సామ్రాట్‌కు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌

30 Jan, 2018 16:03 IST|Sakshi

సామ్రాట్‌కు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌

హర్షిత కుటుంబీకుల ఆరోపణలన్నీ అవాస్తవం

నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు..

కోపంతోనే సీసీ కెమెరాలు ధ్వంసం చేశా

అలా చేయడం నా తప్పే..

సాక్షి, హైదరాబాద్‌ : టాలీవుడ్‌ నటుడు సామ్రాట్‌ రెడ్డిని జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. తన ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారని స్వయంగా అతడి భార్య హర్షితా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు సామ్రాట్‌ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అనంతరం అతడిని మియాపూర్‌ కోర్టులో పోలీసులు హాజరుపర్చారు.14 రోజులు జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశాల జారీ చేశారు. మరోపక్క తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ సామ్రాట్‌ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై కోర్టు నిర్ణయం బుధవారానికి వాయిదా పడింది. దాంతో సామ్రాట్‌ను పోలీసులు జైలుకు తరలించారు.

తన భర్త సామ్రాట్‌ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ గతంలో హర్షితారెడ్డి రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదు చేసిన కేసు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో తన ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడి బంగారు, ఇతర వస్తువుల్ని చోరీ చేశారనే ఫిర్యాదు ఆధారంగా మియాపూర్‌ పోలీసులు సామ్రాట్‌పై ఐపీసీలోని 380,427ఆర్‌/డబ్ల్యూ, 201 సెక్షన్ల కింద కింద కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు.

అలా చేయడం తప్పే: సామ్రాట్‌
తనపై వస్తున్న ఆరోపణలను టాలీవుడ్‌ నటుడు సామ్రాట్‌ రెడ్డి ఖండించాడు. తన భార్య హర్షిత రెడ్డి, వాళ్ల కుటుంబీకులు చేస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవమని అతడు పేర్కొన్నాడు. ఇంటి నుంచి డబ్బులు, నగలు దొంగిలించానని హర్షిత ఆరోపిస్తూ కేసు పెట్టిందని, అయితే తన ఇంట్లో నుంచి తనకు కావల్సిన వస్తువులు మాత్రమే తీసుకున్నట్లు సామ్రాట్‌ రెడ్డి తెలిపాడు. ఇంట్లో సీసీ కెమెరాలను తానే ధ్వంసం చేసినట్లు అతడు అంగీకరించాడు.

కోపంతోనే అలా చేశానని, అది తన తప్పేనంటూ...అయితే తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని సామ్రాట్‌ రెడ్డి స్పష్టం చేశాడు. తాను డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు ఆరోపిస్తున్నారని, అలా అయితే తాను ఇప్పటివరకూ పోలీసులకు ఎందుకు పట్టుబడలేదని ప్రశ్నించాడు. డ్రగ్స్‌ వాడకంపై పోలీస్‌ శాఖ సీరియస్‌గానే ఉందని చెప్పుకొచ్చాడు. కావాలనే తనపై హర్షితా రెడ్డి కుటుంబీకులు ఆరోపణలు చేస్తున్నారని సామ్రాట్‌ రెడ్డి వాపోయాడు.

హర్షితకు సామ్రాట్‌పై అనుమానం..
సామ్రాట్‌ ఎవరితో మాట్లాడినా హర్షిత అనుమానపడేదని సామ్రాట్‌ తల్లి తెలిపారు. హర్షితకు  మొదటి నుంచి సామ్రాట్‌ సినిమాలు చేయడం ఇష్టం లేదని తెలిపారు. ప్రతిదానికీ హర్షిత గొడవ పెట్టుకునేందని చెప్పారు. రెండేళ్ల క్రితం సామ్రాట్‌, హర్షితకు పెళ్లి అయిందని,  మూడు నెలల నుంచి భార్యభర్తల మధ్య గొడవులు జరుగుతున్నాయని తెలిపారు. 

సామ్రాట్‌కు లేని అలవాటు లేదు: హర్షిత
మరోవైపు సామ్రాట్ రెడ్డి భార్య హర్షిత మాట్లాడుతూ... సామ్రాట్‌కు అన్ని అలవాట్లు ఉన్నాయని, హుక్కా సెంటర్‌లో డ్రగ్స్‌ కూడా తీసుకున్నాడని తెలిపింది. ‘సినిమా ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిలతో సామ్రాట్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎంత నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. నన్ను వదిలించుకోవాలని అని చూడటమే కాకుండా చాలాసార్లు నాపై దాడి చేశాడు. మా ఇంట్లో వస్తువులు కూడా ఎత్తుకెళ్లాడు. తనతో కలిసి ఉండే ఉద్దేశం నాకు లేదు. పెద్దలతో రాజీ ప్రయత్నం చేసినప్పటికీ విఫలం కావడంతోనే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. కోర్టులోనే అన్ని విషయాలు తెలుస్తాయి.’ అని ఆమె పేర్కొంది.

మరిన్ని వార్తలు