరకూ సినిమాలు చేశాం. నాకు ఎవ్వరితో పోటీ ఉండేది కాదు. ఎందుకంటే నేను ఎవ్వరితో కంపేర్‌ చేసుకోను కాబట్టి. శ్రీదేవి అంత అందంగా కనిపించాలి అనుకుంటే పోటీ ఉండేది. నేను అలా చేసేదాన్ని కాదు. నేను శ్రీదేవి అంత హైట్‌ కాదు. ఆమె ఫిగర్‌ నాకు లేదు. నేను చేయతగ్గదల్లా నా పాత్రను నేను బాగా చేయడమే. నా క్యారెక్టర్‌ ఏంటని మాత్రమే చూసుకునేదాన్ని. మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ప్రేమాభిషేకం’ పెద్ద హిట్‌. ఆ తర్వాత ‘అనురాగ దేవత, గజదొంగ’ సినిమాలు వంటి చాలా సినిమాలు ఉన్నాయి.

శ్రీదేవిగారు కాంపిటీషన్‌లో ఉన్న హీరోయిన్లతో బాగుండేవారా?
జయసుధ:ఆమె చాలా సాఫ్ట్‌ అండి. నేనైనా సెట్‌లోకి వచ్చి అదీ ఇదీ మాట్లాడేదాన్ని. మేం కూడా సాఫ్ట్‌... బట్‌ తను అసలు మాట్లాడదు. ఇప్పుడని కాదు.. చిన్నప్పటి నుంచి చాలా సిగ్గు తనకి. నాకు తన ఆరేళ్ల వయసు అప్పటి నుంచి తెలుసు. నాకంటే ఐదారేళ్లు చిన్న అంతే. మద్రాసులో మా ఇళ్లు దగ్గర దగ్గర ఉండేవి. వాళ్ల ఇంటికి వెళ్లితే డోర్‌ పక్కన నుంచొని తొంగి చూసేది. వాళ్ల  అమ్మగారు బాగా మాట్లాడేవారు. శ్రీదేవి కూడా అందరితో కలిసిమెలిసి ఉండేది కానీ సిగ్గు, మొహమాటం ఎక్కువ. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా వచ్చింది కదా. మామూలుగా అయితే  అలాంటి వాళ్లు ఫుల్‌గా మాట్లాడతారు లేదా క్వైట్‌గా ఉంటారు. శ్రీదేవి రెండో రకం. శ్రీదేవిగారికి ప్రతీదీ వాళ్ల అమ్మే చూసుకునేవారు. అందుకేనేమో ఆమె రిజర్వ్‌గా ఉండేవారు..అలా అంటే షూటింగ్‌ సమయాల్లో మా నాన్నని దాటి నాతో ఎవ్వరూ మాట్లాడటానికి వీలు లేదు. ఆ అమ్మాయికి బిగినింగ్‌లో వాళ్ల అమ్మ చూసుకునేవారు. ఆ తర్వాత స్టార్‌ అయ్యాక అన్నీ తనే చూసుకునేది. కానీ ఎందుకో తక్కువ మాట్లాడేది..

ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లు ఒకే సినిమా చేస్తున్నారంటే ఎవరెవరు ఎలాంటి కాస్ట్యూమ్‌ వేసుకుంటున్నారో, ఎవరి క్యారెక్టర్‌ లెంగ్త్‌ ఎంతో తెలుసుకుంటుంటారని ఇండస్ట్రీలో అంటుంటారు. అప్పట్లో అలా ఉండేదా?
జయసుధ:అప్పుడూ ఉండేది. కానీæ క్యారెక్టర్‌ విషయంలో ఉండేది. ఆవిడ ఏ వేషం వేస్తుంది నేను ఏం వేస్తున్నాను అని. అంతే కానీ వేరే ఎందులోనూ ఉండేది కాదు. శ్రీదేవి తన క్యారెక్టర్‌ ఏంటి? తన డ్రెస్‌ ఏంటి? ఏం చేయాలి? అని ఆలోచించేది తప్ప వేరే ఏదీ పట్టించుకునేది కాదు. చాలా ప్రొఫెషనల్‌. చిన్నప్పుడు మనకు ఒక పని చేయమని అప్పజెప్పితే ఎలా చేస్తామో అలాగే ఉండేది తన మనస్తత్వం. సెట్‌లో తనకు ఇబ్బందిగా ఏదైనా అనిపిస్తే.. ఆ విషయాన్ని డిప్లొమాటిక్‌గా చెప్పేది. ఎదుటివారిని నొప్పించని మనస్తత్వం శ్రీదేవిది.

మీరిద్దరు ఒకరినొకరు ఏమని పిలుచుకునేవాళ్లు?
జయసుధ: నేను శ్రీ అనీ పప్పీ అనీ పిలిచేదాన్ని. తను మాత్రం నన్ను జయసుధగారు అనే పిలిచేది. నేను తన కంటే ముందు హీరోయిన్‌ అయ్యాను కాబట్టి అలా పిలిచేది.

హిందీ సినిమాల్లో శ్రీదేవిగారి సక్సెస్‌ గురించి?
జయసుధ:అప్పటికే హేమమాలినీ డ్రీమ్‌ గాళ్‌ అనిపించుకున్నారు. బట్‌ శ్రీదేవి ఈజ్‌ డిఫరెంట్‌. తనొక సెన్సేషన్‌. ఆ రోజుల్లో  పెద్ద స్టార్‌డమ్‌ చూశారు. హిందీ, తమిళం, తెలుగు ఎక్కడికి వెళ్లినా సూపర్‌ సక్సెస్‌ అయ్యారు. తను హిందీలో బిజీగా ఉంటే ఆవిడ చేయాల్సిన కొన్ని తెలుగు పిక్చర్స్‌ నేను చేయాల్సి వచ్చింది. రామారావుగారితో శ్రీదేవి చేయాల్సిన ‘సరదా రాముడు’ నేను చేశాను. శ్రీదేవి హిందీకి వెళ్లడం వల్ల అలా జరిగింది. వాస్తవానికి శ్రీదేవి పెద్ద హీరోయిన్‌ అవుతుందని రామారావుగారితో తను ‘వేటగాడు’ చేసినప్పుడే ఆయన భార్య బసవ తారకమ్మగారు చెప్పారు. ‘వేటగాడు’ సినిమా రిలీజ్‌కు ముందు ప్రివ్యూ వేశారు. ఆ సమయంలో నేను, రామారావుగారు ఏదో సినిమా షూటింగ్‌లో ఉన్నాం. ‘ఈ అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్‌ అవుతుంది. చాలా ముద్దు ముద్దుగా ఉంది’ అని తారకమ్మగారు రామారావుగారితో అన్నారట.  ఆ విషయాన్ని రామారావుగారు మాతో చెప్పారు. అప్పుడు కూడా మాకు ఎవరో కొత్త హీరోయిన్‌ వస్తున్నారు అనే ఆలోచన, అసూయ అనేదే లేదు. ఎవరి సినిమాలు వాళ్లకు ఉండేవి. ఎవరి స్టైల్‌ వాళ్లకు ఉంది.

శ్రీదేవిగారి కూతుళ్లతో మీకు పరిచయం ఉందా?
జయసుధ:ఎప్పుడో నాలుగేళ్ల ముందు కలిశాను. మహేశ్వరి వాళ్ల బ్రదర్‌ మార్యేజ్‌లో కలిశాం. ఆ తర్వాత వాళ్ల అమ్మాయి సినిమాలో యాక్ట్‌ చేయబోతుందనగా కలిశాం. ఆ సినిమా బాగా రావాలని డిస్కస్‌ చేశాం. జాన్వీ సక్సెస్‌ అవ్వాలని అంటుండేది. ఎంత సెలబ్రిటీ అయినా ఒక కూతురికి తల్లే కదా. వాళ్ల ఇంట్లో ఏ ఫంక్షన్‌ ఉన్నా మమ్మల్ని కచ్చితంగా పిలుస్తుంది. మేం చైన్నైలో ఉన్నప్పుడు  తన ప్రతి పుట్టినరోజుకు వాళ్ల అమ్మగారు పిలిచేవారు. అసలు శ్రీదేవితో నా పరిచయమే తన బర్త్‌డేస్‌ వల్ల.తన కుమార్తెను సిల్వర్‌ స్క్రీన్‌ పై చూసుకోలేకపోయారు...అవును. అది చాలా బాధపడాల్సిన విషయమే. శ్రీదేవి మరణం తీరని లోటు.

మరిన్ని వార్తలు